Nancharaiah merugumala senior journalist:
‘రజాకార్లు’ అన్నందుకే హసీనాను బాంగ్లా యువకులు ఇండియా తరిమికొట్టారు..హైదరాబాదైనా ఢాకా అయినా రజాకార్ అనేది ఇప్పుడు బూతు మాటే!
1940ల చివర్లో నాటి హైదరాబాద్ స్టేట్‌లోని తెలంగాణ ప్రాంతంలో ‘రజాకార్లు’ అంటే నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనకు మద్దతుగా నిలిచిన కిరాయి ముస్లిం సాయుధ గూండాలు. వారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పనిచేశారు. నిజాం పోలీసులను, పాలనను నిరసించిన ముస్లింలను సైతం రజాకార్లు వదలలేదు. రజాకార్లను రక్కసి మూకలనే భావనతోనే కమ్యూనిస్టులు, ప్రజాస్వామికవాదులు చూశారు. ఉత్తర్ ప్రదేశ్ (లక్నో) నుంచి వచ్చి ప్రస్తుత మహారాష్ట్ర ప్రాంతం లాతూర్ మీదుగా హైదరాబాద్ వచ్చి స్థిరపడిన లాయర్ కాసిం రజ్వీ నాయకత్వంలో పనిచేసిన.. ఈనాడు భాషలో చెప్పాలంటే…గూండా తాండాలే రజాకార్లు. చివరి నిజాం కేంద్ర ప్రభుత్వానికి ఆత్మసమర్పణ చేసుకున్నాక కాసిం రజ్వీని భారత సర్కారు పాకిస్తాన్‌పోయి భద్రంగా బతికే అవకాశం ఇచ్చింది. తొలి ప్రధాని నెహ్రూ జీ ఈ నిజాం అనుకూల రజాకార్ నేతపై ఇంత కరుణ ఎందుకు చూపించారో మరి. పాకిస్తాన్‌కు వలసపోయిన రజ్వీ అనేక ఆంక్షల మధ్య ఇంటికే పరిమితమై చివరికి అప్పటి ఆ దేశ రాజధాని కరాచీలో కన్నుమూశారు. హైదరాబాద్ పాలకుడు నిజాం సర్కారుని నిలబెట్టడానికి నడుంకట్టిన కాసిం రజ్వీ ఆఖరుకు కరాచీలో దిక్కులేని చావు చావాల్సి వచ్చింది. రజ్వీ చనిపోయిన (1970 జులై 17) 54 ఏళ్లకు ఈ సొదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే….
మొన్న ముస్లిం మెజారిటీ భారత ఉపఖండ దేశం బాంగ్లాదేశ్‌లో ‘స్వాతంత్య్రసమరయోధుల’ వారసులకు సర్కారీ ఉజ్జోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన విద్యార్ధులు, యువకులను బాంగ్లా ప్రధాని షేక్ హసీనా ఆగ్రహంతో, చిన్నచూపుతో–‘రజాకార్లు’ అంటూ దూషించారు. తెలుగు ప్రాంతంలోనేగాక బంగ్లాదేశ్‌లో సైతం రజాకార్ అనే మాటకు మంచి ప్రాచుర్యం ఉంది. 1970–71 కాలంలో సమైక్య పాకిస్తాన్‌లో భాగమైన నాటి తూర్పు పాకిస్తాన్ లేదా తూర్పు బెంగాల్‌లో పాకిస్తాన్ (పశ్చిమ) సాయుధ దళాలకు తాబేదార్లుగా, కిరాయి సైనికులుగా పనిచేసిన నాటి ముస్లిం గూండా తాండాలను కూడా బాంగ్లా విమోచన కోరుకుని పోరాడిన బెంగాలీలు ‘రజాకార్లు’ అనే పిలిచేవారు. ఈ బాంగ్లా రాజాకార్లను నాటి పాకిస్తాన్ ఆర్మీ జనరల్ టిక్కా ఖాన్ చొరవతో తయారు చేశారు. ఈ హంతక దళం సాయంతోనే తూర్పు బెంగాల్లో లక్షలాది మంది ప్రజలను టిక్కా ఖాన్ ఊచకోత కోయించగలిగారు. అసలైతే రజాకార్ అంటే వలంటీర్ (స్వచ్ఛంద సేవకుడు) అని అర్ధం. ఇంతటి మంచి అర్ధం ఉన్న ‘రజాకార్’ అనేది ‘హంతకుడు’ అనే మాటకు పర్యాయపదంగా మారడం మహా విషాదం.
అందుకే, నిరసనకారులను ప్రధాని హసీనా ఈ చెడ్డ తిట్టుపదం ‘రజాకార్లు’ అని వర్ణించాక ప్రభుత్వ వ్యతిరేక పోరాటం మరింత ఉధృతమైంది. యువకులు, విద్యార్ధులకు రజాకార్ అనే మాట బాకులా వచ్చి వారి గుండెల్లో గుచ్చుకుంది. చివరికి బాంగ్లాదేశ్ స్థాపకుడుగా పరిగణించే దివంగత ప్రధాని షేక్ ముజిబుర్ రెహ్మాన్ కూతురు హసీనా ఢాకాలోని తన అధికార నివాసం వదిలి ఇండియాకు పారిపోయే వరకూ ఈ ‘రజాకార్లే’ తరిమి తరిమి కొట్టారు. రజాకార్ అనే మాటకు ఇంత ఘనమైన నేపథ్యం ఉండబట్టే ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ తమ పార్టీని రజాకార్ల వారసుల పార్టీ అంటే అంగీకరించరు. కాసిం రజ్వీ నాయకత్వంలోని పార్టీతో, రజాకార్లతో తమకు ఏమాత్రం సంబంధం లేదని మజ్లిస్ పార్టీ ఓనర్లయిన ఒవైసీ సోదరులు పదే పదే చెబుతుంటారు.
(ఈరోజు ఇంగ్లిష్ డైలీ ‘ద హిందూ’లో షేక్ హసీనా పతనంపై స్టాన్లీ జానీ రాసిన విశ్లేషణలోని ఒక వాక్యం ఆధారంగా)
ఫోటోలు: 1) బాంగ్లా విమోచన కోసం పోరాడిన వారి అణచివేతకు పనిచేసిన 1971 నాటి బాంగ్లా రజాకార్ ID కార్డు
2) తండ్రి, ‘ బంగ బంధు ‘ షేక్ ముజిబుర్ రెహ్మాన్ తో యువ హసీనా