DonaldTrump: ట్రంప్‌–వాన్స్‌ జోడీ గెలిస్తే ‘సెకండ్‌ లేడీ’ తెలుగు మహిళ ఉషా చిలుకూరే!

Nancharaiah merugumala senior journalist:

నవంబర్‌ 5 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ ట్రంప్‌–వాన్స్‌ జోడీ గెలిస్తే అగ్రరాజ్యం ‘సెకండ్‌ లేడీ’ అయ్యేది మన తెలుగు మహిళ ఉషా చిలుకూరే!

ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా దేవి హ్యారిస్‌ సగం భారత సంతతి మహిళ అనే విషయం తెలుసు. ఆమె తల్లి తమిళనాడు నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన హిందూ బ్రాహ్మణ డాక్టర్‌ శ్యామలా గోపాలన్‌ అని, తండ్రి జమైకా నుంచి వచ్చి అగ్రరాజ్యాన్ని సొంతూరుగా మార్చుకున్న నల్లజాతి క్రైస్తవుడని (డొనాల్డ్‌ జే హ్యారిస్‌) కూడా మూడు నాలుగేళ్ల క్రితమే చదువుకున్నాం. డెమొక్రాటిక్‌ అధ్యక్షుడు జెసెఫ్‌ బైడన్‌ ఇప్పుడు పోటీ నుంచి తప్పుకుండే 2024 నవంబర్‌ 5 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా దేవి పార్టీ అభ్యర్ధి అయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు ఇంకా సాగుతున్నాయి. వచ్చే నవంబర్‌ 20న 82 ఏళ్లు నిండే జో బైడన్‌ మతి మరుపు, ఇతర వెల్లడికాని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కారణంగా కమలకు అధ్యక్ష పదవికి పోటీచేసే అవకాశం ఉందని ప్రచారం ఇంకా జరుగుతూనే ఉంది. ఆమె సెనెటర్‌ కాక ముందు అత్యంత ధనిక రాష్ట్రం, జనాభా ఉన్న పశ్చిమ రాష్ట్రంలో ప్రసిద్ధ లాయర్‌గా పనిచేసిన విషయం కూడా తెలిసినదే. ఇదంతా ఎందుకు? అంటే, ఇప్పుడు పూర్తి భారత (తెలుగు, తెలంగాణ?) మూలాలున్న మరో లాయర్‌ మహిళ ఉషా చిలుకూరి వాన్స్‌ సోమవారం రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ ప్రెజ్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ రనింగ్‌ మేట్‌ (ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థి), ప్రస్తుత ఒహాయో సెనేటర్‌ జే.డీ.వాన్స్‌ భార్య అని కొన్ని గంటల క్రితం వచ్చిన వార్త మరోసారి భారత ప్రజలకు ఆనందాన్నిచ్చింది.

( ఫోటోలు: 1. ట్రాంప్ రనింగ్ మేట్ గా నామినేట్ అయ్యాక్ అభిమానుల మధ్య జేడీ వాన్స్ 2. ఉష భర్త జేడీ వాన్స్ తో డొనాల్డ్ ట్రాంప్, బిడ్డతో భార్యాభర్తలు, 3. ఉషా చిలుకూరి, జేమ్స్ వాన్స్)

రిపబ్లికన్‌ పార్టీ టికెట్‌ ట్రంప్‌–వాన్స్‌ జోడీకి సోమవారం లభించింది. 2020లో 78 ఏళ్ల బైడన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక, మధ్యలో కన్నుమూస్తే ‘మన కమలమ్మే కదా ప్రెసిడెంటయ్యేది,’ అని తమిళులు సహా ఇండియన్లు అనేకులు ఆశపడ్డారు. అదృష్టవశాత్తూ అలా జరగలేదనుకోండి! ఈ ఏడాది అమెరికా అధ్యక్ష పదవికి జరిగే 60వ ఎన్నికల్లో 78 సంవత్సరాల (జూన్‌ 14న ఏడు పదుల ఎనిమిదేళ్లు నిండాయి) ట్రంప్‌ గెలిస్తే 39 ఏళ్ల ఆయన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ భార్యగా మన ఉషా చిలుకూరి అగ్రరాజ్యం అమెరికాలో ‘సెకండ్‌ లేడీ’ అవుతుందని భారతీయులతోపాటు తెలుగు జనం అనుకుంటున్నారు. అమెరికాలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయం యేల్‌ యూనివర్సిటీలో లా (అక్కడ కోర్సును జేడీ అంటారు) చదువుతుండగా ఆమెకు కాబోయే భర్త, రోమన్‌ క్యాథలిక్‌ క్సైస్తవుడైన వాన్స్‌తో పరిచయమైంది. 2014లో కెంటకీ స్టేట్‌లో మతాతీత పద్ధతిలో (ఇంటర్‌ఫెయిత్‌) ఉషా, జేడీ వాన్స్‌కు పెళ్లయింది. వారి ముగ్గురు పిల్లల పేర్లలో (ఇవాన్, వివేక్, మీరాబెల్‌) ఒకరికి పూర్తిగా భారతీయ నామం ఉండడం విశేషం. ఉషా తల్లిదండ్రులు ఇండియా నుంచి అమెరికా వలసవచ్చినవారని అమెరికా మీడియా కథనాల్లో చెప్పారుగాని ఏ రాష్ట్రం వారో ప్రస్తావించలేదు. ఉష ఇంటి పేరు చిలుకూరిని బట్టి ఆమె తెలుగు కుటుంబం నంచి వచ్చి ఉంటుందని, ఇంకా ముందుకు పోతో బహుశా తెలంగాణ ప్రాంతవారు ఆమె తల్లిదండ్రులు అయి ఉండొచ్చని అంచనా. ఏదేమైనా 2024 శీతాకాల అమెరికా ఎన్నికల్లో భారతీయులు ఎక్కువగా ఇష్టపడని 78 సంవత్సరాల ట్రంప్‌–39 ఏళ్ల వాన్స్‌ జోడీ గెలిస్తే తెలుగు మహిళగా పరిగణించే ఉషా చిలుకూరిని తెలుగు మీడియా ‘‘మన ఆడపడుచే’ అనే పొంగిపోతూ వార్తలు ప్రసారం చేసే రోజులు ఎంతో దూరంలో లేవు. ఉషా చిలుకూరి తెలుగురాష్ట్రాల్లో దేని నుంచో వచ్చారో తెలిశాక, ఆమె తల్లిదండ్రులది ఏ ఊరు, ఏ సామాజికవర్గం వంటి వివరాల కోసం జరిగే అన్వేషణతో గూగుల్‌ వేడెక్కిపోవడం ఖాయం. లిబరల్‌ రిపబ్లికన్‌గా పేరున్న ఉష భర్త జేమ్స్‌ డేవిడ్‌ వాన్స్‌ (పుట్టినప్పటి పేరు జేమ్స్‌ డొనాల్డ్‌ బౌమన్‌) నిన్నమొన్నటి వరకూ తానెన్నటికీ ట్రంప్‌ భజనపరుడిని కాలేనని చెప్పినాగాని జులై 15 పార్టీ సమావేశంలో తన రనింగ్‌ మేట్‌గా (ఉపాధ్యక్ష పదవికి అభ్యర్ధి, అక్కడ ఉపాధ్యక్ష పదవికి ప్రత్యేకంగా విడిగా ఎన్నిక ఉండదు) ఉండాలని డొనాల్డ్‌ ట్రంప్‌ కోరగానే అంగీకరించాడు. అలా ‘తెలుగు మహిళ’ ఉషా చిలుకూరి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కే అవకాశం వచ్చింది. గతంలో ట్రంప్‌ను జర్మనీ నియంత హిట్లర్‌తో పోల్చిన జేడీ వాన్స్‌ ఇప్పుడు తన అభిప్రాయం మార్చుకోవడం 11 కోట్ల తెలుగువారికి మేలయింది. నాలుగేళ్ల క్రితం ట్రంప్‌ను వాన్స్‌ తిట్టినన్ని తిట్టు బహుశా ఇంకెవరూ తిట్టకపోవడం విశేషం.