Telangana: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత బిఆర్ఎస్ పార్టీకి దూరం కానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బిఆర్ఎస్ రజతోత్సవ సభ సాక్షిగా తన రాజకీయ వారసుడు కేటీఆర్ మాత్రమేనని కేసీఆర్ పరోక్షంగా సంకేతాలు ఇవ్వడంతో కవిత పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లిక్కర్ స్కాంలో జైలుకి వెళ్లి వచ్చిన నాటి నుంచి ఆమెను కేసీఆర్ కుటుంబం రాజకీయాలకు దూరంగా పెడుతు వస్తోంది. నాటి నుంచి జాగృతి పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. తాజాగా రజతోత్సవ సభకు సంబంధించి కవితకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోగా.. తన ప్రసంగంలో కేటీఆర్, హరీష్ పేర్లు ప్రస్తావించిన కేసీఆర్ ఆమె పేరు ఎక్కడా ఎత్తలేదు. దీంతో అలకబూనిన కవిత కార్యక్రమం మధ్యలోనే సభాప్రాంగణం నుంచి వెనుదిరిగారు. మరి ఇప్పడు కవిత దారెటు? ఒంటరిగా పార్టీ పెట్టే యోచనలో ఉన్నారా? లేక ఏదైనా ఇతర పార్టీలో చేరతారా? లేక జాగృతిలో క్రియాశీలకంగా మారుతారా..? అనేవి మిలియన్ డాలర్ ప్రశ్నలు.
ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లిన నాటినుంచి ఆమెపై రాజకీయంగా కుట్ర జరుగుతోంది. ఆమె జైల్లో ఉన్నంత కాలం కనీసం చూడటానికి తండ్రి కేసీఆర్ వెళ్లలేదు. జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత ఆమెను పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనకుండా బిఆర్ఎస్ జాగ్రత్తపడింది. ఆఖరికి తెలంగాణ భవన్ లో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలకు సైతం ఆమెను దూరం పెట్టారు. ఈ విషయం గ్రహించిన కవిత..జాగృతి పేరుతో ఒంటరిగా వివిధ కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమాలకు బిఆర్ఎస్ శ్రేణులు దూరంగా ఉండాలని పార్టీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. తాజాగా బిఆర్ఎస్ రజతోత్సవ సభలో కూడా అవమానం ఎదుర్కోవడంతో పార్టీలో ఆమె భవిష్యత్‌పై సందేహాలు వస్తున్నాయి.
ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా..?
తండ్రి కేసీఆర్ వైఖరిపై గుర్రుగా ఉన్న కవిత.. త్వరలోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఆమె ఎమ్మెల్సీ పదవికాలం 2028 జనవరితో ముగియనుంది. ఈనేపథ్యంలోనే బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చే ముందు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్త పార్టీ పెట్టడమా? లేక వేరే పార్టీలోకి వెళ్లడమా? వంటి విషయాలపై శ్రేయాభిలాషులతో చర్చలు జరుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కవిత దారెటు? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.