నెలల వ్యవధిలో బలోపేతమైన ‘ఇండియా’ విపక్ష కూటమి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పాలక ఎన్డీయేకు వెన్నులో చలి పుట్టించింది. ఇంకొంచెం ముందే జాగ్రత్తపడి, పకడ్బందీగా పొత్తులు కుదుర్చుకొని ఉంటే లోక్ సభలో బలాబలాలు నువ్వా-నేనా అన్నట్టుండేవి. అప్పటికీ, కేవలం 60 సీట్ల వ్యత్యాసం వరకు లాక్కువచ్చి రాజకీయ పండితులనే విస్మయపరిచారు. ‘ఇండియా కూటమి’ నూటాయాబై దాటదన్న పదహారు సర్వే సంస్థల అంచనాలను గల్లంతు చేస్తూ 234 సాధించారు. ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ అని బీజేపీ నినదిస్తే, ఎన్డీయే బలాన్ని 295 లోపుననే కట్టడి చేశారు. కూటమికి కేంద్ర బిందువుగా ఉన్న కాంగ్రెస్ తన సంఖ్యాబలాన్ని రెట్టింపు చేసుకున్నా… అప్పుడు మిత్రుల సక్సెస్ రేటే ఎక్కువ! ఇప్పుడా కాంగ్రెస్ వ్యవహారశైలి మిత్రులకు సంకటంగా పరిణమించింది. ఇదిలాగే కొనసాగితే విపక్షం పుట్టి మునిగే ప్రమాదముందన్నది కూటమి పక్షాల ఆందోళన. హర్యానా పాఠం నేర్చి, అసెంబ్లీల ఎన్నికలను ప్రయోగశాలగా మలచి, 2029 ఎన్నికలు గెలవాలంటే స్పష్టమైన ‘రోడ్మ్యాప్’ కావాలనే డిమాండ్ వస్తోంది.
త్యాగాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నుంచి పాఠాలు నేర్చుకుంటే తప్ప వచ్చే లోక్సభ ఎన్నికల నాటికైనా కుదురుకునేలా లేదు. సంకీర్ణాల శకం, కూటముల కాలంలో రాజకీయాలు వ్యూహాత్మకంగా ఉంటే తప్ప ఒంటెద్దు పోకడలు చెల్లవని గ్రహించాల్సిన సందర్భమిది. జనాదరణ ఉన్నందున, రాజకీయాల్ని శాసించడానికి కూటమి పొత్తుల్లో మిత్ర ధర్మాన్ని నిజాయితీగా పాటించాలనే డిమాండ్ పెరుగుతోంది. నిన్నటి హర్యానా పరాభవమైనా, రేపటి మహారాష్ట్ర ఆకాంక్షలైనా…కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని పరీక్షకు నిలుపుతున్నాయి. కూటమిలోని మిత్రులు పదే పదే ఇదే ఎత్తి చూపుతున్నాయి. ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ ప్రాణ త్యాగాల నుంచి సోనియాగాంధీ (రెండు పర్యాయాలు) పదవీ త్యాగం వరకు… ఆ పరంపరను పార్టీ శ్రేణులకు నూరిపోసే కాంగ్రెస్ నాయకత్వం పొత్తు ధర్మాలను సరిగ్గా పాటించదనే విమర్శ ఉంది. పైగా, మూసపద్దతిన 5 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు, 7 గ్యారెంటీలు… అంటే ఇక చెల్లదని, ప్రత్యామ్నాయ సామాజిక-ఆర్థిక విధానంతో రావాల్సిందేనని ఆలోచనాపరులంటున్నారు. పార్టీ వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తల భవిష్యత్తును ఏకపక్షంగా ‘ఎన్నికల వ్యూహకర్త’ల చేతుల్లో పెట్టడం కూడా సరైంది కాదనే భావన ఇంటా, బయటా వ్యక్తమౌతోంది.
జబ్బునెరిగి మందేయాలి..
ఎన్నికల్లో కాంగ్రెస్ తలపడే అన్ని రాష్ట్రాలు ఒక్కరీతిన లేవు. అక్కడి పార్టీలు, రాజకీయ సమీకరణాల్ని బట్టి పట్టువిడుపులతో వ్యవహరించాల్సి ఉంటుంది. బీజేపీతో కాంగ్రెస్ నేరుగా తలపడే గుజరాత్, రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్ఘడ్ వంటి రాష్ట్రాల్లో పేచీయే లేదు. బహుముఖ పోటీలుండి అక్కడ ‘ఇండియా’ మిత్రులు లేని తెలంగాణ, ఏపీ, ఒడిషా వంటి రాష్ట్రాల్లోనూ ఇబ్బంది లేదు. ఇక, ఇండియా కూటమి ఇతరపక్షాలున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పెద్దమనసు చేసుకొని, పెద్దన్న పాత్ర పోషించాలని మిత్రుల కోరిక. మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఢిల్లీ, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో మిత్రులతో పొత్తుల్లో పేచీలొస్తున్నాయి. ‘తనకు అంతో ఇంతో బలమున్న చోట మిత్రులను ఖాతరు చేయదు, తాను బలహీనంగా ఉండి, మిత్రులు బలంగా ఉన్న చోట వారి సహాయంతో లబ్దిపొందాలని చూస్తుంది’ అని కాంగ్రెస్పై అభియోగం. కొన్ని రాష్ట్రాల్లో పంతంతో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు తీసుకొని, తక్కువ సీట్లు గెలుస్తూ ప్రత్యర్థుల పరిస్థితిని మెరుగుపరుస్తోందనే విమర్శా ఉంది. కిందటిసారి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసి కాంగ్రెస్ 19 చోట్లే నెగ్గింది. 242 స్థానాల అసెంబ్లీలో, మ్యాజిక్ నంబర్కు 12 సీట్లు తగ్గటం వల్ల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. నిన్నటికి నిన్న జమ్మూ- కశ్మీర్ 90 స్థానాల అసెంబ్లీలో 37 స్థానాల్లో పోటీ చేసి, చివరకు కాంగ్రెస్ గెలిచింది 6 స్థానాల్లో! 56 చోట్ల తలపడ్డ నేషనల్ కాన్ఫరెన్స్ 42 చోట్ల నెగ్గింది కనుకే ప్రభుత్వం ఏర్పడింది. ఏం తేడా వచ్చినా, సర్కారు ఏర్పాటు కష్టమయ్యేదే! ‘కాంగ్రెస్తో పెట్టుకునే కంటే, మేమే ఇంకొన్ని సీట్లు పోటీ చేసివుంటే సొంతంగానే బలం సరిపోయేది’ అని ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్య మిత్రుల మనోస్థితికి ప్రతిబింబం. సమాజ్వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్దీ యూపీలో కాంగ్రెస్పై ఇటువంటి అభియోగమే! మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఇంకా ముగియలేదు.
రెండు వేర్వేరు పాఠాలు..
పొత్తుల సయోధ్య లేక నష్టపోయారనడానికి హర్యానా ఉదాహరణ. కాంగ్రెస్-ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) మధ్య సీట్ల పంపకాలకు చర్చలు జరిగి, ఒక దశలో పది స్థానాలకు ఆప్ సిద్దమయింది. అయిదారుకు మించి ఇవ్వలేమన్నట్టు కాంగ్రెస్ వ్యవహరించిన తీరుతో చర్చలు నిలిచాయి. ఆప్ దాదాపు అన్ని చోట్ల పోటీచేసింది. ఒక శాతం మించి ఓటు వాటా ఆప్కు లభించదని సర్వే సంస్థలన్నీ అంచనా వేసినా…. దాదాపు 2 శాతం ఓటువాటా లభించింది. రేపు ఢిల్లీ అయినా, పంజాబ్లో అయినా ఇదే పరిస్థితి! హర్యానాలో గెలుస్తుందనుకున్న కాంగ్రెస్ 11 సీట్ల వ్యత్యాసంతో ఓటమి పాలైంది. సర్వేలను చూసి మురిసి, అప్పటికే అధికారంలోకి వచ్చేసినట్టు భావించిన కాంగ్రెస్ నాయకులు సీఎం కుర్చీకోసం కుమ్ములాటల్లో పడ్డారు. పోలింగ్ రోజున అన్ని ప్రధాన పత్రికల్లో…. భూపీందర్సింగ్ హుడా, రణ్దీప్ సూర్జేవాలా, కుమారి షెల్జా సీఎం కుర్చీకోసం తగువులాడుతున్నట్టు కథనం. సోనియాగాంధీ ఇంటి మనిషి వంటి కుమారి షెల్జా, అలిగి 20 రోజులు ప్రచారానికి దూరముంటే ఎవరూ పట్టించుకోలేదు. 18 మంది తిరుగుబాటుదారులు బరిలో నిలిచినా, వారిని పిలిచి, అనునయించి, విరమంపజేసింది లేదు. ఇందుకు భిన్నంగా, 2024 లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర లో కుదరిన ‘మహా వికాస్ అఘాడి’ పొత్తులు ఫలించాయి. శివసేన, ఎన్సీపీ చీలిక తర్వాత కూడా, వాస్తవికంగా ఎవరికెక్కడ బలముందో అక్కడే సీట్లు తీసుకున్న సయోధ్య ఫలితాల్లో కనిపించింది. రాష్ట్రంలోని 48 లో 30 లోక్సభ స్థానాలు గెలిచి సత్తా చాటడమే కాక, ముగ్గురూ… కాంగ్రెస్ 13(17), శివసేన (ఉద్దవ్ థాక్రే) 9(21), ఎన్సీపీ (శరద్పవార్) 8(10) మంచి సక్సెస్రేట్ సాధించారు. అదే వరసలో అసెంబ్లీ పొత్తు చర్చలూ సాగుతున్నాయి. ‘నా ప్రకారం….. (ఆన్ మై టర్మ్స్)’ అనే సీనియర్ నేత శరద్పవార్ తో వ్యవహారాన్ని కాంగ్రెస్ నేర్పుగా నెరపాల్సి ఉంటుంది. దాదాపు అన్ని సీట్ల సర్దుబాట్లు ముగిసినట్టు వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్ (105), శివసేన (95), ఎన్సీపీ (84)లు ఎక్కువ చోట్ల పోటీ చేస్తాయని, ఎస్పీ తదితర పార్టీలకూ భాగస్వామ్యం కల్పిస్తారనే భావన ఉంది.
ఎక్కడ తగ్గాలో తెలియాలి..
ప్రస్తుత సంకీర్ణ సర్కార్ల శకంలో కూటమి రాజకీయాలు అనివార్యం. ఇచ్చిపుచ్చుకునే పొత్తు ధర్మాల్లో ప్రధానమైంది త్యాగాలు. కూటమి పార్టీలు తమ బలంతో పాటు బలహీనతల్ని గుర్తించి, అంగీకరించాలి. అంతకు మించి మిత్రుల బలాన్ని గుర్తించి, ఉమ్మడి లబ్దికి యత్నించాలి. బలాబలాల వాస్తవికత ఆధారంగానే సీట్లు ఇచ్చిపుచ్చుకునే సమన్వయం పార్టీల మధ్య ఉండాలి. పైస్థాయిలో పరస్పర విశ్వాసం లేని చోట కార్యకర్తలు కలిసి పనిచేయడం గాని, ఓటు బదిలీ కానీ అంత తేలిగ్గా జరుగదు. ‘మిత్ర పక్షాలతో కూటమిగా ఏర్పడి సంకీర్ణంలోనే తప్ప ఒంటరిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేద’ని అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ముఖర్జీ నేతృత్వంలోని ఒక కమిటీ నివేదిక (2003) ఇవ్వడానికి ముందే, సోనియా పొత్తులకు సుముఖత వ్యక్తం చేశారు. ‘బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను గద్దె దించడానికి, మతవాద శక్తుల పీచమణచడానికి కలిసివచ్చే అన్ని శక్తులను ఏకం చేయాల’నే సందేశం ఇవ్వడానికి అప్పట్లో ఆమె రెండు వేదికలను సమర్థంగా వాడుకున్నారు. బెంగళూర్లో జరిగిన పార్టీ ప్లీనరీ సెషన్ (2001), ‘మౌంట్ అబూ’ (2002)లో జరిగిన ‘కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సదస్సు’లు ఆమె ఇచ్చిన నిర్దిష్ట సందేశానికి వేదికలయ్యాయి. అందుకే, 2004లో ప్రభుత్వం ఏర్పరచగలిగారు. కాంగ్రెస్ తలచుకుంటే, హర్యానాలో ఎదురైన ఓటమి నుంచే కాక మహారాష్ట్రలో ప్రత్యర్థి బీజేపీ నుంచి కూడా నేర్చుకోవడానికి పాఠాలుంటాయి. సభలో తమకే ఎక్కువ (105) స్థానాలుండి, అదివరకే ఆయన ముఖ్యమంత్రి పదవి నిర్వహించి కూడా… ఒక పరిస్థితి అలా వచ్చినపుడు, శివసేనను చీల్చి వచ్చిన ఏక్నాథ్ షిండేకు సీఎం పదవిచ్చి, దేవేంద్ర ఫడ్నవిస్ను ఉపముఖ్యమంత్రిగా బీజేపీ సర్దుబాటు చేసింది. అందుకు ఆయనా అంగీకరించారు. పార్టీని, ప్రతిష్టను పెంచడమే కాక ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా తగ్గాలో కూడా తెలిసి, వ్యవహరించడం వల్ల సత్ఫలితాలుంటాయని రాజకీయాలు నేర్పుతాయి.
నానమ్మలా కాకుండా నాన్నలా…
గడచిన పదేళ్లలో రాహుల్గాంధీ రాజకీయంగా ఎదిగారు. ఆయన ఎదుగుదలకు అడ్డొస్తారేమోనని ఒక తరం యువనాయకత్వాన్ని కాంగ్రెస్లో తొక్కేయడమో, బయటకు తోసేయడమో చేశారనే విమర్శ ఉంది. జ్యోతిరాదిత్య సిందియా, జితిన్ ప్రసాద్, వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, సచిన్ పైలట్ వంటి వారి పేర్లను ఇందుకు ఉదహరిస్తారు. 2004 లో ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని వదులుకోవడమే కాకుండా తర్వాతి కాలంలో క్రియాశీల నాయకత్వం నుంచి తన రిటైర్మెంట్ను సోనియా ముందుగానే ప్రకటించినపుడు రాహుల్గాంధీపై బాధ్యతలు పెరిగాయి. సోనియా రిటైర్మెంట్ ప్రకటించినపుడు… అటు ప్రభుత్వంలోనో, ఇటు పార్టీ బాధ్యతో తప్పక తీసుకోవాలని మన్మోహన్ చేసిన ఒత్తిడికి తలగ్గి పార్టీ పదవికి రాహుల్ మొగ్గారు. ఎఐసీసీ ప్రధానకార్యదర్శిగా 2007`12 బాధ్యతలు నిర్వహించిన ఆయన, 2013 జనవరిలో, జైపూర్లో జరిగిన పార్టీ ‘చింతన్ శిబిర్’లో ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నపుడు ఆయన తనయ ఇందిరాగాంధీ ఎఐసీసీ అధ్యక్ష బాధ్యతలు (1959) నిర్వహిస్తే, ఆమె ప్రధానమంత్రిగా ఉన్నపుడు తనయుడు రాజీవ్ గాంధీ ఐఎసీసీ ప్రధానకార్యదర్శి (1983) గా వ్యవహరించారు. రాహుల్ మొదట ప్రధానకార్యదర్శిగా ఉన్నపుడు ప్రధానంగా యువజన కాంగ్రెస్ వ్యవహారాలు చూసేది. తర్వాతి పరిణామాల్లో ఆయన ఎఐసీసీ అధ్యక్ష బాధ్యతల్ని (2017`19) కూడా నిర్వహించి 2019 ఎన్నికల్లో ఓటమికి బాధ్యతవహిస్తూ పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడు లోక్సభలో ప్రతిపక్షనేతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కూటమిలో మరింత వ్యవహార దక్షత, పొత్తుల్లో త్యాగం-సంయమనం చూపితేనే కాంగ్రెస్ రాణిస్తుంది. రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయం కాగలుగుతుంది.