Exitpoll2024: ‘ఆరా’ మస్తాన్‌ కు బాంబే స్మగ్లర్‌ హజీ మస్తాన్‌ కన్నా ఎక్కువ టెంపరవరీ ప్రచారం వచ్చేసిందే!

Nancharaiah merugumala senior journalist:

”  ఏపీ ఎగ్జిట్‌ పోల్‌ తో ‘ఆరా’ మస్తాన్‌ కు 1970ల నాటి బాంబే స్మగ్లర్‌ హజీ మస్తాన్‌ కన్నా ఎక్కువ టెంపరవరీ ప్రచారం వచ్చేసిందే..!  “

1970లు, 80ల నాటి బొంబాయి స్మగ్లర్, అండర్‌ వరల్డ్‌ డాన్‌ హజీ మస్తాన్‌ (అసలు పేరు మస్తాన్‌ మీర్జా ఉరఫ్ సుల్తాన్ మీర్జా) సాహబ్‌ కు దేశవ్యాప్తంగా ఎంతటి ‘పేరు ప్రఖ్యాతులు’, సాంప్రదాయ మీడియాలో ప్రచారం ఉండేవో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లో ఏఏ ఆర్‌ ఏఏ (ఆరా) మస్తాన్‌ వలీకి అంతటి ప్రచారం వస్తోంది. హజీ మస్తాన్‌ సాబ్‌ కు వచ్చిన ప్రచారం శాశ్వతమైనదైతే..మస్తాన్‌ వలీకి వచ్చినది టెంపరవరీ అని అనుకోవాలి. పాతికేళ్లకు పైగా స్మగ్లింగు వ్యాపారంలో కొనసాగిన తర్వాత లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ సమక్షంలో లొంగిపోయి, ప్రజాజీవితంలోకి వచ్చిన హజీ మస్తాన్‌ తమిళనాడు రామనాథపురం ప్రాంతంలోని ముస్లిం కుటుంబంలో పుట్టారు. మన తెలుగు సర్వేల ‘స్మగ్లర్‌’మస్తాన్‌ వలీ గారు గుంటూరు జిల్లా చిలకలూరిపేట దెగ్గిరూళ్లో (మద్దిరాల) జన్మించారు. బంగాఖాతం తీరంలోని కడలూరు నుంచి అరేబియా సముంద్రం ఒడ్డునున్న బొంబాయికి చిన్నప్పుడే తండ్రితోపాటు వలసపోయిన మస్తాన్‌ భాయ్‌ మొదట దమన్‌ కు చెందిన సుకుర్‌ నారాయణ్‌ బఖియా, రాజ్‌ నారాయణ్‌ బఖియా అనే హిందూ గోల్డ్‌ స్మగ్లర్లతో కలిసి దొంగరవాణా దందా చేసేవాడని ఎప్పుడో చదివినట్టు గుర్తు.

ఇక మన ఆరా మస్తాన్‌ వలీ విషయానికి వస్తే… ఒరిజినల్‌ ఓబీసీ కాని ముస్లిం కుటుంబంలో పుట్టినాగాని ఆయనకు సంఘ్‌ పరివార్‌ సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు(ఏబీవీపీ)తో అనుబంధం ఉందని విన్నాను. అసలు ఈ ‘ఆరా’ అంటేనే సంస్కృత పదాల నుంచి పుట్టిన పొట్టి పేరు అని కూడా ఎవరో చెప్పారు. మరి హిందుత్వ విద్యార్ధి, రాజకీయపక్షాలతో (ఏబీవీపీ, బీజేపీ) అనుబంధం ఉన్న ఈ ముస్లిం మేధావి ఏటా నర్సరావుపేట సమీపంలో జరిగే కోటప్పకొండ తిరనాళ్ల సమయంలో, ఇంకా ఇతర హిందూ పండగల కాలాల్లో హిందూ భక్తులకు భోజనాలు పెట్టి పుణ్యం కట్టుకుంటున్నారని కూడా ఆయన సోషల్‌ మీడియా, ఇతర మీడియాలో ఇచ్చే ప్రకటనల ద్వారా తెలిసింది. ఇంకా ఈ ఎన్నికల్లో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న గుంటూరు నగర అసెంబ్లీ సీటు నుంచి పోటీచేయడానికి బీజేపీ టికెట్‌ ఇస్తానన్నా వద్దని మస్తాన్‌ సాబ్‌ తిరస్కరించారని కూడా ప్రచారం జరిగింది.

కాషాయ కూటమితో చిన్నప్పటి నుంచే అనుబంధం ఉన్న మస్తాన్‌ వలీ నిన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తన ఆరా ఎగ్జిట్‌ పోల్‌ లోక ఈ పసుపు–కాషాయ కూటమి ప్రధాన ప్రత్యర్ధి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కాస్త ఎక్కువ మొగ్గు చూపించడం టీడీపీ సహా లక్షలాది మంది హిందూ భక్తులకు ఏమాత్రం బాగోలేదు. మస్తాన్‌ వలీ ‘మాతృసంస్థ’ బీజేపీ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం–జనసేన కూటమిలో చేరి ఎన్నికల్లో రెండోసారి పోటీచేసినప్పటికీ ‘ఆరా’ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వైకాపాకు అనుకూలంగా ఉండడం తెలుగు హిందూ బుర్రలకు అర్ధం కావడం లేదు. అసలు ‘ఆరా’ సంస్థ ఏపీలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్‌ సరిగా చేసిందా? పోలింగ్‌ తర్వాత సమయంలో ఓటర్ల మనసు ఎటువైపు ఉందో కాస్త ఖచ్చితంగా ఆరా తీయడం మస్తాన్‌ గారి సంస్థకు బాగా వచ్చా? అనే అనుమానాలు కూడా ఏపీలో రాజకీయ చైతన్యం పొంగిపొరలే పూర్వ ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల సాధారణ జనానికి వస్తోంది.

Optimized by Optimole