తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటిచేస్తారా? లేక మరోసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలుస్తారా? ప్రత్యర్థి పార్టీల నేతలు సంజయ్ ను అసెంబ్లీ ఎన్నికల్లో పోటిచేయాలని మాటిమాటికి ఎందుకు సవాల్ విసురుతున్నారు? ఒకవేళ సంజయ్ ఎమ్మెల్యేగా పోటిచేయాల్సి వస్తే ఏ నియోజకవర్గం నుంచి పోటిచేస్తారూ?
తెలంగాణలో రాజకీయం వాడీవేడిగా సాగుతోంది. బిఆర్ఎస్ , బీజేపీ నేతలు మాటల తూటాలు పేలుస్తుంటే .. పాదయాత్రలతో కాంగ్రెస్ నేతలు బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు. ఈనేపథ్యంలోనే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా కరీంనగర్ లో పర్యటించారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సొంత నియోజకవర్గం కావడంతో .. పాదయాత్రలో భాగంగా పలు అంశాలను ప్రస్తావించిన రేవంత్.. బీజేపీ స్టేట్ చీఫ్ కు సవాల్ విసిరాడు. వచ్చే ఎన్నికల్లో సంజయ్ కరీనంగర్ ఎమ్మెల్యేగా పోటిచేయాలని.. కాంగ్రెస్ సత్తా ఏంటో చూపిస్తామని సవాల్ విసరడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఇక రేవంత్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బలమైన నేతగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో సంజయ్ ఇక్కడినుంచి ఎమ్మెల్యేగా పోటిచేసి హోరాహోరి పోరిలో రెండోస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా త్రిముఖ పోటి కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత బిఆర్ఎస్ ఎమ్మెల్యేకు మైనస్ కనిపిస్తుంటే.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సంజయ్ కు కొంత సానుకూల వాతావరణం కనిపిస్తోంది. అటు రేవంత్ పాదయాత్రతో కాంగ్రెస్ క్యాడర్ జోష్ లో ఉంది.
ఇదిలా ఉంటే సంజయ్ హుస్నాబాద్ లేదా వేముల వాడ నుంచి పోటిచేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ.. ఎల్బీనగర్ పరిధిలో అత్యధిక కార్పొరేటర్లను గెలుచుకోవడంతో.. బీజేపీ స్టేట్ చీఫ్ ను ఇక్కడి నుంచి పోటిచేయించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే బీజేపీ ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు ఎల్బీనగర్ నుంచి పోటిచేయాలని పట్టుదలతో కనిపిస్తున్నారు.