మద్యం తాగితే… ఎందుకు కొందరు ఇంగ్లిష్‌ లో మాట్లాడతారు?

Nancharaiah merugumala senior journalist: మద్యం తాగితే… ఎందుకు కొందరు ఇంగ్లిష్‌ లో మాట్లాడతారు?ఈ ప్రశ్నకు 50 ఏళ్ల క్రితం హిందీ నటదర్శకుడు ఐఎస్‌ జోహార్‌ చెప్పన జవాబు!

================

ఇంగ్లిష్‌..

వింగ్లిష్‌….!!

అనే శీర్షికతో ఒక బ్లాక్‌ బోర్‌ ్డ, దాని కింద ‘ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లికర్‌’ సీసాలున్న ఫోటోలతో మిత్రుడు నీల్‌ కొలికిపూడి గారు 2018 సెప్టెంబర్‌ 23న పెట్టిన తన పాత పోస్టును ఈరోజు తన వాలు మీద మరోసారి అతికించగా, అర గంట క్రితం దాన్ని చదివాను. ఈ బ్లాక్‌ బోర్డ్‌ మీద– స్పీక్‌ ఇంగ్లిష్‌ ఇన్‌ జస్ట్‌ 30 మినట్స్‌– అని రాసి ఉంది. బోర్డు కింద మద్యం బాటిల్సు ఉన్నాయి కాబట్టి మనం స్వేచ్ఛగా మందుకొడితే– సునాయాసంగా మనం ఆంగ్ల భాషలో మాట్లాడవచ్చనేది (అదే..నేర్చుకోవచ్చనేది) నీల్‌ గారి పోస్టు తాత్పర్యంగా నాకు బోధపడింది. ఇది చదివాక నాకు తాగుడు–ఇంగ్లిష్‌ కు ఉన్న బంధానికి సంబంధించి 51 ఏళ్ల నాటి ఓ విషయం గుర్తుకొచ్చింది. ఐదో తరగతి నుంచి పదో క్లాసు దాకా గుడివాడ ఎయిడెడ్‌ స్కూళ్లలో తెలుగు మీడియంలో చదువుకున్న  నేను 1972 జూన్‌ మాసంలో స్థానిక ఏఎనార్‌ కాలేజీలో ఇంటర్మీడియెట్‌ లో చేరా. ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకున్న కొందరు మిత్రులను చూశాక–ఇంగ్లిష్‌ భాషను కాస్త తొందరగా నేర్చుకోవడానికి మా నాన్న ఎం.ఆర్‌.నాగేశ్వరరావు మాట విని ఇంగ్లిష్‌ మేగజీన్లు చదవడం మొదలెట్టాను. టీనేజ్‌ పిల్లలకు బాగా ఆసక్తి ఉండే సినిమా మాస, పక్ష, వార పత్రికలు చదివితే ఇంగ్లిష్‌ బాగా వస్తుందనే నాన్న సలహాతో అప్పుడప్పుడూ ఫిల్మ్‌ ఫేర్, స్టార్‌ అండ్‌ స్టయిల్, స్క్రీన్‌ వంటి ఆంగ్ల పత్రికలు చదవడం మొదలెట్టాను. అది అలవాటుగా మారింది 1972–74 మధ్య కాలంలో. అలా ఒక రోజు ఫిల్మ్‌ ఫేర్‌ తాజా సంచికలో క్రమం తప్పకుండా ఒక పేజీలో వచ్చే ఐఎస్‌ జోహార్‌ ప్రశ్నలు–జవాబులు చదివాను. అప్పట్లో మంచి దర్శకుడిగా కూడా పేరు సంపాదించిన బాలీవుడ్‌ నటుడు జోహార్‌ ఇంగ్లిష్‌ లో మంచి హాస్యం రంగరించి జవాబులిచ్చేవాడు. ఈ పేజీ కోసమే కొందరు అప్పట్లో ఫిల్మ్‌ ఫేర్‌ చదివేవాళ్లు. పంజాబీ హిందూ కుటుంబంలో పుట్టిన ఇందర్‌ సేన్‌ జోహార్‌ (1920–84)కు ఇంగ్లిష్‌ లో తెలివిగా జవాబులు ఇచ్చే సామర్ధ్యం ఉంది. నేను ఆరోజు ఫిల్మ్‌ ఫేర్‌ జోహార్‌ ప్రశ్నలు–జవాబుల పేజీలో ఒక ఆసక్తికర ప్రశ్నకు ఆయన జవాబు చదివి బాగా ఆనందించా. ‘భారతదేశంలో మద్యం తాగినాక చాలా మంది ఇంగ్లిష్‌ లో మాట్లాడతారు, ఎందుకో చెప్పండి?’ అన్న ప్రశ్నకు–‘ప్రపంచంలో ఎక్కడైనా లికర్‌ తాగితే ఏ మనిషైనా ‘రాయల్‌’గా ఫీలవుతాడు. తానో రాజుననుకుంటాడు. ఇండియాను పరిపాలించిన చివరి రాజులు ఇంగ్లిష్‌ వారు కావడంతో దేశంలో మందు మెదడుకు ఎక్కినాక జనం ఇంగ్లిష్‌ లో మాట్లాడతారు,’ అని జోహార్‌ ఇచ్చిన జవాబు ఎంతగా నాకు నచ్చిందంటే అది ఇప్పటికీ గుర్తుంది.

మంగళగిరిలో బలమైన కుటుంబ, సాంస్కృతిక, సామాజిక మూలాలున్న పాత్రికేయ సోదరులు నీల్‌ కొలికపూడి గారి పోస్టు చదివాక ఐఎస్‌ జోహార్‌ ‘మందు–ఇంగ్లిష్‌’ జవాబు గుర్తుకొచ్చింది. పాకిస్తాన్‌ లో భాగమైన పంజాబ్‌ లో 1920లో జన్మించిన జోహార్‌ తన జీవిత కాలంలోం ఐదు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయినా, ఏడు పదులు నిండకుండానే ఆయన 1984లో కన్నుమూయడం భారతీయుల దురదృష్టం. ఐఎస్‌ జోహార్‌ తమ్ముడు యశ్‌ జోహార్‌ కొడుకే ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌. మరో ఆసక్తికర విషయం ఏమంటే…ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్‌ సినిమా ‘లారెన్స్‌ ఆఫ్‌ అరేబియా’లో గాసిమ్‌ అనే పాత్రలో నటించారు.