Modi: ‘ప్రధానిగా మోదీ అవతరణ’ పై ఒవైసీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Nancharaiah merugumala senior journalist:

వాజపేయి, ఆడ్వాణీలు ‘ప్రధానిగా మోదీ అవతరణ’కు అనువైన వాతావరణం సృష్టించారన్న అసదుద్దీన్‌ ఒవైసీ మాటల్లో నిజం ఉందేమో..!

‘‘ జర్మనీలో యూదు వ్యతిరేకతను ఫ్యూరర్‌ అడాల్ఫ్‌ హిట్లర్‌ కొత్తగా సృష్టించలేదు. అప్పటికే జర్మన్‌ సమాజంలో యూదులంటే ద్వేషం ఉంది. అలాగే, ఇండియాలోనూ చాప కింద నీరులా ఇలాంటి భావనలే (ముస్లింలంటే వ్యతిరేకత లేదా ద్వేషం అనే అర్ధంలో) జనంలో ఉన్నాయి. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయిని మనం ఉదారవాది (లిబరల్‌) అని పిలుస్తాం. నమ్ముతాం. అసలు వాస్తవం ఏమంటే…అప్పట్లో వాజపేయి, ఎల్‌.కె.ఆడ్వాణీలు దేశంలో ‘ఈ పెద్ద మనిషి రాకకు’ (నరేంద్రమోదీ ప్రధానిగా అవతరించడానికి) అనువైన వాతావరణం సృష్టించారు,’’ అని మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ దిల్లీలో ముస్లింలకు సంబంధించిన పుస్తకావిష్కరణ సందర్భంగా అన్నారు. విద్యావేత్త ముజిబుర్‌ రెహమాన్‌ రాసిన ‘షిక్వా–ఏ–హింద్‌: ద పొలిటికల్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ముస్లిమ్స్‌’ అనే గ్రంథాన్ని మంగళవారం విడుదల చేశారు. అయితే, కాంగ్రెస్‌ అగ్ర నాయకులు సోనియా, రాహుల్‌ గాంధీ సహా అనేక మంది సీనియర్‌ కాంగ్రెస్‌ (ముఖ్యంగా బ్రాహ్మణ నేతలు) వాజపేయిని గొప్ప ప్రజాస్వామ్యవాదిగా, లిబరల్‌గా వర్ణిస్తూ ఆకాశానికెత్తి›మాట్లాడడమేగాక తమ పూజనీయ నేత జవాహర్లాల్‌ నెహ్రూ లక్షణాలున్న మహానేతగా బీజేపీ తొలి ప్రధాని అటల్‌ జీని ప్రశంసిస్తారు. దేశంలో మతపరమైన ఉద్రిక్తతలకు సోమనాథ్‌ నుంచి అయోధ్యకు రథయాత్ర చేద్దామనుకున్న సింధీ హిందూ నేత అడ్వాణీయే కారకుడని, వాజపేయి మాత్రం చెడ్డ పార్టీలో (బీజేపీ) ఉన్న మహా మంచోడని సాంప్రదాయ, సనాతన బ్రాహ్మణ కాంగ్రెస్‌ వాదులు చాలా మంది బాహాటంగానే చెబుతుంటారు. అంతేగాని, ఆరెసెస్‌ నేత కేఎన్‌ గోవిందాచార్య ఎప్పుడో చక్కగా చెప్పినట్టు ఏబీ వాజపేయి ‘లిబరల్‌ ముసుగు ధరించిన మనిషి’ (ముఖోటా) అనే నిజం కాంగ్రెసోళ్లు గుర్తించరు. ఇప్పుడు అసద్‌ భాయ్‌ చెప్పిన తర్వాతైనా వాజపేయిపై కాంగ్రెస్‌ నేతలు, లిబరల్‌ మేధావులు తమ అభిప్రాయాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం లేదా?