శేఖర్ కంభంపాటి (సీనియర్ జర్నలిస్ట్ ): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన పై మాట్లాడే వాళ్ళు సీఎం రాష్ట్రానికి కార్పొరేట్ దిగ్గజాలతో మాట్లాడి తెచ్చే పెట్టుబడులపై కాకుండా ఇంగ్లీష్ మాట్లాడే విధానంపై సోషల్ మీడియా లో ఎక్కువ చర్చ పెడుతున్నారు కొంతమంది. రేవంత్ రెడ్డి మాట్లాడే ఇంగ్లీష్ ను ట్రోల్ చేస్తుంటే, మరికొంత మంది భాష ముఖ్యం కాదని సమర్థిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సపోర్టర్లు మాత్రం రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడక రాష్ట్ర పరువంతా తీశారనే భావనలో ఉన్నారు. అటు రాష్ట్రాన్ని నడిపించాలంటే సీఎంకు కావాల్సింది ఇంగ్లీష్ మాత్రమేనా? పరిపాలనా సమర్థత, ఇతర సమార్థ్యాలు అవసరం లేదా? అనే లైన్ లో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కెసిఆర్ , కేటీఆర్ ఇంగ్లీష్ లో మాట్లాడిన మాటలను రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ తో మిక్స్ చేసి మరీ విమర్శలు చేస్తున్నారు. గులాబీ పార్టీ నేతలు మరో అడుగు ముందుకు వేసి, దావోస్ లో రేవంత్ రెడ్డి తనకు తాను నవ్వుల పాలు చేసుకోవడం తో పాటు తెలంగాణ రాష్ట్రానికి తలవంపులు తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ ఎలా మాట్లాడారు అనేది అసలు విషయమే కాదు. ఆయన ఇంగ్లీష్ ఫ్లూయెట్ గా మాట్లాడలేనంత మాత్రాన పెట్టుబడులు రావడం లేదనేది సరికాదు. రాష్ట్రంలోని పరిస్థితులను, ఇక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నారు. *ప్రతి విషయాన్ని నెగెటివ్ కోణంలో చూసే విధానాన్ని మార్చుకుంటే మంచిది ప్రతిపక్ష నేతలు.* అయినా, ఇన్వెస్టర్లు సీఎంలు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారా? లేదా? అని చూసి పెట్టుబడులు పెట్టారు. అక్కడ తమ కంపెనీలు పెట్టేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయా? లేవా? పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది? లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? ట్రాన్స్పోర్ట్ సిస్టం ఇలా ఉంది .. అనేది మాత్రమే చూస్తున్నారు. కాదు, ఇంగ్లీష్ మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటే పెట్టుబడిదారులు అమెరికా, ఇంగ్లండ్ లాంటి దేశాలకే పరిమితం అవుతారు.
దేశంలో ఇంగ్లీష్ మాట్లాడే ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ అక్కడ పెట్టుబడుల వర్షం ఏమీ కురవడం లేదు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ లాంటి వాళ్లు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడినా అక్కడ కార్పొరేట్ ఇన్వెస్ట్ మెంట్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలి. *అన్ని భాషలు బాగా మాట్లాడుతారు అని చెప్పుకునే ముఖ్యమంత్రులను కూడా ప్రజలు ఫామ్ హౌస్ కు పరిమితం చేసిన విషయాన్ని మరచిపోకూడదు.* హైటెక్ యుగపురుషుడు అని చెప్పుకునే చంద్రబాబు కూడా భాష లో పండితుడేమీ కాదు. రేవంత్ మీద ఈ స్థాయి విమర్శలు తమ ఓటమికి కారణం అయ్యారనే గులాబీ నేతల, కార్యకర్తల కడుపు మంట మాత్రమే అని అర్ధం అవుతుంది.
ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులలో చాలా మందికి హిందీ పెద్దగా రాదు. కానీ, వారు కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. అంత ఎందుకు, *ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన టి. అంజయ్యకు ఉన్న చదువు ఏపాటిది?* నందమూరి తారక రామారావు కి ఇంగ్లీష్ వచ్చేదా? అలాంటప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్పంచ్ స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు కి భాషా పరీక్ష పెట్టిన తర్వాతనే పోటీ చేసే అవకాశం ఇవ్వాలి. కనీసం తన పనులు తను చేసుకోలేని స్టీఫెన్ హాకింగ్ శాస్త్రవేత్త అద్భుతమైన ఖగోళ శాస్త్రవేత్త. కేవలం కుర్చీకి అంకితం అవుతాడు. కేటీఆర్ కి భాష ఉన్నంత మాత్రాన సంస్కారం ఉంది అని చెప్పలేం. చాలా మంది దేశాధ్యక్షులలోనూ ఇంగ్లీష్ పెద్దగా రాని వాళ్లు ఉన్నారు. మన ప్రధాని మోడీకి కూడా ఇంగ్లీష్ గొప్పగా ఏమీ రాదు. అయినప్పటికీ అంతర్జాతీయ సదస్సులు, సమావేశాల్లో పాల్గొన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.
నిజానికి నాయకుడికి ఉండాల్సిన లక్షణం దేనికీ భయపడకపోవడం. తాను చేయగలను అని ముందుకు దూసుకు వెళ్లేవాడే నిజమైన నాయకుడు. నిజానికి జగన్, కేటీఆర్ తో పోల్చితే రేవంత్ రెడ్డికి పెద్దగా ఇంగ్లీష్ రాదు. కారణం వాళ్లు అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న విద్యా సంస్థల్లో చదివారు ఇంగ్లీష్ భాష మీద మంచి అవగాన ఉంది. కానీ, *రేవంత్ రెడ్డి తెలుగు మీడియంలో చదివారు. ఆయనదంతా విలేజ్ బ్యాగ్రౌండే.* చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చారు . వాళ్ల మాదిరిగా రాజకీయ కుటుంబ నేపథ్యం కూడా లేదు. కానీ, ఆయన చెప్పాలి అనుకున్నది చెప్పేశారు. *వాస్తవానికి చాలా మంది యువకులకు సీఎం రేవంత్ రెడ్డి కసి ఉంటే మనిషి సాధించలేనిది ఏదీ లేదంటూ ఒక రోల్ మోడల్ గా నిలిచాడు.* వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రెసిడెంట్‌తో పాటు వివిధ దేశాల ప్రతినిధులు, వివిధ కంపెనీల సీఈవోలు, యజమానులతో సమావేశం అయ్యారు. ఏకంగా దాదాపు 40 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఎన్ని వచ్చాయి అనేదే ముఖ్యం కానీ, రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ ఎలా మాట్లాడారు అనేది ముఖ్యం కాదని సోషల్ మీడియా బ్యాచ్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.
నోట్ :- మన రాష్ట్ర పరువు తీస్తున్నది సోషల్ మీడియా లో పోస్ట్లు పెడుతూ అవహేళనగా మాట్లాడేవాళ్ళు అని నా ఉదేశ్యం … కంటెంట్ పూర్తిగా కాకుండా ఎడిటింగ్ చేసి మరి బ్లేమ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటే అన్ని పార్టీల నాయకులతో పాటు ప్రతి ఒక్కరికి మంచిది