చెన్నై జట్టు తొలి విజయం!

ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి విజయాన్ని అందుకుంది. శుక్రవారం ముంబైలోని వాంఖడే వేదికగా పంజాబ్ తో జరిగిన పోరులో చెన్నై జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు ‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. దీపక్‌ చాహర్‌ (13/4) అద్భుత ప్రదర్శనతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న పంజాబ్‌ జత్తును షారుక్ ఖాన్‌(47; 36 బంతుల్లో 4×4, 2×6) ఆదుకున్నాడు. ఓపెనర్లు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(5), మయాంక్‌ అగర్వాల్‌(0)తో పాటు క్రిస్‌గేల్‌(10), దీపక్‌ హుడా(10), నికోలస్‌ పూరన్‌(0) టాప్‌ ఆర్డర్‌ చహార్ దెబ్బకు కుప్పకూలింది. ఓ దశలో ఆ జట్టు వంద పరుగులు కూడా దాటుతుందా అనిపించింది. షారుఖ్ ఖాన్ పోరాట పటిమతో ఆ స్కోరైనా చేయగలిగింది. చెన్నై బౌలర్లలో సామ్ కరన్ , డ్వెన్ బ్రేవో , మెయిన్ అలీ, తలా ఒక వికెట్ పడగొట్టారు. పంజాబ్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని చెన్నై జట్టు 15.4 ఓవర్లలో చేధించింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(5) మరోసారి నిరాశపర్చినా.. మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌(36*; 33 బంతుల్లో 3×4, 1×6)తో పాటు, అల్ రౌండర్ మెయిన్అలీ(46; 31 బంతుల్లో 7×4, 1×6) కలిసి జట్టును విజయ పథంలో నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో చెన్నై సునాయాసంగా విజయం సాధించింది. పంజాబ్‌ బౌలర్లలో షమి రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్‌, అశ్విన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

Optimized by Optimole