Telangana:
‘విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది’ అంటాడు శివసాగర్! వేల సంవత్సరాలు దేశీ విత్తనాలు మన వ్యవసాయాన్ని పరిపుష్టం చేస్తూ ఆహార భద్రతకు, ఆరోగ్య సంరక్షణకు భరోసా ఇచ్చాయి. రైతు నిశ్చింతగా, వ్యవసాయం అదుపాజ్ఞల్లో, నేలసారం సురక్షితంగా, వాతావరణం సమతుల్యతతో, ప్రకృతి పరిశుద్ధంగా ఉన్నాయి. అధిక దిగుబడి కోసం వచ్చిన ‘హరిత విప్లవం’ గొడుగు కింద ముందు, వెనుకలాలోచించకుండా చేసిన కొన్ని చర్యలవల్ల పర్యవసానాలు వికటించాయి. పంట దిగుబడి అసాధారణంగా పెరిగి అప్పటి అవసరాల మేర ఆహార భద్రత కల్పించిన మాట వాస్తవమే! కానీ, కాలక్రమంలో అది ‘విత్తన సంకరానికి, వ్యవసాయ రసాయనీకరణ’కు దారితీసింది. సమీకరణాలన్నీ మారాయి. దిగుబడి కోసం ఏయేటికాయేడు విష రసాయనాల వాడకం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. పంటలనాశించే చీడల నివారణ -నిర్మూలనకు పురుగుమందుల వాడకం హెచ్చింది. మట్టిసారం క్షీణించడం, తినే ఆహారంలో రసాయన అవశేషాలు పెచ్చుమీరడం కలిసి నేల, మనుషుల ఆరోగ్యాన్ని ధ్వంసం చేశాయి. ఇవాళ దేశీ విత్తనాల్ని కాపాడుకోవాల్సిన అవసరం, ప్రకృతి వ్యవసాయాన్ని పాటించాల్సిన అగత్యం బలపడింది.
విత్తనం సంకరం కావడం ఒక ఎత్తయితే రైతు చేతుల్లోంచి జారిపోయి అది కంపెనీలు – కార్పొరేట్ల వశం కావడం మరో ఎత్తు! పంటకు మూలాధారమైన విత్తనం తన చేతిలో లేకపోయే సరికి వ్యవసాయం చేసే రైతు చేతులు నరికేసినట్టయింది. ఒకప్పుడు రైతే తన విత్తనాల్ని తన పంటనుంచి తానే గుర్తించి, సేకరించి, భద్రపరచి, ఉపయోగించేవాడు. వేర్వేరు పంటలకు సంబంధించిన విత్తనాల్ని రైతులే పరస్పరం పంచుకునే వారు. ఒకరి దగ్గరుంటే మరొకరు, ఒక పంట విత్తనానికి మరో పంట విత్తనం ఇలా పరస్పరం ఇచ్చిపుచ్చుకునే వారు. పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. రసాయనాలు, పెస్టిసైడ్స్ లాంటి మిగతా పెట్టుబడి సరుకుల్లాగే విత్తనాన్ని కూడా ఏయేటికాయేడు మార్కెట్ నుంచి కొనుగోలు చేసి వ్యవసాయం చేయాల్సిరావటం రైతుకొక శాపంగా పరిణమించింది. పరిశోధనలు జరిపి, చీడల్ని, వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోగల వంగడాల్ని సృష్టిస్తున్నామని ‘టర్మినేటెడ్ సీడ్స్’ ఇస్తుండటం వల్ల ప్రతిసారీ కొత్తవే కొనాల్సిన దుస్థితి రైతుకు దాపురిస్తోంది. కంపెనీల విత్తనాలు కొని తానెంత గొప్పగా పంట పండించినా, తన చేలో పండిన గింజలు (జన్యు – రసాయన పూర్వ ప్రక్రియ వల్ల) విత్తనాలుగా పనికిరాని పరిస్థితి. చట్టాల నియంత్రణ, ప్రభుత్వాల అదుపాజ్ఞలు లేని విధంగా కంపెనీలు విత్తనాల ధరల్ని ఎప్పటికప్పుడు పెంచుతూ ఉండటం రైతుకొక భారంగా పరిణమిస్తోంది. పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి కొనుగోలు చేసే విత్తనాలు మొలకెత్తుతాయో? లేదో? తెలియదు! మొలకెత్తినా దిగుబడి గ్యారెంటీ లేదు. ఒకోసారి మొత్తం దిగుబడి గల్లంతయి, పంట ఒట్టిపోయినా, అది విత్తన కారణంగానే అయినప్పటికీ… అందువల్లే అనేది రుజువు చేయలేని పరిస్థితి! ఈ విత్తనాలకు, విరివిగా వాడాల్సిన రసాయన ఎరువులకు, తప్పనిసరి అయ్యే పెస్టిసైడ్స్ వాడకానికీ ఒక లంకె ఉంది. అది రైతును ఒక విషవలయంలోకి లాక్కువెళ్లింది. ఇప్పుడు బయటపడలేని దుస్థితి! ఏమన్నా అంటే, ‘సంప్రదాయ సాగు, ప్రకృతి వ్యవసాయంతో దిగుబడి రాదు, లాభసాటి కాదు’ అని నిరుత్సాహపరుస్తారు. కొంత మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాల బోధకులు, వ్యవసాయాధికారులు, రాజకీయ నాయకులు కూడా ఇదే వరుసలో మాట్లాడుతూ రైతుల్ని అయోమయానికి గురిచేస్తుంటారు. కొన్నిసార్లు తెలిసి, మరికొన్నిసార్లు తెలియక కార్పొరేట్ శక్తులకు దన్నుగా వారు వ్యవహరిస్తున్నారు.
విత్తన ప్రాధాన్యత గుర్తించాలి
‘విత్తనం జీవన సౌధం’ అంటాడు కత్తిపద్మారావు. గోండ్వానా నాగరికత అందించిన ‘నవధాన్య సంస్కృతి’ మనది. ఇప్పటికీ ఆ సంప్రదాయానికి మనం విలువ ఇస్తున్నాం కాబట్టే సంక్రాంతి పండుగ రోజు వాకిట నిలిపే గొబ్బెమ్మల పక్కన, పిడుకలపై పాలు పొంగించే చోట, ఇంటిపై కప్పు మీద నవధాన్య పంటలకు సంబంధించిన ధాన్యపు కంకుల్ని, కర్రల్ని, కొమ్మల్ని, రెమ్మల్ని వేసి పూజిస్తుంటారు. క్రతువుల్లో నవధాన్యపు గింజల్ని హోమంలో వేసి ఆ పొగ ఇల్లంతా అలుముకోవాలని, అది ఆరోగ్యానికి హేతువని నమ్ముతారు. విత్తనం ఏ రూపంలోదయినా… సృష్టి పుట్టుక నుంచి జీవుల మనుగడ, విస్తరణ, ఎదుగుదల, అనునవంశికతలో విత్తే మూలాధారమై ఎడతెగని లంకెతో విలక్షణ పాత్ర పోషిస్తోంది. విత్తనం పంటకు మూలం, రైతుకు ఆధారం, వ్యవసాయానికి ఆదెరువు, మన ఆహార వ్యవస్థకు దాతువు, ఆరోగ్యానికి హేతువు, సమస్త జీవజాతుల మనుగడ- ప్రగతికి కారణభూతమైన శుభారంభం! శతాబ్దాల తరబడి పంట విత్తనం రైతు చేతుల్లో, కనుసన్నల్లో, నియంత్రణలోనే ఉంది. పాతిక, ముఫ్పై సంవత్సరాల కిందటి వరకు కూడా దాదాపు అన్ని పంటల విత్తనాల్ని రైతులే తమ పంటలోంచి గుర్తించి, సేకరించి, దాచుకొని, వాడుకొనే వారు. వరి, జొన్న, కుసుమ, వేరుశనగ, వివిధ పప్పు ధాన్యపు విత్తనాలను భద్రపరచడం స్వయంగా నేను, మా ఇంట్లో చూశాను. పంట ఏపుగా ఎదిగి, రోగం లేకుండా ఉండే చేనును చూసి రైతు ‘ఇది బాగా పెరిగింది, దీన్ని విత్తనానికి ఉంచుదాం’ అని ముందే నిర్ణయించుకొని ప్రత్యేకంగా నూర్పిళ్లు జరిపేది. బాగా ఎండబెట్టి, బూడిదతో ప్రాసెస్ చేసి, పురుగు ఆశించకుండా గట్టి మూకుళ్లతో గోళాలు, కాగులు, పెద్ద పెద్ద కడవల్లో భద్రపరిచేది. సాగు సమయానికి తీసి వాడేది. తాము విత్తిన తర్వాత మిగిలే విత్తనాలను ఇతర చిన్న రైతులకు చేబదులుగా ఇచ్చేది. తదుపరి పంట పండిన తర్వాత అవతలి వారు తాము తీసుకువెళ్లిన విత్తనాలకు సరిసమానంగానో, మహా అంటే రెండింతలో తిరిగి ఇచ్చే ఒక గొప్ప సంస్కతి తెలుగునాట ఇటీవలి కాలం వరకూ పరిఢవిల్లింది. ఇప్పుడది మచ్చుకు కూడా లేదు. కార్పొరేట్ విత్తన మాయ ఈ సంస్కృతిని కమ్మేసి కొన్ని యేళ్లవుతోంది.
ప్రకృతి వ్యవసాయమొక పరిష్కారం
సంకర విత్తనాలు కాకుండా దేశీయ విత్తనాలే వాతావరణ పరిస్థితుల్ని సమగ్రంగా ఎదుర్కోగలుగుతాయి. అవి నేల సారాన్ని కూడా సంరక్షిస్తూ ఎదుగుతాయి. అందుకు కారణం, అవి సహజమైనవి కావడం వల్ల కార్బనీకరణ, నత్రజనీకరణ వంటి ప్రక్రియలు నేలలో సహజంగా జరిగిపోయే సానుకూల వాతావరణం ఉంటుంది. జన్యుమార్పిడి విత్తన పంటల సాగువల్ల 70 నుంచి 80 శాతం జీవవైవిధ్యం నాశనమైంది. రసాయన ఎరువులు, విష రసాయన పెస్టిసైడ్ల వల్ల ముఖ్యంగా నేలలోని వేల కోట్ల సూక్ష్మజీవులు (మైక్రోబ్స్) నాశనమయ్యాయి. నేలకు రక్షణగా, పంటలకు అనుకూలంగా, పంటల్ని వేధించే సహజ చీడలకు విరుగుడుగా ఉండే మైక్రోబ్స్ సంహారం వల్ల పంటలకు సహజరక్షణ వ్యవస్థ లేకుండా పోయింది. నేల సారహీనమైంది. దాంతో అనివార్యంగా రసాయనాలను, పురుగుమందుల్ని వాడాల్సిన దుస్థితి రైతుకు శాపంగా పరిణమించింది. దరిమిళా పెట్టుబడి వ్యయం అసాధారణంగా పెరిగింది. దిగుబడి ఆ స్థాయిలో ఉండట్లేదు. ఉన్నా… తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర సంగతి వదిలేద్దాం, కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కూడా లభించని దైన్యస్థితి! ఫలితంగా ఎమ్మెస్పీ కోసం, దాని అమలు కోసం, మార్కెటింగ్ వ్యవస్థ కోసం ప్రభుత్వాల వైపు చూడాల్సి వస్తోంది. భూమిని, భూసారాన్ని పూర్తిగా కొల్లగొట్టే రీతిలో బతకడం కాకుండా, రైతుతో పాటు అతనిపై ఆధారపడ్డ నలుగురిని బతికించేది ప్రకృతి వ్యవసాయం. వివిధ స్వాభావికతలు గల నేలల పట్ల, వాటి సారం హెచ్చు – తగ్గుల పట్ల అవగాహన, అంతకు మించి గౌరవం ఉన్న ప్రకృతి వ్యవసాయం రైతుకు మేలు. ఈ విషయంలో వారికొక విశ్వాసం కలిగించడంతో పాటు వారి ఉత్పత్తుల్ని, ప్రత్యేకతల్ని ప్రదర్శించే, సంప్రదాయిక జ్ఞానాన్ని పరస్పరం పంచుకునే వేదికలు ‘దేశీ విత్తన పండుగలు’. కొన్ని దశాబ్దాలుగా ఇటువంటి పండుగలు ఇరుగుపొరుగునున్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోనూ, తదనంతర కాలంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్ వంటి చోట్ల జరుగుతూ వస్తున్నాయి. మొదటి విత్తన పండుగ తెలంగాణలో గత సంవత్సరం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో ‘తెలంగాణ రెండో వార్షిక విత్తన పండుగ’ను మూడు రోజులపాటు హైదరాబాద్ నగరానికి ముఫ్ఫై కిలోమీటర్ల దూరంలోని అన్మాస్పల్లి (కడ్తాల్ మండల్) లో ఉన్న ‘ఎర్త్ సెంటర’ వద్ద నిర్వహిస్తున్నారు. వైవిధ్యభరితమైన విత్తనాలు, వ్యవసాయోత్పత్తులతో 70 కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు ఒకటున్నర దశాబ్దాలుగా పనిచేస్తున్న కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సీజీఆర్), జాతీయ సంస్థ ‘భారత్ బీజ్ స్వరాజ్ మంచ్’ సంయుక్తంగా ఈ వేడుకను జరుపుతున్నాయి. దాదాపు ఇరవై వరకు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఈ ఉత్సవాలకు భాగస్వాములుగా ఉన్నాయి.
విరివిగా విత్తన పండుగలు రావాలె!
దేశీ విత్తనాలను సంరక్షించి, విత్తనాలతో పాటు సంప్రదాయ వ్యవసాయ జ్ఞానాన్ని రైతులు పరస్పరం పంచుకునేందుకు వీలు కల్పించే వేదికలైన ‘విత్తన పండుగ’లు తరచూ జరగాలి. ప్రాంతీయంగా, జిల్లాల వారిగా కూడా ఈ పండుగల్ని నిర్వహించాలి. రైతుల్ని, వ్యవసాయ నిపుణుల్ని, శాస్త్రవేత్తల్ని, విశ్వవిద్యాలయాల బోధకులు-పరిశోధకుల్ని, విధాన నిర్ణేతలు, అమలుకారకులైన నాయకులు, అధికారుల్ని ఒక వేదిక మీదకు తెచ్చే ‘విత్తన పండుగ’లు ప్రకతి వ్యవసాయాన్ని పరిపుష్టం చేయాలి. వ్యావసాయిక భారతదేశ పూర్వవైభవాన్ని తిరిగి తీసుకురావాలి.
-దిలీప్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రిసర్చి సంస్థ డైరెక్టర్.

