Telangana:
రాజకీయ ఎదుగుదల కోసం ఏవరినైనా సరే పార్టీలో చేర్చుకోవడంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుందనేది బహిరంగ రహస్యం. ఒక పార్టీతో విభేదించిన నేతలను, ఒకే పార్టీలో ఉండి కుటుంబ సభ్యులతో విభేదించిన నేతలను తనవైపు తిప్పుకోవడానికి ఆ పార్టీ వెనుకాడదు. ఇది దేశ వ్యాప్తంగా నిరూపితమైన బీజేపీ వ్యూహం. అవినీతి మరకలున్న నేతలు కూడా తన వ్యూహానికి మినహాయింపు ఏమీ కాదు. ఇప్పుడు కల్వకుంట కవిత విషయంలో బీజేపీ ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తుందా..? లేదా..? అనేది రాజకీయ వర్గాల్లో అసక్తికరంగా మారింది.
పార్టీ విధానాలు నచ్చకో, ప్రాధాన్యం లేకనో అసంతృప్తితో ఉన్న నేతల్ని, సొంత కుటుంబ సభ్యులతో విభేదించిన వారిని తనవైపు తిప్పుకోని స్థానికంగా బలపడడం బీజేపీ వ్యూహాం. అవినీతి మరకలు ఉన్నా కూడా కుల సమీకరణాలు, ఆర్థికంగా బలంగా ఉన్న నేతలు.. ఇలా సమీకరణాలను పరిశీలించి ఏ కొంత మేరకు ప్రభావం చూపగలిగే నేతలైనా సరే బీజేపీలో చేర్చుకొనేందుకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నేరుగా చేర్చుకోకపోయినా బాహాటంగా వారి మద్దతును కూడగట్టుకుంటుంది.
హిమంత బిశ్వ శర్మ, జ్యోతిరాదిత్య సింథియా, కెప్టెన్ అమరీందర్ సింగ్, అనిల్ ఆంటోని, హార్ధిక్ పటేల్, సీఆర్ కేశవన్, సునిల్ ఝాకర్, రిఠా బహుగుణ,ఆర్బీఎన్ సింగ్ వంటి ఎందరో నేతలను 2014 నుంచి ఇప్పటి దాకా వివిధ దశల్లో గతంలో బీజేపీలోకి చేర్చుకుంది.
పార్టీలో చేర్చుకున్న వారిలో అనేక మందిపై అవినీతి ఆరోపణలు ఉన్నా కూడా బీజేపీ ఎప్పుడూ వెనుకాడని పరిస్థితి మనకు కనిపిస్తుంది. బీజేపీలో చేరాక వారి మీద ఉన్న కేసుల సంగతి గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఈ విషయంలో బీజేపీపై విపక్షాలు అనేక విమర్శలు చేస్తూన్నాయి. బీజేపీ వాషింగ్ పౌడర్ నిర్మా పార్టీ అని, అవినీతి మరకలున్న ప్రతి నేత ఆ పార్టీలో చేరగానే సశ్చీలురు అయిపోతున్నారనేది విపక్షాల వాదన.
తెలంగాణలో బీజేపీ వ్యూహం:
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెలంగాణ ఏమీ మినహాయింపు కాదు. బీఆర్ఎస్‌తో విభేదించిన ఎందరో నాయకులను బీజేపీ తనవైపు తిప్పుకుంది. ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర రెడ్డి, గోడెం నగేష్, సీతారాం నాయక్, శానంపూడి సైదిరెడ్డి, గువ్వల బాలరాజు, రాథోడ్ బాపురావు, పోతుగంటి రాములు, జలగం వెంకట్రావ్, బీబీ పాటిల్ వంటి ఎందరో బీఆర్ఎస్ నేతలను బీజేపీ తనవైపు తిప్పుకొంది. వీరిలో కొందరు ఎంపీలుగా గెలిచారు. ఇంకొందరు గత అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగారు. ఇంకొందరు ఇటీవల పార్టీలో చేరారు.
ఇలా ఇప్పటికే కేసీఆర్‌తో విభేదించిన అనేక మంది బీఆర్ఎస్ నేతలను తనవైపు తిప్పుకుంది బీజేపీ. మరి కల్వకుంట్ల కవిత విషయంలో బీజేపీ ఇదే సంప్రదాయాన్ని అనుసరిస్తుందా..? కవితను బీజేపీలో చేర్చుకుంటుందా..? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
మరోవైపు అవినీతిపరులను బీజేపీలో అడుగు పెట్టనివ్వబోమని, అది కవిత అయినా సరే, భవిత అయినా సరే అని వ్యాఖ్యానించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు గత చరిత్రను విస్మరిస్తున్నట్టు కనబడుతోంది. హిమంతా బిశ్వ శర్మ, అశోక్ చవాన్, ప్రఫూల్ పటేల్, అజిత్ పవార్, ముకుల్ రాయ్, సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటివారిపై అవినీతి ఆరోపణలు లేకుండానే గతంలో బీజేపీలో చేర్చుకున్నారా? బయటి నుంచి వారి మద్దతు పొందలేదా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అదే కోవలో బీఆర్ఎస్‌తో విభేదించి పార్టీకి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవితను కూడా బీజేపీ తనవైపు తిప్పుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.