తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది: బిజేపి స్టేట్ చీఫ్ బండి

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు బిజేపి స్టేట్ చీఫ్ బండి సంజయ్. రాష్ట్రంలో మహిళలు ఏం కోరుకుంటున్నారు? వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? కేంద్ర ప్రభుత్వం మహిళల అభివ్రుద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా? లేదా? అసలు కేంద్ర పథకాల గురించి మహిళలు ఏమనుకుంటున్నారనే అంశాలపై క్షేత్ర స్థాయికి వెళ్లి తెలుసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా నేతలను ఆదేశించారు. మహిళలను నేరుగా కలిసి.. ఆర్దిక, ఆరోగ్య పరిస్థితులనూ అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఇతర పార్టీల మాదిరిగా నాలుగు గోడల మధ్య ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించడం లేదని.. క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించడంతోపాటు వారు ఏం కోరుకుంటున్నారో అధ్యయనం చేసి మేనిఫెస్టోను రూపొందిస్తామని సంజయ్ స్పష్టం చేశారు.

కాగా మహిళలకు గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నో మంచి సంక్షేమ పథకాలను బీజేపీ అమలు చేస్తోందన్నారు సంజయ్.  అర్హులైన పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని..ఇండ్లు నిర్మిస్తామని తేల్చిచెప్పారు. పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని, గ్రామాల్లో నడిచే ప్రతి అభివృద్ధి పనులకు కేంద్రమే నిధులిస్తోందని సంజయ్ కుండ బద్దలు కొట్టారు.