Rahulgandhi: ప్రియాంక- రాహుల్‌ మాదిరి..షర్మిల, జగన్‌ మధ్య ‘ అనురాగబంధం’ ఎప్పుడు పుట్టేనో..!

Nancharaiah merugumala senior journalist:

” ప్రియాంక వారణాసిలో పోటీచేస్తే మోదీ ఓడిపోయేవారన్న రాహుల్‌.. ! షర్మిల, జగన్‌ మధ్య కూడా ఇలాంటి ‘అన్నాచెల్లెళ్ల అనురాగబంధం’ ఎప్పుడు పుట్టేనో..! “

చెల్లి ప్రియాంకపై అన్న రాహుల్‌ కు ఈ విశ్వాసం మార్చి 16కు ముందు ఉండి ఉంటే.. కాంగ్రెస్‌ లోక్‌ సభలో సెంచరీ మిస్సయ్యేది కాదేమో. తమ కుటుంబ ‘పాత సొంత’ నియోజకవర్గం అమేఠీలో కాంగ్రెస్‌ అభ్యర్ధి కిశోరీలాల్‌ శర్మను గెలిపించినందుకు ఓటర్లకు ధన్యవాదాలు చెప్పడానికి మంగళవారం రాయబరేలీలో ఏర్పాటు చేసిన సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. పై మాటలు ధైర్యంగా చెప్పారు. కాశీలో నరేంద్రమోదీతో చెల్లి ప్రియాంక తలపడి ఉంటే రెండు మూడు లక్షల ఓట్ల తేడాతో కాషాయ ప్రధాని ఓడిపోయేవారన్న రాహుల్‌ మాటలు కాంగ్రెస్‌ పార్టీలో ద్విగుణీకృతమైన ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తున్నాయి. నామినేషన్ల ఆఖరి రోజు వరకూ రాయబరేలీలో తన పోటీ విషయం వెల్లడిం^è డానికి జడిసిన రాహుల్‌ కు… సమాజవాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తో పొత్తు ఫలించిందని జూన్‌ 4న తెలిశాక చాలా చాలా ధైర్యం వచ్చినట్టుంది. అమేఠీలో మాజీ నటి, మాజీ మంత్రి స్మృతీ ఇరానీపై ప్రియాంక గాంధీ వాడ్రాను పోటీపెట్టడానికే భయపడిన నెహ్రూ–గాంధీ కుటుంబానికి ఇప్పుడు ఉత్తర్‌ ప్రదేశ్‌ లో ఎస్పీ తోడు ఉండడంతో భారత ఎన్నికల ప్రజాస్వామ్యంపై విశ్వాసం పెరిగినట్టు ‘గోచరిస్తోంది’. ఎన్నికల బరిలో స్వయంగా దిగడానికి 2009 నుంచీ వెనుకాడుతున్న 52 సంవత్సరాల ప్రియాంక గాంధీ వాడ్రా రేపు అన్న ఖాళీ చేసే ఏదో ఒక ఎంపీ సీటు నుంచి (వయనాడ్‌ లేదా రాయబరేలీ) ఉప ఎన్నికలో ఇక ధైర్యంగా పోటీచేసే పరిస్థితులు వచ్చేసినట్టే. అదీగాక, ఇప్పుడు లోక్‌ సభలో దివంగత ప్రధాని ఇందిరమ్మ కుటుంబ సభ్యుల సంఖ్య 4 నుంచి ఒకటికి పడిపోయింది. మొన్నటి ఎన్నికల ముందు రాయబరేలీలో పోటీకి వెనకాడిన ఆమె పెద్ద కోడలు సోనియా కొన్ని నెలల ముందు రాజస్తాన్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. చిన్న కోడలు మేనకాగాంధీ బీజేపీ తరఫున సుల్తాన్‌ పుర్‌ నుంచి పోటీచేసి ఎస్పీ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు, చిన్న మనవడు ఫిరోజ్‌ వరుణ్‌ గాంధీ మరోసారి లోక్‌ సభకు పోటీ చేయడానికి ఆయన పార్టీ (బీజేపీ) కేంద్ర నాయకత్వం టికెట్‌ ఇవ్వనే లేదు. హౌసాఫ్‌ పీపుల్‌ కు 2024 లోనూ ధైర్యంగా పోటీచేసిన రాహుల్‌ భయ్యా.. రెండు చోట్ల నుంచీ గెలిచిన విషయం తెలిసిందే. ఈ లెక్కన ఏదో ఒక ఉప ఎన్నికలో ప్రియాంక పోటీచేసి గెలిస్తే..భారతదేశ ప్రథమ కుటుంబ సభ్యుల సంఖ్య పార్లమెంటు దిగువ సభలో కనీసం రెండుకు పెరుగుతుంది.

బహిరంగసభల్లో, ఎన్నికల ర్యాలీల్లో అన్నాచెల్లెళ్ల మధ్య బహిరంగంగా వ్యక్తమయ్యే ఆప్యాయతలు, అనురాగాలకు కొత్త పార్లమెంటు అప్పుడు సరైన వేదిక అవుతుంది. లోక్‌ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరుసటి రోజున పాప్యులర్‌ సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో అన్న రాహుల్‌ శక్తిసామర్ధ్యాలను కొనియాడుతూ ప్రియాంక పెట్టిన ఒక పోస్టు ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ‘కొందరికి తెలియకపోవచ్చు గాని, అందరి కన్నా నువ్వు ధైర్యవంతుడివి. నీ గుండెలో ప్రేమ, సత్యం, దయను నింపుకుని ప్రత్యర్ధులతో నువ్వు పోరాడావు. నీ చెల్లినైనందుకు నాకు గర్వంగా ఉంది,’ అని ప్రియాంక ఈ ‘ఎక్స్‌’ పోస్టులో అన్నయ్యపై ప్రశంసల వర్షం కురిపించింది. కుటుంబ దైవం శివుడినేగాక కరుణామయుడు ఏసు క్రీస్తును సైతం సమానంగా నమ్మే ప్రియాంక, రాహుల్‌ గాంధీలను చూసైనా ఆంధ్రా బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌– వైఎస్‌ జగన్, వైఎస్‌ షర్మిల సమీప భవిష్యత్తులో బహిరంగ కీచులాటలు మానేసి ప్రేమను మాత్రమే తమ మధ్య పంచుకుంటే అఖిలాంధ్ర ప్రజానీకంలో కొందరైనా మారుమనసు పొందుతారు.