*కుల్దీప్ను పక్కన పెట్టడంలో కామన్సెన్స్ ఏది?
*టీమిండియా మేనేజ్మెంట్పై రవిచంద్రన్ అశ్విన్ అసంతృప్తి.. వెస్టిండీస్‌తో కీలక పోరులో స్పిన్నర్‌ను ఆడించకపోవడంపై ప్రశ్నలు!
న్యూస్‌మినిట్24 | స్పోర్ట్స్ డెస్క్
హైదరాబాద్: వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్ల ఎంపిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను వరుసగా రెండు మ్యాచ్‌లలో పక్కన పెట్టడంపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెస్టిండీస్ బ్యాటర్లు కుల్దీప్ బౌలింగ్‌లోని వైవిధ్యాన్ని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నప్పుడు.. అతడిని జట్టుకు దూరంగా ఉంచడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు.
వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లోనూ భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో జట్టు ఎంపికపై చర్చ మరింత పెరిగింది. కుల్దీప్ యాదవ్‌ను ఆడించకపోవడంపై అశ్విన్ తన యూట్యూబ్ కార్యక్రమం ‘యాష్ కీ బాత్’లో స్పందించారు. వెస్టిండీస్ బ్యాటర్లు కుల్దీప్ గూగ్లీ, లెగ్స్పిన్లను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని, అలాంటి సమయంలో అతడిని పక్కన పెట్టడం వెనుక ఉన్న కారణాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
కుల్దీప్ను జట్టులోకి తీసుకోకపోవడం కొంత కామన్సెన్స్ లేని నిర్ణయంగా అనిపిస్తోందని అశ్విన్ వ్యాఖ్యానించారు. అతడు ఆడివుంటే మ్యాచ్‌లో 15 నుంచి 20 పరుగుల వరకు తేడా వచ్చి ఉండేదని అభిప్రాయపడ్డారు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో కుల్దీప్ యాదవ్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడాడు. లక్నోలో జరిగిన తొలి టీ20లో 33 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే, రాంచీలో జరిగిన రెండో మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఓటమి చవిచూసింది.
దీంతో ఇండోర్‌లో జరిగిన మూడో టీ20తో పాటు హైదరాబాద్‌లో జరిగిన నాలుగో టీ20లోనూ కుల్దీప్కు తుది జట్టులో చోటు దక్కలేదు.ఇండోర్‌లో మైదానం పరిమాణం, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే కుల్దీప్ను పక్కన పెట్టడాన్ని అర్థం చేసుకోవచ్చని అశ్విన్ అభిప్రాయపడ్డారు. అయితే, హైదరాబాద్‌లోనూ అదే నిర్ణయాన్ని కొనసాగించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాంచీలో భారత్ ఓటమికి కుల్దీప్ ఒక్కడినే బాధ్యుడిగా చూడటం కూడా సరికాదని స్పష్టం చేశారు.
బౌలింగ్ విఫలం!
హైదరాబాద్‌లో జరిగిన నాలుగో టీ20లో వెస్టిండీస్ బ్యాటర్లు భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మూడు వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 223 పరుగులకే పరిమితమైంది. దీంతో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-2తో సమమైంది. కీలకమైన నాలుగో మ్యాచ్‌లో భారత బౌలర్లు పరుగులను నియంత్రించలేకపోవడం జట్టు వ్యూహాలపై ప్రశ్నలు లేవనెత్తింది.
వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించాడు. మూడు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు తీసి భారత జట్టు తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. వన్డేల్లో అతడి ప్రదర్శన, వెస్టిండీస్ బ్యాటర్లపై స్పిన్ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే టీ20ల్లోనూ అతడి సేవలను వినియోగించుకోవాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిర్ణయాత్మక మ్యాచ్‌పై ఆసక్తి!
సిరీస్ 2-2తో సమమైన నేపథ్యంలో చివరి టీ20 మరింత కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లోనైనా కుల్దీప్ యాదవ్‌కు అవకాశం కల్పిస్తారా? భారత జట్టు మేనేజ్మెంట్ బౌలింగ్ వ్యూహాల్లో మార్పులు చేస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
