Loksabhaelections2024: లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ తిరిగి పగ్గాలు చేపట్టకుండా కట్టడి చేయాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి 400 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తుంటే, పది సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ‘ఇండియా’ కూటమితో బీజేపీకి అడ్డుకట్ట వేయాలనే పట్టుదలతో ఉంది.
పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి 2014 ఎన్నికల్లో బీజేపీ నరేంద్రమోదీ అస్త్రాన్ని ప్రయోగించి విజయం సాధించింది. 2014లో ‘అబ్ కా బారీ మోదీ సర్కార్’ అంటూ 31 శాతం ఓట్లతో 282 స్థానాల్లో గెలిచి పగ్గాలు చేపట్టిన బీజేపీ, 2019లో ‘ ఔర్ ఏక్ బార్ ఫిర్ మోడీ సర్కార్’ అంటూ 37 శాతం ఓట్లతో 303 సీట్లతో అధికారాన్ని నిలబెట్టుకుంది. 2024 ఎన్నికలను ‘ఫిర్ ఆయేగా మోదీ’ నినాదంతో 50 శాతం ఓట్లతో 400 స్థానాలను గెలవాలని పార్టీ శ్రేణులకు పిలుపిచ్చింది. బీజేపీ నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందా..? లేదా కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ చేతిలో భంగపడుతుందా..? అని విశ్లేషిస్తే పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
గత పదేళ్లలో సాధించిన పాజిటివ్ అంశాలతో ఎన్నికలకు వెళ్తామని మోదీ ప్రభుత్వం చెబుతున్నా, బీజేపీ మరోసారి సున్నితమైన అంశాలతోనే ముందుకొస్తుందని ఆ పార్టీ, దాని అనుబంధ సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలే తేటతెల్లపరుస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దును ఇప్పటికే క్యాష్ చేసుకున్న బీజేపీ త్వరలో సీఏఏ చట్టాన్ని తేనుందని వార్తలొస్తున్నాయి. వీటికి తోడు బీజేపీ తన బ్రహ్మాస్త్రమైన అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవాన్ని అనుకూలంగా ముల్చుకుంటోంది. బీజేపీతో పాటు సంఘపరివార్ ఈ కార్యక్రమాన్ని వివిధ రూపాల్లో దాదాపు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాయి. ఇందులో భాగంగా జనవరి నెల మొత్తం దేశంలోని దాదాపు 17 కోట్ల కుటుంబాలకు రాములోరి అక్షింతలు, ఫొటోలను పంపిణీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికల ముందు ఈ కార్యక్రమాలు నిస్సందేహంగా బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తాయని గతనుభవాలే తెలియజేస్తున్నాయి.
1984లో కేవలం రెండు లోక్‌సభ సీట్లు కలిగున్న బీజేపీ ఇప్పుడు 303 సీట్లతో ప్రతిపక్షాలకు కొరకరాని కొయ్యగా తయరవ్వడానికి ప్రధాన కారణం సున్నితమైన అయోధ్య వంటి అంశాలను ఎంచుకోవడమే. బీజేపీ అభివృద్ధికి కీలకపాత్ర పోషిస్తూ రథయాత్ర చేసిన ఆ పార్టీ కురవృద్ధుడు ఎల్.కే అద్వానీ తన ‘నా దేశం నా జీవితం’ పుస్తకంలో ‘‘..మతం భారత దేశ ఆత్మ. మీరు ఏ విషయాన్నైనా భారతీయులకు చెప్పాలంటే మత భాషలో చెబితే మెరుగ్గా అర్థం చేసుకుంటారు అని వివేకానంద చెప్పిన మాటలు రథయాత్ర సందర్భంగా ప్రత్యక్షంగా గమనించాను..’’ అని చెప్పిన మాటలు అక్షర సత్యాలని ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి. అయోధ్య రామాలయం అంశాన్ని కాంగ్రెస్ కూడా స్వప్రయోజనాలకు వాడుకోవాలనుకున్నా ద్వంద్వ వైఖరితో విఫలమైంది. 1986లో అప్పటి కాంగ్రెస్ ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ బాబ్రీ మసీదు తాళాలు తీయించినా, ఆ పార్టీ ఊగిసలాట వైఖరితో బీజేపీకే ఓట్ల పరంగా లబ్ధి చేకూరింది.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ రామమందిరం వంటి సున్నితమైన అంశాలతోనే విజయం సాధిస్తుందని చెప్పలేము. పటిష్టంగా ఉన్న ఆ పార్టీని ప్రతిపక్షాలు దీటుగా ఎదుర్కొనే వైఖరిపైనే బీజేపీ గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని 38 పార్టీలతో కూడిన ‘ఎన్‌డీఏ’ను కాంగ్రెస్ నేతృత్వంలో 26 పార్టీలతో ఏర్పడిన ‘ఇండియా’ కూటమి కలిసికట్టుగా ఎదుర్కొంటే బీజేపీకి అధికారం నల్లేరుపై నడకేమీ కాదు. దీన్ని గ్రహించిన కాంగ్రెస్ కూడా కూటమి ఐక్యత కోసం కొన్ని త్యాగాలకు సిద్దమవుతోంది. అన్ని స్థానాల్లో పోటీ చేసి బీజేపీకి మేలు చేసే కంటే విజయావకాశాలున్న 300 స్థానాల్లోనే బరిలో నిలిచి మిగతా సీట్లు మిత్రపక్షాలకు కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. చాలా స్థానాల్లో బీజేపీకి ప్రత్యర్థిగా ఒకే అభ్యర్థి ఉండేలా వ్యూహాలను ‘ఇండియా’ కూటమి తయారు చేస్తోంది. బీజేపీకి బలమున్న ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల ఐక్యత కీలకం కానుంది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, కర్ణాటక, అస్సాం, హర్యానా, ఢల్లీిలో ప్రత్యక్షంగా తలపడుతున్నాయి. మహారాష్ట్రలో శిసనేన, ఎన్సీపీ పార్టీలు చీలిపోవడంతో ఒక వర్గం ఎన్‌డీఏలో మరో వర్గం ‘ఇండియా’తో ఉన్నాయి. మహారాష్ట్రలో శరద్‌పవార్, ఉద్దవ్ ఠాక్రేలతో, ఢల్లీిలో ఆప్‌తో కాంగ్రెస్ కుదుర్చుకునే సయోధ్యను బట్టి ఫలితాలుంటాయి. ఇక్కడ ‘ఇండియా’ కూటమిలో పొరపొచ్చలొస్తే మాత్రం బీజేపీకే ప్రయోజనం.
ఉత్తర ప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిస్సా, బీహార్ రాష్ట్రాల్లో బీజేపీ, ప్రాంతీయ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ నుండి త్యాగాలు అవసరం. ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో, బీహార్‌లో జేడీ(యూ), ఆర్జేడీలతో, పశ్చిమబెంగాల్‌లో తృణముల్ కాంగ్రెస్, వామపక్షాలతో సీట్ల విషయంలో ఇచ్చిపుచ్చుకునే వైఖరితో కాంగ్రెస్ ఉండాలి. ఒడిస్సాలో బిజూ జనతాదళ్ బీజేపీ, కాంగ్రెస్‌లకు దూరంగా ఉంది. పై రాష్ట్రాల్లో ఒడిస్సా మినహా మిగతా చోట్ల బీజేపీతో ముఖాముఖిగా తలపడితే ‘ఇండియా’ కూటమికి లబ్ధి చేకూరుతుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యం. తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ కూటమికి అన్నాడీఎంకే ప్రత్యర్థిగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీలైన వైఎస్‌ఆర్సీపీ టీడీపీ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ నోటాతో పోటీపడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య త్రిముఖ పోటీ అవకాశాలున్నాయి. పంజాబ్‌లో ప్రధాన పోటీ కాంగ్రెస్, ఆప్ మధ్యే ఉండనుంది. కేరళలో ‘ఇండియా’ కూటమిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న వామపక్షాలు కాంగ్రెస్‌తో ముఖాముఖి తలపడుతున్నాయి. పై రాష్ట్రాల్లో తెలంగాణ మినహా మిగతా నాలుగు రాష్ట్రాలో బీజేపీ ప్రభావం నామమాత్రమే కావడంతో పోటీ ‘ఇండియా’ కూటమిలోని పార్టీల మధ్యే ఉండడం ఆసక్తికరం.
ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న బలాబలాలను పరిశీలిస్తే ఎన్‌డీఏ 332 ‘ఇండియా’ కూటమి 141ఎంపీలను కలిగున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న 400 స్థానాల గెలుపు ఆచరణలో కష్టసాధ్యమే. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీ అంచనాలు పెరిగాయి. అయితే ఈ మూడు రాష్ట్రాల్లో 65 ఎంపీ సీట్లుండగా వాటిలో ఇప్పటికే బీజేపీ ఖాతాల్లో 61 స్థానాలున్నాయి. మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో బీజేపీ 40 స్థానాల్లో గెలిచింది. ఈ రాష్ట్రాల్లో బీజేపీ పాత మిత్రులు ప్రస్తుతం కాంగ్రెస్‌తో దోస్తీ చేయడంతో ఆ స్థానాలు నిలబెట్టుకోవడం సులభం కాదు. మరోవైపు దక్షిణాదిన ఉన్న 131 నియోజకవర్గాల్లో బీజేపీ 2019లో 29 గెలిచింది. ఇందులో కర్ణాటకలో 25, తెలంగాణలో 4 స్థానాలున్నాయి. ఎనిమిది నెలల క్రితం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోవడంతో ఇక్కడ గతంలో గెలిచిన 25 సీట్లను నిలబెట్టుకోవడం ఆ పార్టీకి సులభం కాదు. ఇక బీజేపీ ఆశాలన్నీ 2019లో 62 స్థానాలు సాధించిన ఉత్తరప్రదేశ్‌పైనే ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే బీజేపీకి ప్రస్తుతమున్న 303 స్థానాలు గెలవడమే అతికష్టం.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 49 స్థానాల్లో ఆ పార్టీకి ఇప్పుడు నాలుగు స్థానాలున్నాయి. ఈ రాష్ట్రాల్లో గరిష్టంగా సాధించే సీట్లపైనే ఆ పార్టీ అధిష్టానం ఆశలు పెట్టుకుంది. 2019లో కేరళలో కాంగ్రెస్ 15 స్థానాలు గెలిచింది. అక్కడ వామపక్షాలతో గట్టి పోటీ ఉండనుంది. తమిళనాడులో 2019లో 39 స్థానాల్లో యూపీఏ 38 గెలవగా, అందులో కాంగ్రెస్ వాటా 8 స్థానాలు. ఒక్క సీటు లేని కేరళ, తమిళనాడులో బీజేపీ ఒక్కటి గెలిచినా ఆ పార్టీకి బోనసే. పంజాబ్‌లో 2019లో కాంగ్రెస్ 8 స్థానాలు గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ చేతిలో అధికారాన్ని కోల్పోవడంతో గతంలో వచ్చిన సీట్లు కూడా రావడం కష్టమే. కేరళలో వామపక్షాలు, పంజాబ్‌లో ఆప్ అధిక సీట్లు గెలిచినా అవి ‘ఇండియా’ ఖాతాలో పడడం ఆ కూటమికి ఉపశమనం. కేరళ, పంజాబ్, తమిళనాడులో కాంగ్రెస్ ప్రస్తుతమున్న బలాన్ని నిలుపుకుంటూనే కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లలో అదనపు స్థానాలు సాధించాలి. దీంతోపాటు పార్టీకి సంస్థాగతంగా బలమున్న ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లో మిత్రపక్షాలతో బేధాభిప్రాయాలు లేకుండా సాగితేనే కాంగ్రెస్‌కు ప్రయోజనం.
భావోద్వేగాలే తమకు శ్రీరామరక్ష అనే భావనతో బీజేపీ అధికారంపై దీమాగా ఉంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆ పార్టీ నిర్ధేశించుకున్న 400 స్థానాలు సాధించడం మాత్రం అసాధ్యం. బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కూటమిలోని పార్టీల సఖ్యతపైనే ఆధారపడి ఉంది. కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తూ ‘ఇండియా’ కూటమి రథాన్ని ఐక్యత బాటలో నడిపించాల్సిన ఆవశ్యకత ఉంది. లేకపోతే మరోసారి రామ(బీజేపీ)సేన చేతిలో భంగపాటు తప్పదు. సున్నితమైన అంశాలను ఎన్నికల్లో అస్త్రాలుగా మల్చుకోవడంలో సిద్ధహస్తులైన బీజేపీ విసిరే ఎన్నికల రామబాణం లక్ష్యాన్ని ఛేదిస్తుందా..? గురితప్పుతుందా..? లేదా కాంగ్రెస్ దాన్ని ఏవిధంగా విఛిన్నం చేస్తుందో వేచి చూడాలి.
=========================
ఐ.వి. మురళీ శర్మ
రీసెర్చర్ పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ