Gvl: ‘యాదవ’ సత్యాను చూసైనా నేర్చుకోవయ్యా, అని ‘నియోగ’ జీవీఎల్‌ నరసింహారావుకు ఎవరు చెప్పాలి?

Nancharaiah merugumala senior journalist:

” మెదడును సరిగ్గా వాడుకుని బాబు కేబినెట్లో మంత్రి దాకా ఎదిగిన ‘యాదవ’ సత్యాను చూసైనా నేర్చుకోవయ్యా, అని ‘నియోగ’ జీవీఎల్‌ నరసింహారావుకు ఎవరు చెప్పాలి? “

మొన్నటి ఏప్రిల్‌ నెల వరకూ సత్యకుమార్‌ యాదవ్‌ అంటే గత కొన్నేళ్లుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటోరియల్‌ పేజీలో ప్రతి వారం నిలువు వ్యాసం రాసే (అది కూడా వై.సత్యకుమార్‌ పేరుతో) బీజేపీ నేతగానే తెలుసు. తర్వాత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే సమయానికి ఈ వై సత్యకుమార్‌ దిల్లీలో ఉన్న తన పలుకుబడితో అనంతపురం జిల్లా ధర్మవరం టికెట్‌ బీజేపీ కేంద్ర నాయకత్వం ద్వారా సంపాదించడంతో అందరి దృష్టీ ఈ ‘యువనేత’పై పడింది. మాజీ ఉపరాష్ట్రపతి. ఒకప్పటి బీజేపీ దిగ్గజం ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి రక్తబంధువుతో సత్యాకు పెళ్లయిన విషయం, ఆయన సొంత జిల్లా కడప అని, సొంతూరు ప్రొద్దుటూరు అని తెలిసింది. ఇంకా ఆయన మహారాష్ట్రలో మూలాలున్న పశుపోషణ కులంలో పుట్టారని కూడా వెల్లడైంది. అంతేకాదు మదనపల్లె పాలిటెక్నిక్‌ లో ఏబీవీపీ తరఫున ‘సమరశీలత’తో నిండిన ‘దూకుడు’ కార్యకలాపాల వల్ల దిల్లీకి సత్యా మకాం మార్చాల్సి రావడంతో ఆయన దశ తిరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్పీపీకి బలమైన కేంద్రంగా భావించే ఈ ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి గత 11 ఎన్నికల్లో (1972 నుంచీ) కేవలం కమ్మ, రెడ్డి అభ్యర్ధులు మాత్రమే ఎన్నికవుతూ వస్తున్నారు. దీంతో ‘రెడ్డీ కాదు, కమ్మా కాదు. పొరుగున ఉన్న కడప జిల్లాలో మూలాలు కలిగి ఉండి, న్యూఢిల్లీతో మంచి లింకులు పెట్టుకున్న వై సత్యకుమార్‌ కు ఫ్యాక్షన్‌ చరిత్ర కూడా ఉన్న ధర్మవరంలో పోటీచేయడానికి ఎంత ధైర్యం? అదీగాక, సత్యా కుటుంబం మహారాష్ట్రకు చెందిన పశుపోషణ వృత్తితో ముడిపడిన కులం. వారు పేరు చివర పెట్టుకునే ‘జాధవ్‌’ యావవ శబ్దాన్ని పోలినదే అయినా, అన్ని కులాల వారూ మహారాష్ట్రలో జాధవ్‌ అనే తోక తగిలించుకుంటారు. అతను తెలుగు గొల్ల కులానికి సమానమైన మరాఠీ కులంలో పుట్టి ఉండొచ్చు,’ అంటూ బుధవారం కేసరపల్లిలో ఏపీ మంత్రిగా ప్రమాణం చేసిన సత్యకుమార్‌ యాదవ్‌ గురించి ఏప్రిల్‌ చివర, మే ఆరంభంలో ఎడాపెడా మాట్లాడిన జనం రాష్ట్రంలో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు.


యాదవుడు కాదని ప్రచారం చేస్తే సత్యా ఓడిపోతాడని కేతిరెడ్డికి ఎవరు చెప్పారో?

ధర్మవరంలో వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసిన సిటింగ్‌ సభ్యుడు, ఇప్పటికే రెండుసార్లు గెలిచిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అయితే–తాను ఈ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎలా గెలవాలనే విషయంపై ఇతర మంచి మార్గాలు ఆలోచించకుండా –‘సత్యకుమార్‌ యాదవ్‌ కానే కాదు. మన తెలుగోడే కాదు,’ అని నిరూపించడంపైనే ఎక్కువ సమయం, వనరులు ఖర్చు చేశాడు. మదనపల్లె పాలిటెక్నిక్‌ లో సత్యాకు జనరల్‌ కేటగిరీలో సీటు వచ్చిందంటూ అతని అడ్మిషన్‌ కాపీ సంపాదించి దానిని విస్తృతంగా పంపిణీ చేశాడు. సోషల్‌ మీడియా ద్వారా రోజూ తన ఓటర్లను పలకరించే కేతిరెడ్డికి కమ్మా రెడ్డి కాని మరాఠీ యాదవుడు సత్యా చేతిలో ఓటమి తప్పదనే భయంతోనే చివరి రోజులు ఎన్నికల ప్రచారం చేసుకోవాల్సి వచ్చింది. తాను తన పేరు చివర పెట్టుకున్న యాదవ్‌ అనే తోకకు భయపడిన వైఎస్సార్సీపీ సభ్యుడు, అభ్యర్థి –ఒక పక్క తాను యాదవుడిని కాదని ప్రచారం చేస్తుంటే సత్యాకు మరో వైపు నుంచి ఇంకో ముప్పు ముంచుకొచ్చింది. ‘మా కులం కాకపోయినా సత్యాకు మా ఆడపిల్లను ఇస్తే ఆమెతో అతను సరిగా కాపరం చేయకుండా వదిలివేశాడు,’ అంటూ వెంకయ్య నాయుడు గారి సమీప బంధువు ఒకరు మాట్లాడిన వీడియో ఒకటి టీవీ చానళ్లు సహా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. జూన్‌ 4 ఓట్ల లెక్కింపు రోజున ఈ నియోజవర్గం గ్రామీణ ప్రాంతాల్లో పది వేల వరకూ మెజారిటీతో ఉన్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరం పట్టణ ఓట్ల లెక్కింపులో చివరికి ఓటమి పాలయ్యాడు. ఆంధ్రజ్యోతి పాఠకులకు వై.సత్యకుమార్‌ గా మాత్రమే తెలిసిన సత్యా చివరికి తెలుగు యాదవుడిగా మారి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సాహబ్‌ ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి కొత్త కేబినెట్లో మంత్రి కావడం మామూలు విషయం కాదు.


సత్యాను చూసి జీవీఎల్‌ వంటి పేరుమోసిన నియోగులు నేర్చుకోవాల్సింది ఉంది!
ఇక్కడ చెబితే బావుండదు కాని–ప్రత్యక్ష ఎన్నికల్లో ఊరుగారి ఊరు నుంచి అదే పొరుగూరు నుంచి పోటీచేసి గెలవాలని తెగ తాపత్రయపడే నర్సరావుపేటలో మూలాలనున్న బీజేపీ మాజీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు వంటి నాయకులు కాస్తయినా ధర్మవరం సత్యా జీవితం నుంచి నేర్చుకుంటే మంచిదనిపిస్తోంది. మంచి, ఉన్నత ఉపాధ్యాయ–అధ్యాపక నియోగ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుంటుపల్లి వీఎల్‌ నరసింహారావు గారు ఇంగ్లిష్‌ భాషా పరిజ్ఞానం, నియోగ తెలివితేటలతో యూపీ నుంచి రాజ్యసభకు బీజేపీ టికెట్‌ పై ఆరేళ్ల క్రితం ఎన్నికయ్యారు. రెండోసారి యూపీ నుంచి రాజ్యసభకు నామినేషన్‌ దక్కదనే వాస్తవం జీవీఎల్‌ కు కాస్త ముందుగానే తెలిసింది. అందుకే, అంతటితో ఆగకుండా ఎందరో హేమాహేమీలను అందలాలు ఎక్కించి చివరికి నేలకేసి బాదిన గొప్ప నగరం విశాఖపట్నం నుంచి లోక్‌ సభకు బీజేపీ టికెట్‌ పై పోటీచేయడానికి జీవీఎల్‌ గత కొన్నేళ్లుగా నానా రకాల ప్రయత్నాలు చేశారు. తాను ఆరు వేలో ఏడు వేలో తెలియదుగాని నియోగ కుటుంబంలో పుట్టినా… తెలుగు కాపుల రక్షకుడిగా విశాఖ నగరానికి వచ్చినట్టు ఎన్నో కార్యక్రమాలు కూడా ఆయన నిర్వహించారు. ఈ ఉత్తరాంధ్ర నగరంలో 2022లో దివంగత కాపు మహానేత వంగవీటి మోహనరంగారావు గారి విగ్రహం ముందు కాపులకు నిజమైన నేస్తంగా నరసింహారావు గారు ఎన్నెన్నో కబుర్లు చెప్పారు. గన్నవరం విమానాశ్రయానికి వంగవీటి రంగా గారి పేరు పెట్టాలని, ఉగ్రవాదానికి బలైన రాజీవ్‌ గాంధీ పేరు హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి పెట్టగా లేనిది సంఘ విద్రోహశక్తుల కత్తిపోట్లకు బలైన రంగా గారి పేరు ఆయన కన్నుమూసిన జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టుకు ఎందుకు పెట్టకూడదని కూడా జీవీఎల్‌ ప్రశ్నించడం సకలాంధ్ర ప్రజానీకానికి మెత్తటి షాకిచ్చింది. చివరికి టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా విశాఖ ఎంపీ సీటు తెలుగుదేశంకు (నందమూరి బాలకృష్ణ గారి అల్లుడు, గీతం ఎంవీవీఎస్‌ మూర్తి గారి మనవడు మతుకుమిల్లి శ్రీభరత్‌ కు) కేటాయించడంతో ఈ అపర పీవీ నరసింహారావు గారికి ఒక్క ఏడుపే తక్కువ. మరాఠీ యాదవుడే కావచ్చుగాని బుర్ర ఉపయోగించి రాజకీయంగా పైకొచ్చిన సొంత పార్టీకి చెందిన సత్యకుమార్‌ యాదవ్‌ దగ్గర కొన్నాళ్లు పాఠాలు చెప్పించుకుంటే జీవీఎల్‌ గారు ఎప్పటికైనా కోస్తాంధ్రలో ఎక్కడి నుంచైనా లోక్‌ సభకు ఎన్నికయ్యే అవకాశం తప్పక వస్తుంది.

Optimized by Optimole