Nancharaiah merugumala senior journalist:
‘నేను 2018లో తీసుకునే వరకూ టీవీ 9 ను నక్సలైట్ వ్యవస్థలా నడిపారు,’ అని …‘మైహోం’ జూపల్లి రామేశ్వర్ రావు గారు చెప్పాక కూడా మేనేజింగ్ ఎడిటర్ వెల్లలచెరువు రజనీకాంత్ జవాబివ్వరా?
సోమవారం కడ్తాల్ మండలం మహేశ్వర మహా పిరమిడ్‌లో జరిగిన పత్రీజీ ధ్యాన మహాయాగం ఉత్సవాల్లో పాల్గొన్న మైహోం గ్రూప్ అధిపతి డాక్టర్ జూపల్లి రామేశ్వర్‌రావు గారు తెలుగు ప్రజలకు తెలియని ఓ కొత్త విషయం వెల్లడించారు. ‘2018లో నేను టేకోవర్ చేసే వరకూ టీవీ 9 చానల్ ను ఒక నక్సలైట్ వ్యవస్థలా నడిపారు. భారత సంస్కృతి, ఆధ్యాత్మిక సాంప్రదాయాలంటే ఏ మాత్రం గౌరవం లేకుండా వ్యవహరించారు ఈ చానల్ సంపాదకులు. స్వర్గీయ బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీని కించపరుస్తూ ఈ చానల్‌లో ప్రసారాలు నడిచాయి,’ అనే రీతిలో విరుచుకుపడుతూ మాట్లాడారు మైహోం కన్‌స్ట్రక్షన్స్, మహాసిమెంట్, టీవీ 9 చానల్ లో పెట్టుబడులు పెట్టి నడుపుతున్న జూపల్లి రామేశ్వర్ రావు గారు. హయత్ నగర్‌లో హోమియో డాక్టర్‌గా ప్రాక్టీసు ప్రారంభించిన నాలుగు దశాబ్దాలకు హైదరాబాద్ నగర శివార్లలో త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి వంటి ఆధ్యాత్మిక నేతలకు సైతం ఆశ్రయం ఇచ్చారు రామేశ్వరరావు గారు.
శ్రీమహావిష్ణువు ఆశీస్సులు ఉన్నాయని మరో పారిశ్రామికవేత్త తిక్కవరపు సుబ్బరామిరెడ్డి గారి నుంచి కిందటేడాది ప్రశంసలు కూడా అందుకున్న మైహోం గ్రూపు అధినేత– తాను కొనుగోలు చేయక ముందు టీవీ 9 ఎలా నడించిందీ, ఎలా నడిపారు? అనే విషయాలపై నిన్న లైవ్ లో సూటిగా, చక్కగా మాట్లాడడం సంచలనంగా మారింది. కాని, టీవీ 9ను రామేశ్వర్ రావు గారు టేకోవర్ చేయక ముందు నుంచీ ఈ చానల్ నిర్వహణలో కీలకపాత్ర పోషించారు ప్రస్తుత మేనేజింగ్ ఎడిటర్ వెల్లలచెరువు రజనీకాంత్ గారు. మరి ఇప్పుడు తన నాయకత్వంలో చక్కగా సాగుతున్న టీవీ 9ను ‘నక్సలైట్ వ్యవస్థ’లా 2018కు ముందు కొందరు సీనియర్ జర్నలిస్టులు నడిపారని– చానల్ సహ యజమాని జూపల్లి రామేశ్వర్ రావు గారు బహిరంగంగా విమర్శించినా రజనీకాంత్ గారుగాని, ఆయనకు ఆసరాగా ఉన్న ఇతర సీనియర్లు గాని ఈ విమర్శకు జవాబిస్తూ ఒక ప్రకటన ఇంకా చేయకపోవడం చాలా మంది తెలుగు జర్నలిస్టులకు తీవ్ర దిగ్భాంతి కలిగిస్తోంది.