హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పార్టీ మార్పు ప్రచారంలో నిజమెంత? అసెంబ్లీలో కేసీఆర్ ఈటల జపం చేయడంలో దాగున్న మర్మం ఏంటి? తన ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే కేసీఆర్ అలా మాట్లాడిండు అన్న ఈటల వాదనలో వాస్తవమెంత? అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బిఆర్ ఎస్ మైండ్ గేమ్ మొదలెట్టిందా? మీడియాను బేస్ చేసుకుని ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసిందా?
తెలంగాణ రాజకీయం సినిమా ట్విస్టులను తలపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గరపడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా కొత్త చర్చకు దారితీశాయి.హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరెత్తడానికి ఇష్టపడని బిఆర్ ఎస్ నేతలు .. ఆయన పేరు జపించడం స్టేట్ ఆఫ్ ది టాపిక్ గా మారింది. ద్రవ్య వినిమయ బిల్లుపై సూచనలు.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఈటల సలహాలు పరిగణలోకి తీసుకుంటామని..స్వయంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్.. బడ్జెట్ జనరల్ డిస్కషన్ సమాధానమిస్తూ మంత్రి హరీష్ రావు సైతం ఈటల పేరును పదేపదే ప్రస్తావించడం.. మా ఈటల రాజేందరన్న అంటూ కొత్త పలుకుపలకడంతో ఆశ్చర్యపోవడం అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల వంతైంది.దొరికిందే అదనుగా కేసీఆర్ అనుకూల మీడియా కేసీఆర్ .. ఈటల బిఆర్ ఎస్ లో చేరతారంటూ విష ప్రచారం మొదలెట్టింది.
అటు పార్టీ మార్పుపై ఈటల స్పందించారు.కేసీఆర్ మెతక మాటలకు పడిపోయేంత అమాయకున్ని కాదని.. తరుచూ పార్టీలు మారే సంస్కృతి.. నిమిషానికో మాట మాట్లాడే స్వభావం తనది కాదని ఈటల తేల్చిచెప్పారు. 2004లో సైతం ఇదే తరహాలో వైఎస్ తో కలుస్తానని విష ప్రచారం చేశారని.. కానీ ఆనాడు పార్టీ మారలేదని గుర్తుచేశారు. తనపై ప్రభుత్వం చేసిన దాడులు.. కుట్రలను జీవితంలో మరిచిపోనని.. ఇమేజ్ డ్యామేజ్ చేయాలన్నదే కేసీఆర్ వ్యూహామని ఈటల కుండబద్ధలు కొట్టారు.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గరపడుతుండటంతో బిఆర్ ఎస్ పార్టీ మైండ్ గేమ్ మొదలుపెట్టిందన్నది బీజేపీ నేతల వాదనగా వినిపిస్తుంది. ఇప్పటికే కేసీఆర్ అనుకూల మీడియాలొ.. ఈటలను బద్నాం చేసే విధంగా వార్తలను పరిచారని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారులు ఈటల వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. వారి మధ్య చిచ్చుపెట్టేందుకు కేసీఆర్ వ్యూహాం పన్నారని కాషాయం నేతలు విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
మొత్తంగా ఈటలపై బిఆర్ఎస్ నేతలు ప్రేమ కురిపించడం వెనక బలమైన కారణం ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితుల కనిపిస్తుండటంతో ఎలాగైనా ఈటలను తమవైపు తిప్పుకోవాలన్నది కేసీఆర్ వ్యూహాంగా వారు భావిస్తున్నారు.