ఓ పట్టుదల, మరో పట్టువిడుపు..!

ఓ పట్టుదల, మరో పట్టువిడుపు..!

తండ్రి పార్థసారథి గారెంత పట్టుదలో…. తనయుడు వట్టి వసంత్‌ కుమార్‌ గారిది అంతటి పట్టువిడుపు తత్వం. పైకి కటువుగా, మొరటుగా, ఇగోయిస్టిక్‌గా కనిపించినా…లోన వెన్నంటి మెత్తటి మనస్తత్వమాయనది. ఆరోగ్యసమస్యలు చివరి రోజుల్లో బాగా ఇబ్బందిపెట్టాయి కానీ, ఇంకొంత కాలం హాయిగా గడవాల్సిన జీవితం నాలుగు రోజుల కింద ముగిసింది. సుదీర్ఘ కాలం డా.వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి గారికి సన్నిహితుడిగా, 80ల నుంచే ఆయన అనుయాయుల్లో ముఖ్యుడిగా ఉన్న వ్యక్తి. నాకు 90ల నుంచి పరిచయం. వై.ఎస్‌.ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా ఆయన ఉన్నపుడే, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కొప్పుల రాజుగారు కొంత చొరవతీసుకొని సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం అమలుకై ఆ శాఖ అన్ని స్థాయిల్లో ఓ మంచి, ఆదర్శప్రాయమనదగ్గ సమాచార మ్యానువల్‌ (సెక్షన్‌ 4(1)బి ప్రకారం స్వచ్చంద సమాచార వెల్లడి కోసం) తయారీకి జరిపిన కృషి అభినందనీయం. నేనప్పుడు సమాచార హక్కు చట్టం కమిషనర్‌ని. అవినీతి, అక్రమాల మకిలి లేకుండా రాజకీయాలు నెరపిన సహృదయుడిగా మంచి పేరున్న నాయకుడు. పలు విషయాలపైన లోతైన పరిజ్ఞానం కలిగి, స్పష్టమైన వైఖరి ఉండి… చాలా సందర్భాల్లో తనను తాను పరిమితం చేసుకొని, హడావుడి లేకుండా హూందాగా జీవితం గడిపిన విలక్షణ జీవి వసంత్‌ గారు. తన వద్ద శాఖ పీఆర్‌వోగా పనిచేస్తున్న పాత్రికేయుడొకరు, ‘జిల్లాకు వస్తున్నాను కారు పెట్టండ’ని డ్వాక్రా సంఘాల సమన్వయకర్తను అనధికారికంగా పురమాయించినట్టు తెలిసి, తొలగించి ఇంటికి పంపిన నిక్కచ్చితనం. 2009లో కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఆయన్ని కలిసి ‘అన్నా, ఫలానా…పని ఒకటుంది, చేస్తే మీకింత, నాకింత ముడుతుంది’ అని ప్రతిపాదన తెచ్చినపుడు, ‘…. సీ మ్యాన్‌, ఏం పద్దతిది? నువ్వింకా ప్రమాణస్వీకారం కూడా చేయలేదు, తీరు మార్చుకో’ అని తీవ్రంగా మందలించి పంపిన ఖచ్చితత్వం. మంత్రిగా విదేశీ పర్యటనలక్కూడా సొంత డబ్బు వెచ్చించిన నిజాయితీ! మర్యాదల్లో, ముఖ్యంగా ఆతిథ్యంలో ఆయన తర్వాతే ఎవరైనా అనిపించేంత ప్రేమాస్పదుడు. వైఎస్‌ తో సహా, పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చిన ఏ సీనియర్‌ నాయకుడు ‘పూళ్ల’లో వసంత్‌గారి ఆతిథ్యం తీసుకోకుండా వెనక్కి వెళ్లిన సందర్భాలు లేవేమో! చివరి సంవత్సరాల్లో విశాఖకు మకాం మార్చి, తన అభిరుచికి తగినట్టు సాగరతీరంలో ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా అవే ఆతిథ్యాలు!

వసంత్‌ కుమార్‌ తండ్రి పార్థసారధి గారిది కొంచెం భిన్నమైన శైలి. చేయని అవినీతి ఆరోపణలతో వార్తాకథనం రాసి, పరువునష్టం కలిగించారంటూ మీడియామొగల్‌ రామోజీరావుగారిపైనే కోర్టుకెక్కిన ఘనుడాయన. వార్త రాసిన రిపోర్టర్‌ పిల్లా సాయికుమార్‌, ప్రచురించిన పత్రికా ఎడిటర్‌/యజమాని రామోజీలను సదరు కేసులో నిందితులుగా పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లా సహకార బ్యాంకు చైర్మన్‌గా పార్థసారధి గారున్నప్పటి సంగతి! కేసు చాలా కాలం నడిచింది. ఒకరోజైనా జైలుపాలు చేస్తాననడం నుంచి, కనీసం కోర్టు బోను ఎక్కిస్తాననే వరకు ఆయన పట్టుదల సాగింది. తర్వాత నేను ఈనాడు పొలిటికల్‌ బ్యూరో చీఫ్‌గా ఉన్నపుడు నా బ్యూరోలో సభ్యుడు సాయికుమార్‌. అంతకు ముందు మెదక్‌ జిల్లా రిపోర్టర్‌గా సంగారెడ్డిలో ఉన్నపుడు కూడా కోర్టు కేసు విచారణకు పశ్చిమగోదావరి జిల్లా కోర్టులకు తిరగాల్సి వచ్చింది. కొంత కాలం తర్వాత సెలవులు, ప్రయాణ ఖర్చులు ఇవ్వడం ఈనాడు యాజమాన్యం ఆపేయడంతో ఆయనకు ఇబ్బంది వచ్చింది. ‘మంత్రి వసంత్‌ గారితో మీకున్న పరిచయంతో నన్ను ఈ కేసునుంచి మినహాయించేట్టు చూడరా?’ అన్న సహచరుని వినతిని నేను వసంత్‌గారి వరకూ తీసుకువెళ్లాను. సాలోచనగా విని, ‘దిలీప్‌ నేనిందుకు సానుకూలం, కానీ, నీకు కొన్ని కఠిన వాస్తవాలు తెలియాలి, ఇపుడే రా, నేనొక పెద్దాయన దగ్గర కూర్చున్నా’నంటూ పిలిచారు. ఈ విషయంలో తాను అశక్తుడినని, పెద్దాయన మాటలు వినమని చెప్పారు. చివరకు తేల్చిందేమంటే, రిపోర్టరుకు ఇతరత్రా సహాయం చేద్దాం తప్ప, పార్థసారథిగారు మహాపట్టుదల మనిషని, ఈ విషయంలో ఏ సడలింపులూ కోరలేమన్నది ముక్తాయింపు. ‘లేని అవినీతి, తప్పుడు కథనం…’ వ్యవహారాన్ని విపక్షనేతగా అసెంబ్లీలో గట్టిగా లేవనెత్తడం లేదని తప్పుబడుతూ, కుటుంబ సాన్నిహిత్యాన్ని కూడా కాదని, వైఎస్‌ గారిపైనే అలిగి పార్థసారథిగారు కొన్నాళ్లు మాటలు మానేశారనీ చెప్పారు. ఆయన పట్టుదల అలా కొనసాగి, చివరకు రామోజీరావుగారిని తాడేపల్లి గూడెం కోర్టు బోను ఎక్కించే వరకు వెళ్లింది.

ఈనాడులో ఆనాడు ఓ మీమాంస! రామోజీగారు కోర్టు బోనెక్కిన వార్తను ప్రాధాన్యంగా పేజీ వన్‌లో వేయాలా? అప్రాధాన్యంగా లోపలి పేజీల్లోనా? డెస్క్‌లో పలు తర్జనభర్జనల తర్వాత, పెద్దాయన సలహా తీసుకోవడమే సముచితమనే నిర్ణయం జరిగింది. ఓ సీనియర్‌ డెస్క్‌ సభ్యుడితో ఫోన్‌పైన అడిగిచ్చాం. రామోజీగారు ఎంతో స్పోర్టివ్‌గా, నవ్వుతూ ‘ఏమయా! యామ్‌ ఐ నాట్‌ వర్త్‌ పేజ్‌ వన్‌?’ అనడంతో మా పని తేలికయింది. వసంత గారు పట్టువిడుపు ధోరణితో సహాయం చేద్దామనుకున్నా…. తండ్రి పట్టుదల పరిస్థితిని అక్కడిదాకా తెచ్చింది.

వసంతన్నకు నివాళి

===============

ఆర్. దిలీప్ రెడ్డి
పొలిటిక‌ల్ అన‌లిస్ట్‌, పీపుల్స్ ప‌ల్స్ రీసెర్చ్ సంస్థ

(source: Facebook post)