సీఎం కేసీఆర్‌ త్వరలో ‘బ్రాహ్మణ బంధు’ ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు!

Nancharaiah merugumala senior journalist:( తెలంగాణ ‘విప్రహిత’ ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో ‘బ్రాహ్మణ బంధు’ ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు!)

తెలంగాణ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారు శుక్రవారం (2023 జూన్‌ 2) పదో ఏడాదిలోకి అడుగుబెడుతున్నారు. ఈ గొప్ప సందర్భానికి ముందు బుధవారం ఆయన హైదరాబాద్‌ గోపనపల్లిలో ఆరెకరాల విస్తీర్ణంలో నిర్మించిన ‘విప్రహిత’ బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించడం డిసెంబర్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన గొప్ప పుణ్యకార్యం. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ఆధ్వర్యంలో రూ.12 కోట్లతో నిర్మించిన ఈ విశాల భవనం దేశంలోని బ్రాహ్మణ సదనాల్లో అతి పెద్దది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరైన కేవీ రమణాచారి, మరో అడ్వయిజర్, విశ్రాంత ఐఏఎస్‌ రాజీవ్‌ శర్మ పాల్గొనడం తెలంగాణలో బ్రాహ్మణ సంక్షేమానికి ఉన్న ప్రాధాన్యం ఏమిటో చెబుతోంది. ఎక్కడో ఉత్తరప్రదేశ్‌ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిపెరిగిన రాజీవ్‌ శర్మ విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ సహా అనేక పదవుల్లో కొనసాగినా 2012–2014 మధ్య ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో యూపీఏ సర్కారు చేస్తున్న తంతు గురించి ఎప్పటికప్పుడు టీఆరెస్‌ నేత కేసీఆర్‌ చెవిన విషయాలు చేరవేసేవారనే ప్రచారం ఉంది. ఆంధ్రతో పోల్చితే తెలంగాణ ప్రాంతంలో అన్ని రకాల బ్రాహ్మణుల జనాభా బాగా తక్కువ. కాని, ఎన్నడూ తెలంగాణ సమాజంపై బ్రామ్మల ఆధిపత్యం కోస్తాంధ్రలో మాదిరిగా లేదు. నిజాం వంటి ముస్లిం సామంతరాజు పాలనలో ఉండడం వల్ల హైదరాబాద్‌ స్టేట్‌ లో బ్రామ్మలకు గౌరవమర్యాదలు కూడా కాస్త ఎక్కువే.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అవతరించాక కోస్తా, రాయలసీమ జిల్లాల నుంచి వైదిక, నియోగ, ద్రావిడ, శ్రీవైష్ణవ, శైవ తదితర బ్రాహ్మణులు తెలంగాణకు తరలి వచ్చి స్థిరపడే వరకూ స్థానిక బ్రాహ్మణుల్లో పెద్దగా శాఖా భేదాలు ఉండేవి కావని మాన్వవర మిత్రులు, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్‌ గారు కొన్నేళ్ల క్రితం తన ఆదివారం అనుబంధం కాలమ్‌ లో రాసినట్టు గుర్తు. మరో రకంగా చెప్పాలంటే అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్‌ సచివాలయంలో ఆంధ్రా, తెలంగాణ బ్రామ్మణ అధికారులు, ఉద్యోగుల మధ్య ప్రమోషన్లు, బదిలీల విషయంలో వచ్చిన తగాదాలు కూడా రాష్ట్ర విభజనకు దారితీసిన అనేకానేక కారణాల్లో ఒకటని ఆంధ్రా రాజకీయ పండితులు చెబుతారు.

ఆంధ్రాకు మెట్రోపాలిటన్‌ సిటీ ఎన్నటికీ రాజధాని కాకుండా పోవడానికి కారకులా?

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కూడా కాస్త ఎక్కువ వివేకం, తెలివితేటలు, జ్ఞానం ఉన్న తమిళ బ్రామ్మలకూ, కోస్తా జిల్లాల సాధారణ బ్రామ్మణ కాంగ్రెస్‌ నేతలు, అధికారుల మధ్య మొదలైన గొడవలే చివరికి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి దారితీశాయని కూడా అప్పటి పెద్దలు చెప్పేవారు. ఆంధ్ర రాష్ట్రానికి మహానగరం రాజధానిగా లేకుండా పోవడానికి కోస్తా జిల్లాల బ్రాహ్మణ పెద్దలే బలమైన పునాదులు 1940లు, 50ల్లో మద్రాసులోనే వేశారంటారు. ఏదేమైనా తెలంగాణ బ్రాహ్మణులతో పోల్చితే ఆంధ్రా బ్రామ్మలు కాస్త వ్యూహాత్మక మేధావులని ఉమ్మడి ఏపీ మాజీ రెవిన్యూ మంత్రి వీబీ రాజు (వల్లూరి బసవరాజు) వంటి ఆంధ్రా ‘సెటిలర్‌ బ్రామ్మణ’ నేతలను చూస్తే అర్ధమౌతుంది. ఏపీలో రాష్ట్ర కాంగ్రెస్‌ మంత్రివర్గాల బయట మర్రి చెన్నారెడ్డి గారు, లోపల వీబీ రాజు గారు ఉంటే ఆయా ప్రభుత్వాల సుస్థిరతకు ముప్పేనని కాంగ్రెస్‌ వర్గాలు అనుకునేవి. సరిహద్దు ఆంధ్రా జిల్లా అయిన గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్‌ నగరంలో స్థిరపడిన నియోగ బ్రామ్మణ నేత వీబీ రాజు 1957 అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలోని ఆసిఫ్‌ నగర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి వందేమాతరం (వావిలాల–తెలంగాణ వెలమ) రామచంద్రరావు గారిని ఓడించారంటే ఆంధ్రా బ్రామ్మణ నేతలు అప్పటికే ఎంతటి బుర్రన్నోళ్లో అర్ధంచేసుకోవచ్చు.

పీవీ ప్రధాని అయ్యాక శ్రీపాదరావుకు స్పీకర్‌ పదవి, ‘సింగాపురం దొర’కు ఎంపీ!

1991లో తెలంగాణకు చెందిన మాజీ బ్రాహ్మణ సీఎం పీవీ నరసింహారావు గారు ప్రధాని అయ్యాక ఆయన కులానికి చెందిన డి.శ్రీపాదరావు ఏపీ అసెంబ్లీ స్పీకరయ్యారు. అలాగే, పీవీతో రాజకీయ, ఆర్థిక సాన్నిహిత్యం ఉన్న ‘సింగాపురం దొర’ వొడితెల రాజేశ్వరరావు (ఈయనా తెలంగాణ బ్రామ్మణుడే) రాజ్యసభ సభ్యుడయ్యారు. మళ్లీ 2014లో తెలంగాణ వచ్చి కేసీఆర్‌ సీఎం పదవి చేపట్టాక సింగాపురం దొర తమ్ముడు కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు టీఆరెస్‌ తరఫున 2016లో రాజ్యసభ సభ్యుడయ్యారు. తర్వాత కెప్టెన్‌ కొడుకు వి.సతీష్‌ కుమార్‌ టీఆరెస్‌ టికెట్‌ పై కరీనంనగర్‌ జిల్లా నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన బ్రాహ్మణ కళాకారుడు దేశపతి శ్రీనివాస్‌ కు మొదట ప్రభుత్వ పదవి, మొన్నీమధ్య శాసనమండలి సభ్యత్వం లభించాయి. ఇలా అర్హులైన బ్రాహ్మణ ప్రముఖులందరికీ అధిక సంఖ్యలో కేసీఆర్‌ పదవులిచ్చారు. తెలంగాణ  కేబినెట్లో బ్రాహ్మణ సభ్యుడెవరూ లేరంటారుగాని ఆంధ్రప్రదేశ్‌ లో సైతం 2014 నుంచీ బ్రాహ్మణ నేత ఎవరూ మంత్రి కాలేదు. మొదటి నుంచీ కేసీఆర్‌ కు బ్రాహ్మణ పండితులంటే విపరీత గౌరవం అంటారు. ఆయన తన గురువు వి.మృత్యుంజయ శర్మగారికి అవకాశం చిక్కినప్పుడల్లా పాదాభివందనం చేయడం తెలంగాణ బ్రామ్మణులకు ఎంతో ఆనందదాయక దృశ్యం. కోస్తాంధ్ర జిల్లా కోనసీమలో మూలాలున్న ఉస్మానియా యూనిర్సిటీ మాజీ వైస్‌ చాన్సలర్‌ రావాడ సత్యనారాయణ గారు 1950లు, 60లో తెలంగాణ ప్రాంతానికి  జరిగిన అన్యాయం గురించి వివరించడమేగాక, తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా భావించే ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ గారిని కోనసీమ ద్రావిడ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన రావాడ సత్యనారాయణ గారు ప్రోత్సహించారని కూడా చెబుతారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బ్రామ్మణులకు కేసీఆర్‌ గారు నిజమైన హితుడు, శ్రేయోభిలాషి అనడం అతిశయోక్తి కాదు. ఐఐటీలు, ఐఐఎంలలో సీట్లు తెచ్చుకునే బ్రాహ్మల పిల్లలకు ఫీజు రీఇంబర్సుమెంటు ఇస్తానని గోపనపల్లిలో ఈరోజు ప్రకటించినæముఖ్యమంత్రి త్వరలో ‘ బ్రాహ్మణ బంధు’ పథకం రూపొందించి అమలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కూడా తెలంగాణ బ్రాహ్మణ ప్రజానీకం ఆశిస్తోంది.