ఎంజీఆర్‌ రికార్డును సమం చేయడం కేసీఆర్‌ కు సాధ్యమేనా ?

Nancharaiah merugumala senior journalist: 

దక్షిణాది రాష్ట్రాల్లో ఓ ప్రాంతీయపక్షం వరుసగా మూడు శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడం తమిళనాడులో 1970లు, 80ల్లో సాధ్యమైంది. తమిళ మొదటి సూపర్‌ స్టార్‌ ఎంజీ రామచంద్రన్‌ వరుసగా 1977, 1980, 1985 తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ఏఐఏడీఎంకేను విజయపథంలో నడిపించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మొదటిసారి కేంద్రం అసెంబ్లీని రద్దుచేయడం వల్ల, మూడోసారి మరణం వల్ల ఎంజీఆర్‌ మూడుసార్లూ పూర్తి పదవీకాలం సీఎం పదవిలో కొనసాగలేకపోయారు. ఇప్పుడు ఎంజీఆర్‌ బాటలోనే తెలంగాణ ప్రాంతీయపక్షం (టీఆరెస్‌ లేదా బీఆరెస్‌) అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారు ముచ్చటగా అదీ వరుసగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీకి తిరుగులేని గెలుపు సాధించే పనిలో నిమగ్నమయ్యారు. తెలంగాణ ప్రస్తుత రాజకీయ వాతావరణం, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటే ఆరు నెలల తర్వాత జరిగే అసెంబ్లీ పోరులో కేసీఆర్‌ గారి పార్టీ గెలుపు నల్లేరుపై బండి నడక అంతటి సునాయాసం అని చెప్పలేము గాని బీఆరెస్‌ విజయం తెలంగాణ మూడో అసెంబ్లీ ఎన్నికల్లో నూరు శాతం ఖాయమని చెప్పవచ్చేమో. తెలంగాణ ప్రజల్లో విశ్వసనీయత గాని, ఆమోదనీయత గాని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి లేదు. అనేక మంది కోమటి రెడ్లు, అనుభవమున్న రాజకీయ రెడ్లు (కె.జానారెడ్డి,ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి) ఇంకా పెద్దగా జనాకర్షణ శక్తి లేని సి. దామోదర్‌ రాజనరసింహ, మల్లు భట్టి విక్రమార్క వంటి సీనియర్‌ దళిత నేతలు, మున్నూరు కాపు పెద్దలైన బీసీ నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య వంటి వృద్ధ నేతలు.. ఎందరున్నా కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే డిసెంబర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కేలా కనిపించడం లేదు. టీడీపీ నుంచి వచ్చిన వెంటనే 2019 పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి లోక్‌ సభకు ఎన్నికైన ‘యువ నేత’ ఎ.రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యారు.

రేవంత్‌ రాకతో కాంగ్రెస్‌ పార్టీకి ‘ముదురు రెడ్డి’ రంగు అంటుకుంది!

పీసీసీ పదవి చేపట్టినప్పటి నుంచి ఆయన తన పెద్ద మామ దివంగత సూదిని జైపాల్‌ రెడ్డి గారి మాదిరిగా వినమ్రతతో మాట్లాడడం లేదు. లోపాయికారి రెడ్డి రాజకీయం చేయకుండా బహిరంగంగానే–రెడ్లు మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని ఎన్నికల్లో గెలిపించగలరనీ, వారికి మాత్రమే హైదరాబాద్‌ సచివాలయం నుంచి పరిపాలించే సత్తా ఉందని ఎడాపెడా ప్రకటనలు చేయడం వల్ల బడుగు, బలహీనవర్గాలకు పార్టీ దూరమౌతోంది. ఎప్పుడూ లేనిది–రెడ్లు మాత్రమే తెలంగాణ కాంగ్రెస్‌ లో ఓట్లు రాల్చగలిగే పోటుగాళ్లనే ప్రచారం వాస్తవానికి వ్యతిరేక ఫలితాలను ఇచ్చేలా కనిపిస్తోంది. ‘నిజంగా తెలంగాణ రెడ్లు అంత గొప్పోళ్లయితే… మరి 2018 డిసెంబర్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన కొద్ది మంది రెడ్లు సైతం కేసీఆర్‌ పిలిస్తే తోక ఊపుకుంటూ టీరెస్‌ లో చేరడం, ఎంతో కుటుంబ రాజకీయ నేపథ్యం ఉన్న పి.సబితా ఇంద్రారెడ్డి గారు సైతం వెనుకా ముందు చూడకుండా కేసీఆర్‌ కేబినెట్‌లో చేరిపోవడం ఏమిటి?’ అని సామాన్య ప్రజలు తెలంగాణ వీధుల్లో ప్రశ్నిస్తున్నారు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో చేయి గుర్తుపై గెలిచి… తర్వాత చాలా తెలివిగా తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం అనే సాకుతో.. కేసీఆర్‌ కుటుంబం త్యాగాలు, దాని గొప్పతనం, పాలనాదక్షత గుర్తించి టీఆరెస్‌ లో చేరడం వల్ల తెలంగాణ కాంగ్రెస్‌ రెడ్లపై, కాంగ్రెస్‌ లో కొనసాగుతున్న ఇతర వర్గాల నేతలపై ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. టోటల్‌ గా తెలంగాణలో కాంగ్రెసు బ్రాండు వాల్యూ మూసీ నది గర్భాన్ని తాకింది. కర్ణాటకలో 2006లో తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన లోహియావాది, జనతా పరివార్‌ నేత సిద్ధరామయ్య ఏడేళ్లకే 2013లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కగా లేనిది, రేవంత్‌ రెడ్డికి మాత్రం ఇది సాధ్యం కాదా? అని కొందరు ఆయన వర్గీయులు చేస్తున్న వాదన హేతుబద్ధంగా లేదు. 9 సంవత్సరాలుగా సీఎం పదవిలో ఉన్న కేసీఆర్‌ పాలనపై 18–40 ఏళ్ల లోపు జనంలో అసంతృప్తి ఉందని చెబుతున్నారు. అయితే, ఈ అసంతృప్తిని బీఆరెస్‌ పార్టీని ఓడించేస్థాయికి తీసుకునే పని జోలికే కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పోవడం లేదు. కాంగ్రెస్‌ అనే జాతీయ పార్టీని ఒక కుటుంబం నియంత్రిస్తున్న విధంగానే రాష్ట్రాల్లో సైతం ప్రాంతీయపక్షాలను కొన్ని కుటుంబాలే చెప్పుచేతల్లో పెట్టుకోవడాన్ని జనం ఆమోదిస్తున్నట్టే కనిపిస్తోంది. బళ్లారి తెలుగు కమ్మ కుటుంబంలో పుట్టిన ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు బృందం ఎంత చెమటోడ్చినా కాంగ్రెస్‌ పార్టీ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం కుదిరే పని కాదని హైదరాబాద్‌ రాజకీయ పండితులు, విశ్లేషకులు, పైరవీకారులు చెబుతున్నారు. హైదరాబాద్‌ లో చివరి తెలంగాణ రెడ్డి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు 1990 డిసెంబర్‌ చివరిలో పదవి నుంచి వైదొలిగారు. అప్పటి నంచి ఇప్పటి వరకూ అంటే ఈ 32 ఏళ్లలో తెలంగాణ రెడ్డి సీఎం గద్దెనెక్కలేదు. ఇది మరో పాతికేళ్లలో కూడా సాధ్యం కాదనిపిస్తోంది.

 

మూడో గెలుపుతో ఎన్టీఆర్‌ సాధించలేనిది కేసీఆర్‌ సొంతమవుతుంది!

ఈ లెక్కన కాంగ్రెస్‌ చెప్పే కేసీఆర్‌ కుటుంబ పాలన అనే మాటకు పదును లేకుండా పోయింది. తెలుగుదేశం స్థాపకుడు నందమూరి తారక రామారావు గారు సైతం ‘దుష్ట, దర్మార’్గ కాంగ్రెస్‌ పార్టీని వరుసగా రెండు ఎన్నికల్లో (1983, 85) మాత్రమే ఓడించగలిగారు. ఏడేళ్ల పాలన తర్వాత 1989 డిసెంబర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతిలో టీడీపీ ఓటమిని ఎన్టీఆర్‌ ఆపలేకపోయారు. అయితే, ఎన్టీఆర్‌ పార్టీలోనే నాలుగు వరుస విజయాలతో దాదాపు రెండు దశాబ్దాలు కొనసాగిన కేసీఆర్‌ త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల్లో వరుసగా మూడో విజయం సాధిస్తారనే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2023 డిసెంబర్‌ ఎన్నికల్లో కేసీఆర్‌ గెలిచి తెలుగునాట ఎన్టీఆర్‌ సాధించలేని రికార్డును సొంతం చేసుకునే వీలుంది. దక్షిణాదిన వరుస మూడు విజయాలతో ఎంజీఆర్‌ రికార్డును సమం చేయడం సిద్దిపేట పెద్ద పద్మనాయకుడికి సాధ్యమేననిపిస్తోంది.