రేవంత్‌ రెడ్డి ‘సొంత లాభం ఎంత చూసుకున్నా’ 4 కోట్ల తెలంగాణ జనం పట్టించుకోరట!

Nancharaiah merugumala senior journalist: (కాంగ్రెస్‌ అనుకూల పరిస్థితుల్లో పార్టీ టికెట్ల పంపిణీలో  రేవంత్‌ రెడ్డి ‘సొంత లాభం ఎంత చూసుకున్నా’ 4 కోట్ల తెలంగాణ జనం పట్టించుకోరట)

==================

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతంలోని సనత్‌ నగర్‌ అసెంబ్లీ స్థానంలో బీఆరెస్‌ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మీద కోస్తాంధ్ర మూలాలున్న బ్రాహ్మణ మహిళ డాక్టర్‌ కోట నీలిమ వంటి అనామక అభ్యర్థిని నిలబెట్టినా, మేడ్చల్‌ లో మరో మంత్రి చామకూర మల్లారెడ్డిపై తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ వంటి ‘బలహీన’ నేతకు భూమి ఆధారంగా కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చినా దాదాపు నాలుగు కోట్ల తెలంగాణ జనం ఇవేమీ పట్టించుకోకపోవచ్చని అంటున్నారు. కోట నీలిమ ఢిల్లీ కాంగ్రెస్ నేత, మీడియా సెల్ బాధ్యుడు, పంజాబీ ఖత్రీ అయిన పవన్ ఖేరా భార్య. ఆమె మంచి రచయిత కూడా. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అనుకూల గాలులు నిజంగా వీస్తుంటే–పీసీసీ అధ్యక్షుడి హోదాలో అనుమల రేవంత్‌ రెడ్డి తాను తెలుగుదేశంలో ఉండగా ఉన్న సంబంధాల ఆధారంగా పైన చెప్పిన రెండు నియోజకవర్గాల్లో మాదిరిగా సాధ్యమైనన్ని పార్టీ టికెట్లు సొంత లాభం కోసం ఎవరెవరికి ఇచ్చినా రాహుల్‌ గాంధీ పార్టీకి నష్టమేమీ ఉండకపోవచ్చట. ప్రత్యేక రాష్ట్రంగా పదేళ్లు నిండుతున్న తెలంగాణలో పౌరులు పెద్దగా రేవంత్‌ పోకడలను తప్పుపట్టి హస్తం పార్టీని దెబ్బదీయకపోవచ్చని అంటున్నారు. ఇదంతా కాంగ్రెస్‌ అనుకూల వాతావరణం కన్నా బీఆరెస్‌ లేదా కేసీఆర్‌ సర్కారు అంటే వ్యతిరేకత ఎక్కువ ఉంటేనే జరుగుతుంది. నవంబర్‌ 30 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పే రాజకీయ పండితులు 2004 నాటి ఉమ్మడి ఏపీ పరిస్థితులను ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. రేపు కాంగ్రెస్‌ పార్టీకి జనం ఓట్లు వేసేది తెలంగాణ పాలకపక్షంపై వ్యతిరేకతతోనే కాబట్టి––తానేమి చేసినా, ఏం మాట్లాడినా చెల్లుతుందని రేవంత్‌ రెడ్డి సైతం భావిస్తున్నాడు. అందుకే మొన్న ‘‘పొన్నాల లక్ష్మయ్య సచ్చే ముందు తల్లి వంటి కాంగ్రెస్‌ పార్టీని వదిలిపోతే ఏం లాభం?’’ అని కాంగ్రెస్‌ కొడంగల్‌ అభ్యర్ధి మాట్లాడారు. భూస్వామ్య నేపథ్యం నుంచి వచ్చిన సౌమ్యుడు, మంచి పార్లమెంటేరియన్‌ అయిన సూదిని జైపాల్‌ రెడ్డి గారు తాను బతికుండగా తమ్ముడి అల్లుడు రేవంత్‌ రెడ్డిని కాస్త ‘సరిదిద్దే’ ప్రయత్నం సరిగా చేసినట్టు లేరు. ఈ లెక్కన రేవంత్‌ ప్రవర్తన నవంబర్‌ 30 లోగా ఎలా ఉన్నా కాంగ్రెస్‌ పార్టీకి నష్టం లేదనే అనుకోవాలి.