ఉత్కంఠగా సాగిన హుజూరాబాద్ ఎన్నికల ప్రక్రియలో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఉప ఎన్నిక పోలింగ్ మొత్తం ముగిశాక..వీవీప్యాడ్‌ల తరలింపులో అధికారులు…నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.
కాగా స్ట్రాంగ్ రూమ్‌లకు వెళ్లాల్సిన వీవీ ప్యాట్లు బయటకు ఎలా వచ్చాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. కేవలం డబ్బు ఉన్నవాళ్లే రాజకీయం చేసే పరిస్థితులు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో వీవీ ప్యాట్ల తరలింపుపై.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్కు పార్టీ నేతలు డీకే అరుణ, రాజా సింగ్, రామచందర్ రావు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. వీవీ ప్యాట్ల తరలింపుపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.
హుజూరాబాద్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా అధికార పార్టీ వ్యవహరించిందని బీజేపీ పార్టీ హుజూరాబాద్ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. తనను ఓడించేందుకు అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తుందన్నారు. పోలింగ్ బాక్స్‌ల తరలింపుపై ఈటల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఘటనపై CBI విచారణ జరగాలని ఈటల డిమాండ్ చేశారు.
మరోవైపు వీవీ ప్యాట్ల ఘటనపై ఎన్నికల అధికారి స్పందించారు. దీనిపై వివరణ ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్, హుజూరాబాద్ ఆర్వోకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నాటికి నివేదిక ఇవ్వాలన్నారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీఈవో.. ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఈ మేరకు ఆదేశించారు. మరోవైపు అన్ని రాజకీయ పార్టీల నేతలతో శశాంక్ గోయల్ నేడు సమావేశం కానున్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ 2022 ప్రక్రియపై సమావేశంలో చర్చించనున్నారు.
అయితే నిబంధనలకు అనుకరించే వ్యవహరిచామని హుజూరాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్ రవీందర్. మాక్ పోలింగ్ లో ఒక వీవీ ప్యాడ్ పని చేయలేదని గుర్తించామన్నారు. ఆ వీవీప్యాట్ నే అధికారిక వాహనంలో స్ట్రాంగ్ రూమ్ కు తరలించామన్నారు. మరో వాహనంలోకి వీవీప్యాట్ తరలించే క్రమంలో అనుమానాలు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వానికి సంబంధించిన డ్రైవర్ ద్వారానే వీవీప్యాట్ తరలించామని చెప్పుకొచ్చారు రిటర్నింగ్ ఆఫీసర్ రవీందర్.