బొజ్జ రాజశేఖర్ (సీనియర్ జర్నలిస్టు ): తెలంగాణాలో ‘‘వార్’’ వన్‌సైడ్‌గా కనిపించడం లేదు.? కొత్త పోకడలకు అసెంబ్లీ ఎన్నికలు-2023 తెరలేపాయి.? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ద్విముఖ పోటీనా..? త్రిముఖ పోటీనా? అనే మీమాంస కొనసాగుతోంది . బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు తామంటే తాము అధికారంలోకి వస్తామని పగటి కలలు కన్తున్నాయి?కానీ అధికారం ఎవ్వరికి దక్కుతుందని ఎవ్వరు చెప్పలేని సంకట పరిస్థితి తెలంగాణలో నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరు గెలు స్తారు..? ఎవ్వరు ప్రతిపక్షంలో నిలుస్తారు ? అనే విషయం డోలాయమానంలో పడింది.మరో పక్క..రాజకీయ పార్టీలు గెలుపు కోసం ఎత్తులు పై ఎత్తులు ? ఓటర్లను ఆకర్షించడానికి వేస్తున్న చిందులు ? ఓటర్ నాడీ బయట పడకుండ కట్టి వేశాయి. ఫలానా రాజకీయ పార్టీ అధి కారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులకు సైతం సవాల్‌గా నిలిచింది . తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ హ్యట్రిక్ విజయంకు అర్రులు చాస్తుంది..? పదేళ్ల ప్రతిపక్షంలో కూర్చున్న కాంగ్రెస్ గెలుపు బావుటకు దారులు వెతుకుతుంది. హమీల జల్లులు కురిపిస్తున్న అధికారం అందివస్తుందనే నమ్మకం కాంగ్రెస్‌కి లేదు.? బీజేపీకి దిగ్గజాలు దూరమయ్యారు. ఉన్నవారిని గెలిపించుకోవడానికి బహిరంగ సభలను నమ్ముకొని విజయం దక్కించుకోవాలని చూస్తుంది. మూడు పార్టీల గెలుపు ఓటములను షేక్ చేయాలని బీఎస్పీ భావిస్తోంది . తిన్నింటి వాసాలు లెక్కించాలా..? కొత్త తోఫాలను అందుకోవాలా అనే డోలయామానంలో ఓటర్లు బయటపడని స్థితికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
తెలంగాణాలో అంతుచిక్కని ప్రజానాడీ..
ఓటుకు పన్నెండు రోజుల వ్యవధి …
పవిత్ర స్నానానికి పుష్కర నది జలాలు ఎంత ముఖ్యమో…రాజకీయ పార్టీల భవిష్యత్తు నిర్ణయించడానికి పుష్కర రోజుల సమయం అంతే ముఖ్యంగా మారింది. ఎవరికి ఓటు వేసి గెలిపించాలనే సంకట స్థితిలో ఉన్న ఓటర్లు 12 రోజుల్లో జరిగే ఓటింగ్‌లో ఎవరికో ఒక్కరికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. ఎవరిని ఇంట్లో కూర్చోబెట్టాలనే నిర్ణయానికి ఇంకా రాలేదు. రాజకీయ పార్టీలు ప్రచారంతో ఓటర్లను గందరగోళానికి గురి చేస్తున్నారో.. ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారో అర్థం అయోమయ పరిస్థితి . మరో పక్క రాజకీయ పార్టీలు కురిపిస్తున్న వరాల జల్లులు ఓటర్లను మెప్పించలేక పోతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది . బీఆర్‌ఎస్ అందించిన ఫలాలు, గెలిపిస్తే అందిస్తామని చెబుతున్న కాంగ్రెస్.. తాయిలాలు, ఫలాలు కాదు కూర్చిలను అందిస్తామని చెపుతున్న బీజేపీ మాటలపై.. ప్రజలు ఒక్కతాటిపైకి రాలేకపోతున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో మనుగడ లో లేని సంక్షేమ పధకాలు బీఆర్‌ఎస్‌ను ఏ మేరకు గెలిపిస్తాయో వేచి చూడాలి మరి!
రెండిట పోటీ… మూడింట సమరం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యన కొనసాగుతుందా…? పోటీలో నిలిచిన మరో పార్టీ బీజేపీతో త్రిముఖ పోటీ కొనసాగుతుందా..? అనే సందేహాలు చాల మందిని వేధిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల పరిశీలినలో మాత్రం తెలంగాణలో ద్విముఖ పోటీ ఎన్నికలు జరుగుతున్నాయనే చెబుతున్నారు. తెలంగాణలోని 119 స్థానాల్లో పాత బస్తీలోని 10 నియోజకవర్గాలను తీసి వేస్తే.. రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉన్న నియోజకవర్గాల్లో 109 స్థానాల్లో పోటీ నెలకొంది. కాని తెలంగాణలో 25 స్థానాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీ మధ్య త్రిముఖపోరు జరుగుతుందని విశ్లేషకులు తేల్చారు. మరో 22 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు రెబల్ గుబులు భయపెడుతుందని చెపుతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో కూడ 20 నుంచి 25 మంది సిట్టింగ్‌లపై ఉన్న వ్యతిరేకత ఎవరికీ లాభం చేకూర్చుందో తెలియని పరిస్థితి. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొందని విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అధికార పార్టీ అనుకూల పవనాలు ఉన్నాయనే పరిశీలకుల అంచనా. బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉండే ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలో కూడ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే వార్ కొనసాగుతుందనే వాదనలు ఉన్నాయి. దీంతో తెలంగాణలో వార్ వన్ సైడ్ కొనసాగుతుందని చెప్పడానికి వీలులేని పరిస్థితి నెలకొంది.
గెలిచేదేవరు.. నిలిచేదేవరు…
తెలంగాణలో గెలుపేవరిది అంటే టక్కున చెప్పలేని పరిస్థితి. ఏ రాజకీయ పార్టీ వెంట ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు ఉన్నారు అంటే? మౌనమే సమాధానంగా గోచరిస్తోంది . పార్టీలకు ఉండే క్యాడర్ ఆ పార్టీకే మద్దతు ఇస్తున్నారా అంటే సమధానం చెప్పలేని పరిస్థితి . అభివృద్ది గెలిపిస్తుందని అధికార పార్టీ.. ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భావిస్తున్నాయి. తెలంగాణలో 18 శాతంగా ఉన్న ఎస్సీలు, ఐడు శాతంగా ఉన్న ఏస్టీలు, 51 శాతంగా ఉన్న బీసీలు, 14 శాతంగా ఉన్న మైనార్టీలు, 11 శాతంగా ఉన్న ఓసీలు, ఒక శాతంగా ఉన్న ఇతరులు రాబోయే పుష్కర రోజుల్లో ఏ పార్టికి పట్టం కడతారు అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న. కారణాలు ఏమైనా ఓటరు నాడి మాత్రం నిశబ్ధ విప్లవంలో కొట్టుమిట్డాడుతోంది . ఇదే ఉత్కంఠ ఎన్నికల చివరి నాటికి కొనసాగుతుందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఎవ్వరు గెలిచేది డిసెంబరు 3న తెలుసుకోవడం మినహా ఏమి చేయలేని పరిస్థితికి రాజకీయ పార్టీలే కారణమని భావించవచ్చు.
============================