×

Taadi Prakash:

(సెప్టెంబర్ 21 మోహన్ ఏడవ వర్ధంతి)

హృదయంలో ప్యూరిటీ – ఆలోచనల్లో క్లారిటీ –
ఈ రెండూ కలిస్తే ఆర్టిస్ట్ మోహన్ అవుతారు. తనలో మైనస్ పాయింట్ ఏమిటంటే ఎవరైనా సరే చదువుకోవాల్సిందే అంటాడు.

డబ్బు సంపాదించమని, మేడలు కట్టుకోమనీ, విజయానికి కేవలం 555 మెట్లేననీ చెబితే బాగుంటుందిగానీ… దరిద్రంగా ఈ చదువుకోవడమేమిటో అని విసుక్కున్నా చికాకు పడినా.. రచయితలు, ఆర్డిస్టులు, కవులు, జర్నలిస్టులూ ఎప్పుడూ చదువుతూ ఉండవల్సిందేనని పదేపదే చెబుతుంటాడు.
మోహన్ అలాగే ఉంటాడు.

మోహన్ కిపుడు అరవై అయిదేళ్లు. 1950 డిసెంబర్ 24న ఏలూరులో … తండ్రి తాడి అప్పలస్వామి అనే కమ్యూనిస్టు నాయకుడికీ, తల్లి సూర్యావతికి పుట్టిన మోహన్ ని కమ్యూనిస్టు ఉద్యమమే ఎత్తుకుని పెంచి పోషించింది. అప్పలస్వామి అప్పటికే చదువుకున్నాయన. ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం బాగా తెలిసినవాడు. చదువుకోవడమే, విద్యతో వెలిగిపోవడమే, జ్ఞానంతో రాణించడమే, పేదవాడి కోసం పోరాడటమే మానవుని విధి అని నమ్మేవారాయన. అదే మోహన్ కి అబ్బింది.

మొదటి నుంచీ మోహన్ చదువరి. కథో, నవలో, పద్యమో, మార్క్సిస్టు సాహిత్యమో చదవడమే పని. ఆ చదువే ఆనందం. పది పన్నెండేళ్లకే బొమ్మలు వేయడం మొదలుపెట్టాడు. రెండే వ్యాపకాలు – చదవడం, బొమ్మలు వేయడం. మరొకటి ఉంది. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ చుట్టూ స్నేహితులే. మోహన్ చుట్టూ సంపాదకులు, జర్నలిస్టులు, రచయితలు, ఆర్టిస్టులు, కవులు, ఉద్యమకారులు… ఎందరెందరో. కళాకారుడి కార్యాలయం పార్టీ ఆఫీస్ లాగే. టీలూ.. సిగరెట్లూ .. చర్చలూ.. ఎన్ని మాటలున్నా జోకులున్నా, అందరి మధ్యలో మోహన్ బొమ్మలు వేస్తూనే ఉంటాడు. నాజూకైన గీతలు. ఆడపిల్ల నడుం నుండి అరచేయి దాకా ఒకే వయ్యారపు గీత, గీతా దత్ పాటలాగ.
సర్రున మొగవాడి మోకాలి నుంచి చెయ్యెత్తి తుపాకీ పట్టే దాకా కత్తితో గీశాడేమో అనిపించే ఉద్యమ గీత, పాబ్లో నెరుడా పొయిట్రీలా …

మోహన్ ఒక స్వచ్ఛమైన జలపాతం. అన్ని రంగులూ కలిస్తే తెలుపు అయినట్టు – అతను ఆర్టిస్ట్, కమ్యూనిస్టు, కార్టూనిస్టు, జర్నలిస్టు, కవి, విమర్శకుడు, రచయిత, యానిమేటర్, మిత్రుడు, గురువు, డ్రీమర్, తండ్రి… నీ సగం సిగరెట్టు తీసుకుని తాగే సాదాసీదా సగటు ఒన్ బై టూ చాయ్ గాడు. నీకెప్పుడూ అందుబాటులో ఉండేవాడు.
నీకెప్పటికీ అందనివాడు.
కవి బాలగంగాధర తిలక్ లాగా అందమైనవాడు. మనోహరమైన చిరునవ్వును ఆయుధంగా ధరించిన వాడు. అడిగిన వాడికి లేదనకుండా బొమ్మ గీసిచ్చేవాడు. వాడు ఐ యా, ఎమ్మా, ఎమ్మెల్లా, లిన్ పియానో, పుల్లారెడ్డి, నాగిరెడ్డి, జనశక్తి, ప్రతిఘటన, అతి నటన, మహిళ, బడుగు, బలహీన, ముస్లిం, మైనార్టీ, దళిత, మాదిగ, డక్కిలి, లంబాడా, నంగారా, అస్తిత్వ, సుత్తిత్వ, పరమ బోరిత్వ … ఎవరైనా మోహన్ కి ఒక్కటే. బొమ్మ వేసిస్తాడంతే.

నచ్చడం, నచ్చకపోవడం జాన్తానై.
ఒక్కోడిదీ ఒక్కోరకం కమ్యూనిజం. ఒకడిది వర్గకసి. ఒకరిది ప్రేమదాహం. మరొకరిది విప్లవ ద్రోహం. మరొకామెది మగ దురహంకార పదఘట్టన కింద నలిగిపోయే భూమిక. ఇంకొకడు మానవ హక్కుల్ని ప్రేమిస్తాడు. మరొకడు తెలంగాణ కోసం ఉద్యమిస్తాడు. మోహన్ కి ఫిర్యాదుల్లేవు. గొడవలు పెట్టుకోడు. నువ్వేం చెప్పు శ్రద్ధగా వింటాడు. నీక్కావల్సిన బొమ్మ, నువ్వు కోరుకున్న బొమ్మ బాగా వేసిస్తాడు. నీ అజ్ఞానం వల్ల, ఉపన్యాసాలిచ్చే దురలవాటు వల్ల మంచి బొమ్మని మార్చి పిచ్చి బొమ్మ వేయమని అడుగుతావు. నో కంప్లయింట్స్. నువ్వు కోరుకున్న మీడియోకర్ బొమ్మే నీకు దక్కుతుంది. ‘అదేంటి’ అని ఎవరైనా అడిగితే “వాళ్లకు అదే నచ్చుతుంది” అంటాడు. మ్యారేజి బ్యూరో క్లయింట్ సర్వీసా? పవిత్రమైన ఆర్టా? అని ఎవరైనా కోప్పడితే “నువ్వు ప్రపంచాన్ని మారుస్తావా? నేనైతే అలా చేయలేను” అంటాడు మోహన్.

మోహన్ ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో బీఎస్సీ చదివి, 19 ఏళ్ల వయసులో విశాలాంధ్రలో సబ్ ఎడిటర్‌గా చేరాడు. విశాలాంధ్ర లైబ్రరీ, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ పుస్తకాలూ, అప్పటి సోవియట్ సాహిత్యం మోహన్ కి ఎప్పటికీ మరచిపోలేని మంచి మిత్రులు. ఏటుకూరి బలరామమూర్తి, రాఘవాచారీ, కంభంపాటి వంటి సీనియర్లు తనని బాగా ప్రభావితం చేశారు. ఇంత రియలెస్టేటు, స్టాక్ మార్కెటూ, ఐటీ బూమూ, సెల్ ఫోన్లూ లేని బంగారం లాంటి బ్లాక్ అండ్ వైట్ రోజులవి. పుస్తకాలు, పేపర్లూ, చదువూ, కవిత్వమూ, చర్చలూ. అటు సోదుం రామ్మోహన్, ఇటు పెద్దిభొట్ల సుబ్బరామయ్య – సాయంత్రం అయితే కె.రాజేశ్వరరావు, పీ. సీ. జోషి… టీ, సిగరెట్లు, అదృష్టదీపక్, కవి రవి, ఇతర స్నేహితులు. రాంభట్ల కృష్ణమూర్తి, కవి మల్లారెడ్డిలతో మాట కచేరీలు. సబెడిటర్ పని అంటే ఇంగ్లీషు వార్తలను తెలుగులోకి అనువదించడం. అయ్యాక, ఓ రాజకీయ కార్టూన్ లాగించేవాడు. పబ్లిషింగ్ హౌస్ కవర్ పేజీ వేసేవాడు. ఎవరి కవిత్వానికో ఓ బొమ్మ తగిలించేవాడు. జీవితంలో పెద్ద కోర్కెలే మీ లేనట్టుగానే బతికాడు.

జెనీలియా లాగా కుదిరితే ఓ కప్పు కాఫీ, ఓ సిగరెట్టు,. పుస్తకం ఎలాగూ చేతిలో ఉండేది.
సింప్లీ, హి కెన్ కాల్ యిట్ ఏ డే.

చిన్న ఆనందాలు, గొప్ప అనుభవాలు (పైగా ఆ గురజాడ ఒకడు… జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును – అని అంటాడు ఎగిరెగిరిపడుతూ)

*ఎంటర్ హైదరాబాద్*

ఆంధ్రప్రభలో అదే గొప్ప దిక్కుమాలిన కార్టూనిస్టు ఉద్యోగం కోసం మోహన్ 1980లో హైదరాబాద్ వచ్చాడు, క్రోక్విల్ చెవిలో పెట్టుకుని.
కార్టూన్లు పేలాయి. ఏబీకే, వాకాటి పాండురంగారావు, దేవీప్రియ ఇంకా అనేకుల్, “ఇరగదీస్తున్నావోయ్… రా.. చాయ్ తాగుదాం” అన్నారు లిబర్టీ సెంటర్లో.
వో ఫర్లాంగు నడిస్తే హిమాయత్ నగర్. అనగా మఖ్దూం భవన్ ఉండే చోటు. సీపీఐ నాయకులు, స్నేహితులూ, అరివీర కామ్రేడరీ.

ఆనక 1983లో ‘ఉదయం ‘ హడావిడి మొదలైంది. 1984 డిసెంబరు 29న ‘ఉదయం’ దినపత్రిక మోహన్ కార్టూన్ తో రిలీజైంది. మొదటిరోజు నుంచీ ప్రతి ఉదయం కార్టూన్లు పేలాయి. బొమ్మల్ని జనం ప్రేమించారు. ఉదయంలో మోహన్ రోజుకి పది, ఇరవై, పాతిక బొమ్మలు వేసిన రోజులున్నాయి. జనం మెచ్చినది మనం శాయడమే అనుకున్నాడో, ఏమో! దారినపోయే దానయ్య నుంచి దాసరి నారాయణరావు దాకా ‘శెబ్బాష్ మోహన్’ అన్నారు. అండ్ ద రెస్ట్ ఈజ్ కార్టూన్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.

మోహన్ చుట్టూ ఎప్పుడూ ప్రసిద్ధ కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులూ, మేధావులే. పురాణం సుబ్రమణ్య శర్మ నుంచి నామిని సుబ్రమణ్యం దాకా ఏ. బీ. కే, పతంజలి నుంచి ….కేశవ రెడ్డి, గోరటి వెంకన్న దాకా…

ఏళ్లు పూళ్లూ గడిచిపోయాయి. ఇంకా హైదరాబాద్ కి మంచి కంప్యూటర్, స్కానర్, హెచ్డీ కెమెరా రాని కాలం అది. కాలం కంటే ముందు పరిగెత్తి అలసిపోయాడు.

17 సంవత్సరాలు గడిచిపోయాక ‘సాక్షి’ పేపర్ వచ్చింది. తర్వాత వాళ్లు టీవీ ఛానెల్ పెట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి, సువర్ణకుమార్ పుణ్యాన అందులో మోహన్ యానిమేషన్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు ఓ పాతిక మంది టీమ్ తో. తెలుగు చానెళ్లలో, ఆ మాటకొస్తే ఏ జాతీయ చానల్లోనూ రాని అందమైన, అపురూపమైన యానిమేటెడ్ షార్ట్ ఫిలిం చేసి చూపించాడు.
జనం వెర్రెత్తిపోయారు.
ఇన్ స్టెంట్ హిట్!

జనరల్ గా మోహన్ని ఆర్టిస్టుగానే చూస్తారు. అతనో మంచి రచయిత అని కొద్దిమందికే తెలుసు. మోహన్ ముందు జర్నలిస్టు. అనేక పుస్తకాలు తెలుగులోకి అనువదించాడు. కళ మీద, కార్టూన్ల మీదా ఎన్నో వ్యాసాలు రాశాడు. “ఇతను ఎంత మంచి వచనం రాస్తున్నాడు” అని రచయితలూ, కవులే ముచ్చటపడ్డారు. “కార్టూన్ కబుర్లు” అనే మోహన్ వ్యాసాల పుస్తకం చాలామందిని ఇన్ఫ్లుయన్స్ చేసింది. “బాపూ గారూ .. అందరూ మీకు అభిమానులు కదా. మీరు అభిమానించేదెవరిని”
అని ఒక సందర్భంలో ఆయన్ని అడిగినపుడు
“ఇంకెవరు? మోహన్” అని బాపూ సమాధానం.

కార్టూన్లలో పొలిటికల్ కార్టూన్లు అనేవి మేలుజాతి పొట్టేళ్ల లాంటివి. అవి వేయడంలో కొమ్ములు తిరిగిన వాడు మోహన్. ఎంకి ఏదంటే వెలుగునీడల వైపు వేలు చూపించినట్లుగా ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ కార్టూన్ అంటే మోహన్ వైపే చూస్తారెవరైనా.

మరో ఇంటరెస్టింగ్ సంగతి – మోహన్ కి సంగీతం అంటే చాలా ఇష్టం. పాత హిందీ సినిమా పాటలు, తెలుగు పాటలు, జానపదాలు తెలిసినవాడు. గురుదత్ సినిమాలన్నా, ప్యాసాలో వహీదా రెహమానన్నా చాలా చాలా మురిపెం మోహన్ కి. టాల్ స్టాయ్ వార్ అండ్ పీస్, అన్నాకెరెనినా, షోలహెూవ్ రాసిన అండ్ ది క్వయిట్ ఫ్లోస్ ది డాన్ (కేర్ ఆస్పత్రిలో మొన్న బెడ్ మీదుండగా చేతిలో ఇదే ఉంది) అన్నా అంతే ప్రేమ. రష్యా, చైనా, క్యూబా, వియత్నాం , లాటిన్ అమెరికా విప్లవోద్యమ చరిత్ర గురించి ఎన్ని గంటలైనా అలుపు లేకుండా మాట్లాడతాడు. చేగువేరా త్యాగమూ, హోచిమిన్ ఆదర్శమూ, నిరుపేదవాడి పోరాటమూ మోహన్ ని కదిలిస్తాయి. గోబీ ఎడారిలో తూనీగల్లా పరిగెత్తే చంఘిజ్ ఖాన్ సేనల గుర్రాల నుంచి గుడిపాటి వెంకట చలం మైదానం దాకా ఎన్ని కబుర్లయినా చెబుతాడు. నెరుడా జ్ఞాపకాల నుంచి మావోసేటుంగ్ వ్యాపకాల దాకా ఎన్ని ముచ్చట్లో చెప్పలేం.

ఇలా ఎన్ని చర్చలయినా, కబుర్లయినా, బొమ్మలు వేసివ్వడం అయినా బ్లాక్ టీ తాగినంత హాయిగా, ఈజీగానే. భేషజానికో, పోజుకో తావేలేదు.

ఇలా గత 40 సంవత్సరాలుగా నాన్ స్టాప్ గా బొమ్మలు వేస్తూనే ఉన్నాడు. సాటి ఆర్టిస్టుల్ని ఎంతగా ఆదరించాడో అంతగానూ ప్రభావితం చేశాడు. విన్సెంట్ వాంగో, పాల్ గాగిన్, పికాసో బొమ్మలూ బతుకులూ, ఎంఎఫ్ హుస్సేన్, సమీర్ మండల్, సచిన్ జల్తారే, లక్ష్మాగౌడ్, వైకుంఠం బొమ్మల్లోని సౌందర్యమూ, తత్వాల గురించి మోహన్ చెబుతున్నపుడు విని తీరాలి. విషయాన్ని సూటిగా, స్పష్టంగా, అలవోకగా హాస్యానికి అణుమాత్రమూ కొదవలేకుండా చెప్పడంలో మోహన్ స్పెషలిస్టు. తెలుగు, భారతీయ ప్రాచీన చిత్రకళ మీద గట్టి అవగాహన ఉన్నవాడు. ‘శంకర్స్ వీక్లీ’ శంకర్ నుంచి డేవిడ్ లో దాకా, అబు అబ్రహాం నుంచి అమెరికన్ సూపర్ స్టార్ సెర్గీ ఆరగాన్స్ దాకా జాతీయ, అంతర్జాతీయ కార్టూన్ కళని బాగా అధ్యయనం చేసినవాడు. రాసినా, మాట్లాడినా, బొమ్మేసినా అతనికే చెల్లిందని అనిపించుకున్న అరుదైన గౌరవాన్ని పొందినవాడు మోహన్.

ఆర్టిస్టు మోహన్ ని ‘జీనియస్’ అన్నాడు మణిశంకర్ అయ్యర్. “నీ గీతలో మ్యాజిక్ ఉంది మోహన్” అన్నారు అంతర్జాతీయ ఖ్యాతి పొందిన మన గోవా ఆర్టిస్ట్ మారియో మిరాండా.
“నీ గీతలు నాకిష్టం. నువ్వు రాసే అక్షరాల్లో మనోహరమైన చైనీయమైన కళ ఉంది” అన్నారు లెజండరీ ఆర్టిస్ట్ కొండపల్లి శేషగిరిరావు గారు.

చదువుకోవడమూ, బొమ్మలు వేయడం తప్ప తనకీలోకంతో మరేపనీ లేనట్టుగానే ఉంటాడు మోహన్. ఒక చేత్తో పెన్సిలూ, మరో చేత్తో బ్రష్షు పట్టుకుని, ఇంకో డజను చేతుల్తో స్నేహాన్ని, ప్రేమనీ పంచి ఇచ్చే మాంత్రికుణ్ణి మీరెప్పుడూ చూడలేదా?

అయితే మోహన్ని మీరింకా కలుసుకోనట్టే.

(September 21st, Mohan’s death anniversary)

Author

dhoni.raju219@gmail.com

Related Posts

dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన...

Read out all

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

tollywood: ‘Kathanar’ Trailer Signals a Grand Cinematic Leap

Tollywood: Actor , known for redefining the scope of female-led cinema in India, appears poised to scale new heights with her upcoming...

Read out all
Optimized by Optimole