రాజకీయాలు రోజు రోజుకు పూర్తిగా రూపు మార్చుకుంటున్నాయి. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనే తీవ్రమైక కోరికతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలపై ఉచితాల వర్షం కురిపిస్తున్నాయి. ప్రజలు సైతం ఉచితాలకు అలవాటు పడి, ఏ పార్టీ ఎక్కువ ఉచితాలను ప్రకటిస్తే ఆ పార్టీకే పట్టం కట్టే పరిస్థితి దాపురించింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అమలును నిలదీసే ధైర్యం ప్రజలు లేకపోవడంతో అధికారంలోకి వచ్చిన పార్టీలు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారిపోతోంది. వాస్తవానికి ప్రభుత్వాలు సంక్షేమం, అభివృద్ధి పథకాలను జోడెద్దుల్లా ముందుకు తీసుకుపోతే రాష్ట్రాలతో పాటు దేశం సరైన దిశలో ముందుకు అడుగులు వేస్తుంది. కానీ, అభివృద్ధి మాట అటుంచి ప్రజలకు నేరుగా అందే సంక్షేమ పథకాల మీదనే ప్రభుత్వాలు ఫోకస్ చేయడం మున్ముందు తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది.
ఏపీలోనూ ఎన్నికల వేడి రగులుకుంటుంది. తాజాగా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా ఉచితాలతో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. నాలుగేళ్లుగా పథకాల అమలు కోసం అభివృద్ధిని పక్కన పెట్టడంతో విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని ఆరోపించాయి. చంద్రబాబు ఈ విషయంపై తీవ్ర విమర్శలు చేసేవారు. కానీ, మహానాడులో మొదటి విడత మేనిఫెస్టోలో ఆరు పథకాలను ప్రకటించారు. ఇవన్నీ ఉచిత పథకాలే. మరి వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ అమలు చేస్తున్న పథకాల వల్ల రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు పడితే… మరి చంద్రబాబు ప్రకటించిన పథకాల వల్ల సమస్యలు రావా ? అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉందంటే? ఒకటో తేదీన ఉద్యోగులకు జీతం ఇవ్వాలంటే ఆర్బీఐ దగ్గర అప్పు పుట్టించుకోవాల్సిన పరిస్థితి. ఒక్క జీతాలే కాదు ఏ పథకం ఇవ్వాల్సి వచ్చినా అదే. రాష్ట్రం ఎక్కడ ఆస్తులు తాకట్టు పెట్టగలిగేవి ఉంటే తాకట్టు పెట్టి తెచ్చుకునే అప్పులు తెచ్చారని టీడీపీ నేతలు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా మారదు. ఇప్పుడు పథకాలకే సరిపోని నిధులు.. అప్పుడు టీడీపీ పథకాలు అమలు చేయడానికి ఎలా సరిపోతాయన్నది ఇప్పుడు ప్రజలకూ వస్తున్న సందేహం.
కర్ణాటకలో జరిగిన తాజాగా ఎన్నికలను గమనిస్తే, అన్ని పార్టీలు గతంలో కనీవినీ ఎరుగని రీతిలో ఉచితాలను ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ఏదీ మినహాయింపు కాదు. అన్ని పార్టీలు కన్నడిగుల మీద వరాల జల్లు కురుపించాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ పెద్దకు నెలకు రూ.2వేలు, నిరుద్యోగ డిప్లొమా హోల్డర్‌కు రూ.1500, పట్టభద్రులకు నెలకు రూ.3వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామన్నారు. జేడీఎస్ తాము అధికారంలోకి వస్తే పేదలకు ఆరు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తామని, ఆటో డ్రైవర్లు, మహిళలు, సెక్యూరిటీ గార్డులు, రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఓటర్లకు ఉచిత హామీలు ఇవ్వడానికి తాము వ్యతిరేకం అని బీజేపీ గొప్పగా చెప్పుకునేది. ఏ రాష్ట్రంలోనూ పెద్దగా ఉచిత హామీలు ఇవ్వదు. ఏదైనా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అప్పటివరకు ఉన్న ఉచిత పథకాలకు నెమ్మదిగా కోత వేస్తుంది. ఉచిత హామీలు ఇచ్చే పార్టీలను కూడా వ్యతిరేకిస్తుంటుంది. అలాంటిది కర్ణాటకలో మాత్రం బీజేపీ రూటు మార్చింది. కర్ణాటక ఎన్నికల్లో ఉచిత హామీలు గుప్పించింది. మోదీ విధానాలకు వ్యతిరేకంగా ఈసారి బీజేపీ మేనిఫెస్టో రూపొందించింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, అలాగే రోజూ అర లీటరు నందిని పాలను అందిస్తామని చెప్పింది. ప్రతి వార్డులో అటల్ ఆహార్ కేంద్రం ఏర్పాటు, సీనియర్ సిటిజన్లకు ఉచిత వార్షిక మాస్టర్ హెల్త్ చెకప్, పేదలకు ఉచితంగా ఇండ్లు, రేషన్ షాపులలో బియ్యంతోపాటు ఉచితంగా ఐదు కేజీల చిరు ధాన్యాల పంపిణీ, పోటీ పరీక్షల కోసం యువతకు ఉచిత కోచింగ్ వంటి పథకాల్ని ప్రకటించింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఉచిత హామీల్ని ప్రకటించడంపై అందరూ ఆశ్చర్యపోయారు.
ఉచిత పథకాలకు తాను వ్యతిరేకం అని ప్రధాని మోదీ గతంలో ప్రకటించారు. ఉచిత పథకాలు ఇచ్చే పార్టీలను తీవ్రంగా వ్యతిరేకించారు. కష్టపడి పన్నులు చెల్లించే వారి సొమ్మును కొందరికి ఉచిత పథకాల రూపంలో అందజేయడం వల్ల వాళ్లంతా ఎంతో ఆవేదన చెందుతున్నారని మోదీ చెప్పారు. అందుకే తాము ఉచిత పథకాలు ఇవ్వకుండా అందరి సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నామని, దీంతో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని మోదీ అన్నారు. తాను ఉచిత పథకాల్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కానీ, ఇప్పుడు కర్ణాటక బీజేపీ నేతలు అంతకుమించి ఉచిత హామీలు ప్రకటించారు. దీంతో ఉచిత హామీల విషయంలో మోదీ మాటను కూడా కర్ణాటక బీజేపీ లెక్కచేయని పరిస్థితి నెలకొంది.
ఎవరు ఎన్ని హామీలు ఇచ్చినా, కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ విజయోత్సవాలు ముగియక ముందే జనాల నుంచి ఉచితాల అమలుపై తిరుగుబాటు మొదలయ్యింది. బస్సుల్లో టికెట్లు తీసుకోమని మహిళలు, కరెంటు బిల్లు కట్టమని ప్రజలు తేల్చి చెప్పారు. దీంతో కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి విధివిధాలను తీసుకొచ్చింది. ఎన్నికల ముందు అందరు మహిళలు అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల తర్వాత వందకు ఒకరో ఇద్దరో ఉచితంగా ప్రయాణించేలా నిబంధనలు పెట్టింది. ఈ నిర్ణయంపై జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ఎన్నికల సమయాల్లో పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలోనే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉచితాలు ఆందోళనకరమైన అంశంగా పరిగణించింది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అలాంటి హామీలను ఇవ్వకుండా ఉండేందుకు ఏదైనా పరిష్కారం కనుగొనాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఎలక్షన్ టైంలో అహేతుకమైన ఉచితాలను వాగ్దానం చేసే లేదా పంపిణీ చేసే పార్టీ గుర్తును స్వాధీనం చేసుకోవాలని లేదా ఆ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఉచితాలను నిరోధించే చర్యలపై ఓ వైఖరితో ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఉచితాలు, ఎన్నికల హామీలకు సంబంధించిన నిబంధనలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఉన్నాయని, ఉచితాలపై నిషేధం విధించే చట్టాన్ని ప్రభుత్వమే తీసుకురావాల్సి ఉంటుందని ఈసీ తరపున హాజరైన న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఉచితాల వర్షం గుప్పించి పతనమైన శ్రీలంక సంక్షోభం దిశగా మనం పయనిస్తున్నామని, మన ఆర్ధిక వ్యవస్ధ కూడా కుప్పకూలుతుందని ఈ అంశపై పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది అశ్వని ఉపాధ్యాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాలు కలిపి రూ . 70 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయని వివరించారు.
వాస్తవానికి ఉచితాల కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి దీన స్థితికి చేరిందనేది కాదనలేని సత్యం. వచ్చే ప్రభుత్వాలకు అప్పులు, తాకట్టు అనే ఆప్షన్ కూడా ఉండదు. కచ్చితంగా వచ్చే ప్రభుత్వం పథకాలు అమలు చేయాలంటే సంపద సృష్టించాలి. ఆదాయం పెంచుకోవాలి. ఆ సంపదనే ప్రజలకు పంచాలి. ఏ రాష్ట్రంలో అయినా ఆదాయం పెరగాలంటే వ్యాపార వ్యవహారాలు పెరగాలి. ఉదాహరణకు ప్రభుత్వం ఒక్క ఏడాదిలో రూ. లక్ష కోట్లు ఇన్ ఫ్రా మీద ఖర్చు పెడితే నేరుగా పన్నుల రూపంలో కనీసం నలభై శాతం అంటే నలభై వేల కోట్లు ప్రభుత్వానికే వస్తాయి. అంటే నికరంగా ప్రభుత్వం పెట్టే ఖర్చు అరవై వేల కోట్లే ఉంటుంది. అదే లక్ష కోట్లు బటన్ నొక్కి అకౌంట్లలో వేస్తే రూపాయి కూడా రాదు. ఒక వేళ ఆ డబ్బుతో లబ్దిదారులు మద్యంతాగితే అంత కంటే ఎక్కువే వస్తుంది. కానీ ఇలాంటి పథకం వల్ల అటు తీసుకున్న వారికి.. ఇటు ఖర్చు పెట్టుకున్న వారికీ అసంతృప్తే ఉంటుంది. *ఇప్పటికైనా ప్రజలకు అత్యవసరం అయిన ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించి, అభివృద్ధి మీద ఫోకస్ పెడితే మంచింది.* లేదంటే, మున్ముందు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
______________________
*శేఖర్ కంభంపాటి, జర్నలిస్ట్ నల్లగొండ*