నెహ్రూ–ఇందిర, సోనియా ఏలుబడిలో సరిపడా దోచుకున్నాం : కాంగ్రెస్ ఎమ్మెల్యే

Nancharaiah Merugumala (senior journalist)
===============================
నెహ్రూ–ఇందిర, సోనియా ఏలుబడిలో మూడు నాలుగు తరాలకు సరిపడా దోచుకున్నాం, ఇకనైనా త్యాగాలు చేయకపోతే మన తిండిలో పురుగులు తప్పవు
––––––––––––––––––––––––––––––––––––––––––––––––
కర్ణాటక మాజీ స్పీకర్, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, ములకనాడు బ్రాహ్మణ నేత రమేశ్‌ కుమార్‌ ‘కుండబద్దలు’ మాటలు, ఏమైనా కన్నడ బ్రామ్మలు తెలుగోళ్ల కంటే గొప్పోరే!
==============================================
‘‘ పండిత నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఏలుబడిలో కాంగ్రెస్‌ నేతలు మూడు నాలుగు తరాలకు సరిపడా డబ్బు, ఇతర రకాల సంపద కూడబెట్టారు. కాంగ్రెసోళ్లు త్యాగాలు చేయాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ వాదులమైన మేము దేశ ప్రజల రుణం తీర్చుకోవడానికి సిద్ధపడకపోతే–మేం తినే తిండిలో పురుగులు పడతాయి. ’’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు, కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కే ఆర్‌ రమేశ్‌ కుమార్‌. గురువారం రమేశ్‌ కుమార్‌ అన్న మాటలు సహజంగానే పాలకపక్షమైన బీజేపీకి ఆయుధాలుగా మారాయి. రమేశ్‌ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నేత, హోం మంత్రి అరగా జ్ఞానేంద్ర స్పందిస్తూ, ‘‘రమేశ్‌ కుమార్‌ గారంటే మాకెంతో గౌరవం ఉంది. ఆయన ప్రకటన ఆషామాషీది కాదు. ప్రతి కాంగ్రెస్‌ వాదీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గాంధీ, నెహ్రూల పేరు మీద వారు సంపాదించినదంతా ప్రజల సొమ్మే. దాన్ని వారు జనానికి తిరిగి ఇచ్చేయాలి. నేషనల్‌ హెరాల్డ్‌ కుంభకోణం కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ప్రశ్నించిన రోజున బెంగళూరులో నిరసన ప్రదర్శన పాల్గొన్నప్పుడు రమేశ్‌ కుమార్‌ పై వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. కోలారు జిల్లా శ్రీనివాసపుర శాసనసభ్యుడైన 72 సంవత్సరాల రమేశ్‌ 1994–1999 మధ్య ఐదేళ్లు, 2018–2019 మధ్య ఏడాదికి పైగా కర్ణాటక శాసనసభ స్పీకర్‌గా రెండుసార్లు పనిచేశారు. 2016–18 మధ్య రాష్ట్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖా మంత్రిగా ఉన్నారు.
తెలుగు మూలాలున్న ములకనాడు బ్రాహ్మణోత్తముడు రమేశ్‌
–––––––––––––––––––––––––––––––––––––
కందం రామయ్య (కేఆర్‌) రమేశ్‌ కుమార్‌ మన తెలుగు మూలాలున్న ములకనాడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. రాయలసీమలోని కడప, అనంతపురం తదితర ప్రాంతాల్లో నివసించే బ్రాహ్మణ శాఖ ములకనాడు. ఈ శాఖీయులు బాగా చదువుకున్నోళ్లు. దివంగత బీజేపీ కేంద్ర మాజీ మంత్రి, దక్షిణ బెంగళూరు ఎంపీగా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి ఎచ్‌.ఎన్‌.అనంత కుమార్‌ కూడా తెలుగు మూలాలున్న ములకనాడు బ్రాహ్మణుడే. రమేశ్‌ మొదటి నుంచీ సంచలనాలు సృష్టించే నేత. కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే బ్రాహ్మణ రాజకీయ నాయకులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండే కన్నడ నేల నుంచి రమేశ్‌ వచ్చారు. అందుకేనేమో భిన్నరీతిలో మాట్లాడి తరచు వివాదాలకు కారణమౌతూ, చివరికి క్షమాపణలు చెప్పడం ఆయనకు ఆనవాయితీగా మారింది. ఆయన కాంగ్రెస్‌ వాదిగానే రాజకీయ జీవితం ప్రారంభించినా దివంగత కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే సూదిని జైపాల్‌ రెడ్డి గారి మాదిరిగా తర్వాత జనతాపార్టీ, జనతాదళ్‌ లో చేరి త్వరగానే కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. సొంత నియోజకవర్గంలో (శ్రీనివాసపుర) ప్రధాన వ్యవసాయకులమైన ఒక్కళిగలు ఎక్కువ, బ్రామ్మల జనాభా రెండు శాతం కూడా ఉండదు. పొరుగున రాయలసీమ ఉన్న కారణంగానేమో మరి ఇక్కడి ఒక్కళిగలు తమ పేర్ల చివర రెడ్డి అనే రెండక్షరాలు జతచేసుకుంటారు. శ్రీనివాసపురలో రమేశ్‌ కుమార్‌ రాజకీయ ఎన్నికల ప్రత్యర్థి కూడా ఒక్కళిగ కులస్తుడైన జీకే వెంకటశివా రెడ్డి. రమేశ్, వెంకటశివారెడ్డి ఈ స్థానంలో మొత్తం 9 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో తలపడ్డారు. 1978 నుంచి 2018 వరకూ జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు రమేశ్‌ కుమార్, మూడుసార్లు శివారెడ్డి గెలిచారు. ‘మైనారిటీ’ బ్రాహ్మణ వర్గానికి చెందిన రమేశ్‌కుమార్‌ను నియోజకవర్గ ఓటర్లు గౌరవంగా ‘స్వాములు’ అని పిలుస్తారట.
ఎన్నికల్లో ఓడిపోయాక కన్నడ టెలివిజన్‌ సీరియల్‌ ‘ముక్త’లో నటించారు
––––––––––––––––––––––––––––––––––––––––––––
ఇప్పటికి పదిసార్లు అసెంబ్లీకి పోటీచేసిన రమేశ్‌ 1999 ఎన్నికల్లో జీకే శివారెడ్డి చేతిలో అసెంబ్లీ స్పీకర్‌ హోదాలో ఉండి ఓడిపోయారు. వెంటనే ఈటీవీ కన్నడ చానల్‌ లో ప్రసారమైన కన్నడ సీరియల్‌ ‘ముక్త’లో ఆయన నటించారు. జడ్జి పాత్రలో ఆయన నటించిన ముక్త సూపర్‌ హిట్‌ అయింది. ఈ సీరియల్‌ 2000ల్లో రాష్ట్రంలో బాగా ప్రేక్షకాదరణ పొందింది. మరి కొన్ని కన్నడ సీరియల్స్, సినిమాల్లో కూడా ఆయన నటించారు. మంచి వక్త, వాదకుడు అయిన రమేశ్‌ కాంగ్రెస్‌ మాజీ సీఎం ఎస్‌ సిద్దరామయ్యకు పాత మిత్రుడు. ఇద్దరికీ లోహియా సోషలిస్టు పార్టీ నేపథ్యం ఉంది. తాను బ్రామ్మడినైనా తనను రాజకీయాల్లోకి అంటే విధానసభలోకి తెచ్చిన పూర్వపు కాంగ్రెస్‌ సీఎం డీ దేవరాజ అరసుకు రుణపడి ఉన్నానని రమేశ్‌ తరచు చెబుతుంటారు రమేశ్‌. ‘‘నా నియోజకవర్గంలో మా బ్రామ్మలు అల్పసంఖ్యాకులు. మెజారిటీవర్గం (ఒక్కళిగలు) తమ కులానికి చెందిన అభ్యర్థిని (శివారెడ్డి) ఓడించి ఆరుసార్లు నన్ను గెలిపించారు. మూడు సార్లే అతన్ని ఎన్నికున్నారు. నేను నా కులానికి అతీతంగా ఉండబట్టే నా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆరుసార్లు విధానసభకు ఎన్నికయ్యాను. రెండుసార్లు సభాపతి కాగలిగాను. ప్రజాజీవితం అంటే ఇలా ఉండాలి,’ రెండేళ్ల క్రితం మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు రమేశ్‌.
‘పదునైన’ వ్యగ్యం రమేశ్‌ సొంతం..
––––––––––––––––––––
రాజమండ్రి బ్రామ్మణ కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ మాదిరిగా వీధి వ్యగ్యం లేకపోయినాగాని రమేశ్‌ కుమార్‌ కూడా విధానసభలో అప్పుడప్పుడూ హాస్యం పండించేవారు. 2018లో జనతాదళ్‌–ఎస్‌ ఎమ్మెల్యేలు కొందరు రెబల్స్‌ గా మారినప్పుడు, విశ్వాస పరీక్ష చర్చ సందర్భంగా వారిని చంబల్‌ బందిపోట్లతో పోల్చారు ఈ పార్టీ నేత కేఎం శివలింగప్ప. స్పీకర్‌ స్థానంలో కూర్చున్న రమేశ్‌ జోక్యం చేసుకుంటూ, ‘ శాసనసభ్యులను బందిపోట్లతో పోల్చుతూ డకాయిట్లను ఎందుకు మీరు అవమానిస్తున్నారు?’ అని ప్రశ్నించారు. కిందటేడాది 2021 డిసెంబర్‌ లో అసెంబ్లీలో మామూలు సభ్యుడి హోదాలో ఉన్న రమేశ్‌ కుమార్‌ స్త్రీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా మహిళల ఆగ్రహానికి గురయ్యారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల తమ నియోజకవర్గాల్లో ప్రజల ఇబ్బందుల గురించి సభ్యులు ఎక్కువ మంది మాట్లాడడానికి ప్రయత్నించారు. దీంతో, స్పీకర్‌ విశ్వేస్వర్‌ హెగ్గడే కాగేరీ ఇబ్బందిపడ్డారు. ‘‘సభ్యులంతా మాట్లాడుతుండగా నేను ‘అవును, అవును ’ అంటూనే వారి మాటలు వినక తప్పదు. సభను ఇలా నడపడం కష్టం కదా,’’ అని సభాపతి కాగేరి అన్నారు. దీంతో, రమేశ్‌ కుమార్, ‘‘చూడండి, స్పీకర్‌ గారూ. ‘రేప్‌ లేదా బలాత్కారం తప్పనిసరి అయినప్పుడు కింద పడుకుని ఆనందించాలి, అనే సామెత ఉంది.’’ అని సలహా ఇచ్చారు. వెంటనే ఆగ్రహించాల్సిన స్పీకర్‌ కాగేరి అందరితో పాటు నవ్వి ఊరుకున్నారు.
మరుసటి రోజు మహిళా హక్కుల సంఘాలు కర్ణాటక గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహలోత్‌ కు ఫిర్యాదు చేయడంతో కన్నడ శాసనసభ్యురాళ్లతో సహా ఒక్కసారే మహిళాలోకం కళ్లు తెరిచింది. నిరసనలు మిన్నంటాయి. దీంతో తాను మాట తొందరలో అలా మాట్లాడానని, తనకు స్త్రీలంటే ఎంతో గౌరవముందని అంటూ క్షమాపణలు చెప్పారు రమేశ్‌ కుమార్‌. కేఎస్‌ కారంత్, యూఆర్‌ అనంతమూర్తి, గిరీశ్‌ కర్నాడ్‌ వంటి ఎందరో గొప్ప బ్రాహ్మణులు పుట్టిన కర్ణాటకలో ఈ కులం జనాభా రెండు శాతం మించదు.
అయినా, రమేశ్‌ కుమార్‌ వంటి తెలివైన బ్రాహ్మణ నేతలు ఉన్న కారణంగా ప్రస్తుత కర్ణాటక అసెంబ్లీలో బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టిన 14 మంది సభ్యులు ఉన్నారు. ముగ్గురు బీజేపీ బ్రాహ్మణ నేతలు లోక్‌ సభకు 2019లో ఎన్నికయ్యారు. మరి కన్నడ బ్రాహ్మణ రచయితలు, బ్రాహ్మణ రాజకీయ నాయకుల మాదిరిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని బ్రామ్మలు రాణించాలంటే ఏం చేయాలో ఆలోచిస్తే–విశాల తెలుగు సమాజానికి ఎనలేని మేలు తప్పక జరుగుతుంది. బ్రాహ్మణులు మంచి బుర్రలు, మనసులతో ఆలోచించేవారైతే –మిగిలిన అందరూ సుఖసంతోషాలతో ఉంటారని ఎన్నో సామాజిక పరిశోధనలు తేల్చిచెప్పాయి.