APpolitics : స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ విషయం టీడీపీ పార్టీలో సరికొత్త చర్చకు తావిస్తోంది. గురువారం కేసుపై అటు చంద్రబాబు..ఇటు ఏసీబీ తరపు వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఆయన రిమాండ్ ను అక్టోబర్ 19 వరకు పొడిగించింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన మొదలైంది. మొదట చంద్రబాబును సెప్టెంబరు 9 న అరెస్ట్ చేసినప్పుడు.. షాక్ కి గురైనా.. ఆ పార్టీ నేతలు , కార్యకర్తలు..ఇది జగన్ రాజకీయ ప్రతీకార చర్య అనుకున్నారు. ఆయన త్వరలోనే బెయిల్ పై బయటకు వస్తారని భావించారు. తాజాగా బాబు రిమాండ్ పొడగించడంతో ఏం జరుగుతోందో అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. సాధారణ ఎన్నికలకు ఆరు నెలలే సమయం ఉండడంతో బాబు జైల్లో ఉన్నా.. నారా లోకేష్ ఉన్నారనే ధీమా మొదట్లో పార్టీ శ్రేణుల్లో కనిపించింది. అయితే లోకేష్ పై కూడా వివిధ కేసులు పెడుతుండడంతో అతన్ని సైతం అరెస్ట్ చేస్తారని ప్రచారంతో పార్టీకి దిక్కేవరనే భయం మొదలైంది.
కాగా సీఎం జగన్ ను అరెస్ట్ చేసినప్పుడు.. తల్లి విజయమ్మ చెల్లి షర్మిల పార్టీని ముందుండి నడిపించారు. ఇప్పుడు టీడీపీని నారా భువనేశ్వరి, బ్రాహ్మణి నడిపిస్తారని పార్టీ శ్రేణులకు..సీనియర్ నాయకులు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మే 23, 2012 న జగన్ ను సీబీఐ అరెస్ట్ చేసినప్పుడు వెంటనే జరిగిన ఉప ఎన్నికల్లో..జూన్ 15 , 2012 న వెలువడిన ఫలితాల్లో వైసీపీ 18 అసెంబ్లీ సీట్లకు గాను 15 ఎమ్మేల్యే సీట్లతో పాటు రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఉప ఎన్నికల్లో పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోవడంలో విజయమ్మ _ షర్మిల కీ రోల్ పోషించారు. అప్పుడు సాధారణ ఎన్నికలకు సమయం చాలా ఉండడంతో.. జగన్ లేకపోయినా తల్లి_ కూతురు పార్టీ నడిపిస్తారన్న నమ్మకం పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో ఏర్పడింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధారణ ఎన్నికలకు ఆరు నెలల సమయం మాత్రమే ఉండటం.. లోకేష్ ని సైతం అయితే అరెస్ట్ చేస్తే ఎంతవరకు భువనేశ్వరి_ బ్రాహ్మణి పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తారనే చర్చ తో పాటు భయాందోళన ఆ పార్టీలో మొదలైంది.దీనికి తోడు చంద్రబాబు రిమాండ్ పొడిగించే కొద్ది .. ప్రజల్లో సైతం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదో జరిగి ఉండకపోతే ఇన్ని రోజులు బాబు జైల్లో ఎందుకు ఉండాల్సి వస్తుందన్న ప్రశ్నలు ప్రజల నుంచి ఎదురవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. బాబును అరెస్టు చేసినప్పుడు ఆపార్టీ కార్యకర్తలు, నాయకులు.. అనేక రూపాల్లో నిరసనలను వ్యక్తం చేశారు.కానీ రోజులు గడుస్తున్న కొద్ది వారిలో కూడా ఆ కసి పట్టుదల తగ్గుతు వస్తోంది. ‘ఆలస్యం..అమృతం…. విషం ‘ నానుడి మాదిరి చంద్రబాబు బెయిల్ లేట్ అయ్యే కొద్ది పార్టీ శ్రేణుల్లో.. నేతల్లో నైరాశ్యంలో కూరుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది.