శేఖర్ కంభంపాటి ( సీనియర్ జర్నలిస్ట్ ):
ప్రస్తుత ప్రభుత్వాలు, గత ప్రభుత్వాల మీద విమర్శలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు కాంగ్రెస్ మీద ఒంటికాలు మీద లేచేవి. స్వాతంత్ర్య భారతంలో అర్థ శతాబ్దానికి పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అధోగతి పాలు చేసిందనే విమర్శలు చేసేవి, ఇప్పుడు చేస్తూనే ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశానికి, రాష్ట్రానికి ఏమీ చేయలేదా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో మెదులుతోంది. రాజకీయాల కోసం ఈ వ్యాఖ్యలు చేయాలి అనుకుంటే ఫర్వాలేదు. అప్పటి రాజకీయ పబ్బం గడుపుకోవచ్చు. ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేయవచ్చు. కానీ, ఎల్లకాలం ప్రజలకు వాస్తవాలను తెలుసుకోకుండా ఉండరు కదా!
నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలు చాలా గొప్పవి. దేశ పురోభివృద్ధికి హస్తం ప్రభుత్వాలు చేపట్టిన సంస్కరణలు ఎవరూ కాదనలేని వాస్తవం. దేశ స్వాతంత్ర్యం అనంతరం చిన్నాభిన్నం అయిన భారతాన్ని పునర్నించడంలో శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. పంచవర్ష ప్రణాళికలతో భారీ కర్మాగారాల నిర్మాణాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు , ఐఐటీ ఏర్పాటు, వైద్య సంస్థలు, నవోదయ విద్యా సంస్థలు, రక్షణరంగ సంస్థలు, సాంకేతి సంస్థల ఏర్పాటు, బ్యాంకుల జాతీయకరణ, హరిత విప్లవం లాంటి ఎన్నో బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది. ఆర్థిక సరళీకృత విధానాలు అమలుచేయడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. *ఆ పార్టీ తీసుకొచ్చిన సంస్కరణలే ఇప్పటికీ దేశంలో, రాష్ట్రంలో అమలు అవుతున్నాయి.* ఈనాడు గొప్పగా వర్థిల్లుతున్న సంస్థలన్నీ కాంగ్రెస్ హయాంలో బీజాలు పడ్డవే అనే విషయాన్ని మర్చిపోకూడదు.
ప్రభుత్వాలు అనేవి ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. పార్టీలు మారవచ్చు, పాలకులు మారవచ్చు. కానీ, ప్రభుత్వ కొనసాగింపు అనేది నిరంతర ప్రక్రియ. ప్రతి పాలకుడు ఎంతో కొంత మేర ఆయా రంగాల్లో దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. ఆయా ప్రభుత్వాలు మంచితో పాటు కొన్ని తప్పటడుగులు కూడా వేస్తాయి. *కానీ, తప్పులను ఎత్తి చూపుతూ, చేసిన మంచిని చెప్పకపోవడం ఏంతమాత్రం సమంజసంగా ఉండదు.* తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అలాగని, గత 10 ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు, అప్పుల కుప్పగా మార్చింది అని చెప్పడం కూడా నూటికి నూరు శాతం సమర్థించలేం. అప్పులు చేసి ఉండవచ్చు. అవినీతికి పాల్పడి ఉండవచ్చు. కానీ, ఎన్నో కొన్ని మంచి పనులు చేశారు అనే విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. గతంలో జరిగిన పొరపాట్లు సరిచేసుకుంటూ ముందుకు సాగాలే తప్ప, అసలేం చేయలేదనే వ్యాఖ్యలు మంచిది కాదనేది గమనించాలి.