‘భడవా’ అనే తెలుగు బ్రామ్మల తిట్టుకు అర్ధం ఏమిటో ‘పరిశోధించే’ ఆలోచన వచ్చింది!

‘భడవా’ అనే తెలుగు బ్రామ్మల తిట్టుకు అర్ధం ఏమిటో ‘పరిశోధించే’ ఆలోచన వచ్చింది!

Nancharaiah merugumala senior journalist: లోక్‌ సభలో బీఎస్పీ కువర్‌ దానిశ్‌ అలీని బీజేపీ గుజ్జర్‌ సభ్యుడు రమేశ్‌ బిధూఢీ తిట్టడం వల్లే….‘భడవా’ అనే తెలుగు బ్రామ్మల తిట్టుకు అర్ధం ఏమిటో ‘పరిశోధించే’ ఆలోచన వచ్చింది!

=================

తెలుగు సినిమాల్లో ముఖ్యంగా బాపు, కె.విశ్వనాథ్‌ వంటి బ్రాహ్మణ దర్శకుల సినిమాల్లో, తర్వాత కొందరు కాపు, కమ్మ, రెడ్డి డైరెక్టర్ల చిత్రాల్లో– వయసులో చిన్నవారిని పెద్దలు కొన్ని సందర్భాల్లో ‘ఓరి భడవా!’ అని ఆశ్చర్యం, కొద్దిపాటి దిగ్భ్రాంతితో కూడిన సమ్మిళిత భావాలతో తిట్టడం ఎప్పటి నుంచో గమనిస్తూనే ఉన్నాం. తెలుగులో మరీ ఎక్కువ పదాలు తెలియని నాకు ‘భడవా’ అంటే సరిగ్గా అర్ధమయ్యేది కాదు. అప్పుడే కాదు, ఈరోజు వరకూ తెలియదు. ఈ మూడక్షరాల తిట్టుకు అర్ధం లిటిల్‌ ఈడియట్‌ మాదిరిగా ‘పిల్ల మూర్ఖుడు’ అనుకునేవాణ్ని తెలియక. బెహన్‌ చూత్, మాదర్చోద్, బాడ్ఖావ్‌ వంటి అనేక ఉర్దూ–హిందీ తిట్ల మాదిరిగానే తెలుగు చలనచిత్రాల్లో బ్రాహ్మణ పాత్రధారులు ఈ ‘భడవా’ అనే తిట్టును అర్ధం తెలీకుండానే వాడేస్తున్నారనే భావనతో ఉండేవాణ్ని. గురువారం రాత్రి భారత లోక్‌ సభలో పాలక బీజేపీ సభ్యుడు రమేశ్‌ బిధూఢీ తన తోటి 48 ఏళ్ల బీఎస్పీ మెంబర్‌ కువర్‌ దానిశ్‌ అలీతో గొడవపడ్డాడు. పిచ్చి కోపంలో 62 ఏళ్ల దక్షిణ దిల్లీ ఎంపీ బిధూఢీ పశ్చిమ యూపీ ఆమ్రోహా నుంచి బీఎస్సీ టికెట్‌ పై గెలిచిన ముస్లిం రాజపూత్‌ సభ్యుడు కువర్‌ దానిశ్‌ అలీని ‘భఢవా (తార్పుడుగాడు), కట్వా (సున్తీ చేయించుకున్నోడు), ముల్లా ఉగ్రవాదీ (ముస్లిం టెరరిస్టు), ఆతంకవాదీ (ఉగ్రవాది)’ అని తిట్టిపోశాడు. ఈ విషయాన్ని దానిశ్‌ అలీ స్పీకర్‌ ఓం బిఢ్లాకు ఫిర్యాదు చేయగా, ఆయన బిధూఢీకి వార్నింగ్‌ ఇచ్చారు. బీజేపీ సభ్యుడి తిట్లను పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించారు. సభకు బిధూఢీ క్షమాపణ చెప్పడంతో తాత్కాలికంగా వివాదం ముగిసింది. ఈ గొడవ ఫలితంగా తెలుగు సినిమాలో వాడిన తిట్టు భడవ–భఢవా అనీ, అది సంస్కృత పదం అని తెలిసింది. సంస్కృతంలో భఢవా అంటే తార్పుడు పని చేసేవాడని (ఆంగ్లంలో పింప్‌) అర్ధమైంది. తెలుగులో ఈ మాట భడవగా మారిపోయింది. గొర్రెల కాపరులైన ఓబీసీ గుజ్జర్లు రాజస్తాన్, పంజాబ్, హరియాణా, పశ్చిమ యూపీ, మధ్యప్రదేశ్‌ లో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. ఉత్తరాదిన గుజ్జర్లు, జాట్లు, యాదవులు, కుర్మీలు వంటి ఓబీసీలు, జాటవ్‌ వంటి చర్మకారులు (ఎస్సీలు) కూడా బాగానే ౖ‘హెందవీకరణ’ చెందడంతో వారు భఢవా వంటి సంస్కృతం తిట్లు ఎక్కువే వాడుతుంటారు. ఇక నిన్న పార్లమెంటులో రమేశ్‌ బిధూఢీ చేతిలో తిట్లుతిన్న దానిశ్‌ అలీ పూర్వీకులు ఇస్లాంలోకి మారక ముందు హిందూ రాజపుత్రులు కావడం వల్ల  ఆయన పేరులో కువర్‌ అనే మాట కనిపిస్తోంది. ఈ ముస్లిం రాజపూత్‌ లు ఈ కారణంగానే ఇప్పుడు కూడా తమ పేర్ల ముందు   ‘కువర్‌’ (కుమార్‌ అనే అర్ధం) అనే మాటను తగిలించుకుంటున్నారు.