హుజురాబాద్ లో ప్రారంభమైన ఉప ఎన్నిక పోలింగ్..

హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమ‌య్యింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అవాంత‌రాలు ఏర్ప‌డుకుండా ఓటింగ్ ప్ర‌క్రియ స‌జావుగా జ‌రుగుతున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభ‌మైన‌ హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌ రాత్రి 7 గంటల వరకూ కొన‌సాగ‌నుంది. ఇక ఈ ఉప ఎన్నిక‌ల్లో ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డానికి హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో మెుత్తం 2 ల‌క్ష‌ల 37 వేల 22 మంది ఓటర్లున్నారు. అందులో పురుష‌ ఓటర్లు ఒక ల‌క్షా, 18 వేల‌, 7 వంద‌ల, 20 మంది ఉండ‌గా… మహిళా ఓటర్లు ఒక ల‌క్షా, 17 వేల, 5 వంద‌ల‌, 63 మంది ఉన్నారు. ఇక, హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 5 మండలాల్లో పోలింగ్ జ‌రుగుతోంది. హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, కమలాపూర్‌ మండలాల్లో ఉప ఎన్నిక‌కు పోలింగ్ నిర్వ‌హిస్తున్నారు. హుజూరాబాద్ పరిధిలో మెుత్తం 106 పంచాయతీల్లో…. నియోజకవర్గంలోని 306 కేంద్రాల్లో పోలింగ్ కొన‌సాగుతోంది. ఇక ఈ ఉపఎన్నిక బరిలో 30 మంది అభ్యర్థులు పోటీ ప‌డుతున్నారు. నవంబరు 2న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు నిర్వ‌హిస్తారు.

పోలింగ్ కేంద్రానికి ఈటెల‌:
హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ బూత్ ను బిజెపి అభ్య‌ర్థి ఈటల రాజేందర్ ఉద‌యం సందర్శించారు.
ఉద‌యం ఓటింగ్‌ ప్రారంభం అయిన కొన్ని నిమిషాల‌కే పోలింగ్‌ బూత్ చేరుకున్నఈటెల అక్క‌డ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు అందరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ సిబ్బందిని ప‌ల‌కిరించిన ఆయ‌న ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీసారు.

Optimized by Optimole