Telangana: బిఆర్ఎస్ చేసిన తప్పే కాంగ్రెస్ చేస్తుందా..?

Telanganacongress:

ఎన్నికలు ముగియగానే ప్రతీ రాజకీయ పార్టీ ప్రధానంగా అధికారం చేపట్టినవారు ‘‘రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం. ఇక పై అభివృద్ధిపైనే పూర్తి దృష్టి కేంద్రీకరిస్తాం…’’ అంటూ తియ్యటి మాటలను వల్లెవేస్తారు. ఆచరణలో మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్‌ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యతిస్తున్నట్టు కనిపిస్తోంది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పరిపాలనతో సంతృప్తి చెందని ప్రజలు ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో, అంతకు మించి పార్లమెంట్‌ ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పారు. రెండు ఎన్నికల్లోనూ చతికిలబడ్డ బీఆర్‌ఎస్‌ ఈ పరాజయాలతో పాఠం నేర్చుకుంటుందో లేదో తెలియదు కానీ.. అధికార కాంగ్రెస్‌ మాత్రం లోగడ బీఆర్‌ఎస్‌ చేసిన తప్పుల బాటలోనే నడుస్తోంది.

 

పడగొడతామంటే ఊరుకుంటామా..?ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇటీవలి తన డిల్లీ పర్యటన సందర్భంగా చేసిన పలు వ్యాఖ్యలను పరిశీలిస్తే వారి లక్ష్యం స్పష్టమవుతోంది. ‘‘మా ప్రభుత్వాన్ని పడగొడుతామంటే ఊరుకోవాలా..? పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరే…. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీకి సహాయ సహకారులు అందించింది..’’ అంటూ తాము చేస్తున్న పార్టీ ఫిరాయింపులను సమర్థించుకుంటున్నారు. ఈ మాటలను లోతుగా పరిశీలిస్తే కాంగ్రెస్‌ నేతలు ప్రజాభిప్రాయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదా..? లేదా ప్రజాస్వామ్యం, ప్రజాసంక్షేమం కంటే తెరవెనుక తమ లక్ష్యాలే ప్రధానమా..? అనే సందేహాలొస్తున్నాయి.

2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు 88 స్థానాలతో అధికారాన్ని కట్టబెట్టినా కేసీఆర్‌ నియంతృత్వ వైఖరితో ప్రజాతీర్పుకు భిన్నంగా కాంగ్రెస్‌ నుండి ఎమ్మెల్యేలను చేర్చుకొని ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా  లేకుండా చేశారు. పార్టీ ఫిరాయింపులు నచ్చని ప్రజలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్‌కు 64 స్థానాలతో స్పష్టమైన అధికారమిచ్చారు. ఇదే సమయంలో విజ్ఞులైన ఓటర్లు ప్రజాస్వామ్యంలో అవసరమైన పక్షంలో ప్రభుత్వాన్ని ఎండగట్టేలా ప్రతిపక్షం క్రియాశీలక పాత్ర పోషించాలని కోరుకున్నారు. ప్రతిపక్ష పార్టీల ఉనికే లేకుండా చేసిన కేసీఆర్‌ను గద్దె దించేస్తూనే ప్రతిపక్ష ప్రాధాన్యత తెలిసిన ప్రజలు బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చి కాంగ్రెస్‌ను అందలమెక్కించారు. అయితే ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతూ అధికారమే పరమావధి అనే లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు తమ ప్రభుత్వం పడిపోతుందని అంటున్నాయని, దీనికి ప్రతిస్పందనగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నామని రేవంత్‌ రెడ్డి చెబుతున్నారంటే స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఆయనకు వారి సొంత ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేదా..? అనే అనుమానాలొస్తున్నాయి. మొదటి నుండి అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉండే కాంగ్రెస్‌లో సీనియర్లు, గ్రూపులు, కుమ్ములాటలు సహజమే. రాష్ట్రంలో అధికారానికి పదేళ్లు దూరంగా ఉండడంతో మరోసారి ఎక్కడ ఓడిపోతామో అనే భయంతో పార్టీ నాయకులంతా సమిష్టిగా పోరాడి బీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకొని గద్దెనెక్కారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌లో రాజకీయ నిర్ణయాలకు సంబంధించి సీనియర్లతో ఎప్పుడెలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ప్రతి అంశానికి హైకమాండ్‌ నుండి మమ అనిపించుకోవాల్సిన అవసరం ఆ పార్టీలో సహజం.

జీవన్రెడ్డి,jeevanreddy,mlc,

ఈ పరిణామాల మధ్య కాలక్రమేణ ఎవరు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారు అనే అభద్రతాభావం కాంగ్రెస్‌లో ప్రధానంగా సీఎం రేవంత్‌లో ఏర్పడిందా అనిపిస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం త్వరలో పడిపోతుందని ప్రతిపక్షాలు పలుమార్లు చేసిన వ్యాఖ్యలకు కూడా ప్రధాన కారణం అంతర్గత పోరుతో ఆ పార్టీలో ఎప్పుడు ఏ నేత జెండా ఎత్తేస్తారనే. మిత్రపక్ష సీపీఐతో కలిపి 65 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్‌కు ఇప్పుడు అదనంగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ కూడా తోడుకావడంతో అసెంబ్లీలో వారి బలం 66కి పెరిగి రేంవత్‌ సర్కార్‌ మరింత పటిష్టమైంది. రేవంత్‌ రెడ్డి ప్రజా సంక్షేమాలతో తమ ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకోవడం కంటే ప్రజాతీర్పుకు భిన్నంగా ప్రతిపక్షాలను ప్రధానంగా బీఆర్‌ఎస్‌ను బలహీనపర్చడమే లక్ష్యంగా వలసలను ప్రోత్సహిస్తున్నారు.
ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో భాగంగా జగిత్యాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను పార్టీలో చేర్చుకున్నప్పుడు ఆయన చేతిలో ఓడిపోయిన సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మెజార్టీ ఉన్నప్పుడు ఇతర పార్టీ ఎమ్మెల్యేలు మనకెందుకు..? అని ప్రశ్నించారు. జీవన్‌రెడ్డి అంశంలో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకొని ఆయనను బుజ్జగించింది. అయినా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చేరిన నియోజకవర్గాల్లోని సదరు కాంగ్రెస్‌ నేతలు కొందరు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరుస్తుంటే మరికొందరు లోలోన రగిలిపోతున్నారు. వీరందరినీ బుజ్జగించడంలో భాగంగానే కాంగ్రెస్‌ ‘బీ’ ఫారంపై గెలిచిన వారికే మంత్రి పదవులు అనే ప్రకటన వెలువడిరది. దీంతోపాటు పీసీసీ చీఫ్‌, నామినేటెడ్‌ పోస్టులను కూడా ఆగమేఘాల మీద భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్‌ హైకమాండ్‌ కూడా రేవంత్‌ చర్యలను సమర్థిస్తూ పార్టీ బలోపేతానికి ఏ అవకాశాన్నీ వదులుకోకుండా ఇతర పార్టీలకు చెందిన బడా నేతలను పార్టీలో చేర్చుకోవాలని సూచించింది.

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తాము ఊహించిన దానికంటే అధిక సీట్లు వచ్చాయని, ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ బలహీన పడుతుందని భావిస్తున్న కాంగ్రెస్‌ అధిష్టానం బీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీవైపు మళ్లకుండా రాష్ట్ర కాంగ్రెస్‌ దృష్టి పెట్టాలని ఆదేశించడంతో కాంగ్రెస్‌లోకి వలసలు వేగవంతమయ్యాయి. బీజేపీకి 8 స్థానాలు వచ్చినా క్షేత్రస్థాయిలో ఆ పార్టీ సంస్థాగతంగా బలహీనంగానే ఉందనేది వాస్తవం. బీజేపీ బూచీతో బీఆర్‌ఎస్‌ నుండి పెద్ద ఎత్తున నేతలను చేర్చుకుంటే భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత సమస్యలు పెరిగి ఇంటిని చక్కదిద్దుకోవడమే కష్టం కావచ్చు. లోగడ బీఆర్‌ఎస్‌ కూడా కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులను చేర్చుకొని, ఆ పార్టీ బలహీన పడిందని.. ఇక మాకు బీజేపీయే ప్రత్యామ్నాయం అని భావించింది. అయితే వారి అంచనాలు తప్పి సంస్థాగతంగా బలంగా ఉన్న కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ను మట్టి కరిపించింది. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకుంటే భవిష్యత్తులో ఎదురుండదనే ఆలోచనలతో ఉంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ సంస్థాగతంగా ఎంత బలంగా ఉందో, బీఆర్‌ఎస్‌ కూడా అంతే బలంగా ఉందనేది సత్యం. ఈ వాస్తవాలను గ్రహించకుండా పార్టీ ఫిరాయింపులపై అప్పుడు బీఆర్‌ఎస్‌ చేసిన తప్పులనే ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా చేస్తోంది.

పార్టీ ఫిరాయింపులపైనే కాకుండా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు కుమ్మకయ్యాయని వ్యాఖ్యానించిన రేవంత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌కు పట్టున్న సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మంట్‌లో, మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో బీజేపీకి ఆధిక్యత వచ్చిందని ప్రస్తావించడం కూడా హాస్యాస్పదంగానే ఉంది. రేవంత్‌ సొంత సెగ్మంట్‌ కొడంగల్‌ వచ్చే మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంతో పాటు లోగడ ఆయన ప్రాతినిథ్యం వహించిన మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ ఓడిపోయి బీజేపీ గెలిచింది. రెండు నియోజకవర్గాల్లోనూ రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక మొదలుకొని అన్ని కార్యకలాపాలను తన కనుసన్నులోనే నడిపించినా పార్టీ ఓడిపోవడాన్ని ఆయన ఎలా సమర్థించుకుంటారు..?
పార్టీలో పట్టు పెంచుకోవడానికి రేవంత్‌ రెడ్డి చేపడుతున్న చర్యలు, చేస్తున్న వ్యాఖ్యలు విపక్షాలకు అస్త్రాలుగానే కాకుండా మున్ముందు ఇంటా బయటా సమస్యలు తెచ్చిపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పార్టీలు మారే ప్రజాప్రతినిధుల కంటే క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడే నాయకులు, కార్యకర్తలే పార్టీ మనుగడకు శ్రీ రామ రక్ష అనే వాస్తవాన్ని అన్ని పార్టీలూ విస్మరిస్తున్నాయి.
ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తూ బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్నాము కదా అని ప్రజా తీర్పుకు భిన్నంగా గతంలో నీవు చేసిన పనే ఇప్పుడు మేమూ చేస్తున్నామంటూ బీఆర్‌ఎస్‌ బాటలోనే తప్పటడుగులు వేస్తున్న కాంగ్రెస్‌ ఎదుటి పక్షాన్ని బలహీనపర్చడంపైనే దృష్టి పెడితే వాటికి ప్రజామోదం ఉండదు. ఈ వాస్తవాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తే గతంలో బీఆర్‌ఎస్‌కు ఎదురైన ప్రజా వ్యతిరేక అనుభవమే భవిష్యత్‌లో కాంగ్రెస్‌కు కూడా పునరావృతం కావచ్చు.

====================

-ఐ.వి.మురళీ కృష్ణ శర్మ
పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ