హైదరాబాద్: తెలంగాణ జాగృతి పేరిట కవిత సరికొత్త ప్రయోగాలకు సిద్ధమయ్యారు.స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో క్షేత్ర స్థాయిలో జాగృతి బలోపేతం తో పాటు ప్రజా సమస్యలే ఎజెండాగా సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన ప్రజాహిత పథకాలను కేంద్రంగా చేసుకొని, కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణను కవిత ఇప్పటికే సిద్దం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది.
*కేసీఆర్ ఫోటోలతో ప్రజాక్షేత్రంలోకి*
గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనను గుర్తుకు తెచ్చేలా కవిత ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు.ప్రతి గ్రామానికి ఓ బుక్లెట్ లేదా రెండు పక్కల కేసిఆర్, కవిత తో కూడిన కార్డులను ఇవ్వాలని కవిత భావిస్తున్నారు.ఇందులో కేసీఆర్ హయంలో అమలైన ముఖ్య పథకాలు, వాటి విజయాలు, ఫలితాలను వివరించనున్నారు. ప్రత్యేకించి కేసీఆర్ ప్రవేశపెట్టిన విజయవంతమైన పథకాలను గ్రామస్థాయికి చాటిచెప్పే ప్రయత్నం కవిత కార్యాచరణలో స్పష్టంగా కనిపిస్తోంది.
*కాంగ్రెసు వైఫల్యాలను ఎండగడుతూ*
అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండకట్టేందుకు కవిత సరికొత్త పంథాతో ముందుకు సాగనున్నారు.అలివి కానీ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ హామీల వైఫల్యాలను ఎత్తిచూపే విధంగా, ఒక“ఫెయిల్యూర్ కార్డ్”ను విడుదల చేయనున్నారు.ఇందులో ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న పింఛన్లు, రేషన్ కార్డులు, ఉద్యోగాలు మొదలైన అంశాలను స్పష్టంగా హైలైట్ చేయనున్నారు. వీటితో పాటు కేసీఆర్ ,కవిత ఫోటోతో ఉన్న అప్లికేషన్ పై రుణమాఫీ జరగని రైతుల సంతకాల సేకరణ చేపట్టనున్నారు.జిల్లాల వారీగా నిరుద్యోగ యువతను రౌండ్ టేబుల్ చర్చలకు ఆహ్వానించి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు.
*మేధావులతో భేటీ*
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీనియర్ జర్నలిస్టులు, రచయితలు, అడ్వకేట్లు,సామాజిక కార్యకర్తలతో పాటు ప్రముఖులతో కవిత ప్రత్యేకంగా భేటీ కానున్నారు. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రజలకి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపట్టనున్నారు.
మొత్తంగా తెలంగాణ జాగృతి పేరిట రాజకీయంగా ఒంటరిగా ఎదిగేందుకు కవిత ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారని స్పష్టమవుతోంది. ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. డాటర్ ఆఫ్ ఫైటర్ పేరుకి సార్థకం చేకూరేలా కవిత జైత్రయాత్ర పక్కగా మొదలైపోయింది!
_ మురళీ కృష్ణ ✍✍✍