పెగాసస్ పై స్పష్టత ఇచ్చినా కేంద్రం!

పార్లమెంటును కుదిపేస్తున్న పెగసస్​ వ్యవహారంపై కేంద్రం మౌనం వీడింది. పెగసస్​ వ్యవహారంపై ఉభయ సభల్లో విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో..
ఈ స్పైవేర్ తయారీ సంస్థ, ఎన్​ఎస్​ఓ గ్రూపుతో ఎలాంటి ఒప్పందాలు లేవని రాజ్యసభలో స్పష్టం చేసింది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగకుండా విపక్షాలు అడ్డుపడుతున్నాయని ప్రధాని మోదీ సైతం ఆవేదన వ్యక్తం చేసిన రెండు రోజుల్లోనే.. కేంద్రం ఈ ప్రకటన చేయడం గమనార్హం.
ఇక పెగసస్ వ్యవహారంపై సీపీఎం ఎంపీ వి.శివదాసన్‌ రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నిస్తూ..ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ టెక్నాలజీస్‌తో రక్షణశాఖకు ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా..? అని ఒకవేళ ఉంటే వాటి వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందుకు రక్షణశాఖ సహాయమంత్రి అజయ్‌ భట్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఎన్‌ఎస్‌వో గ్రూప్‌తో రక్షణశాఖ ఎలాంటి లావాదేవీలు జరపలేదని తెలిపారు.
మరోవైపు మీడియాలో వచ్చిన పెగసస్‌ కథనాలను కేంద్రం కొట్టిపారేసింది. భారత దేశానికి కొందరు చెడ్డపేరు తీసుకురావడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలే అని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో అనధికారిక నిఘా సాధ్యం కాదని, ఇక్కడ చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు మాత్రం పార్లమెంటరీ స్థాయి దర్యాప్తునకు డిమాండ్‌ చేస్తున్నాయి.