Nancharaiah merugumala senior journalist:
” కేరళ కాంగ్రెస్ సమరాగ్ని సభలో రేవంత్ మాట్లాడితే ఒక్క ఈనాడే వార్త వేసింది!అవినీతి, ప్రతిపక్షాల అణచివేత ఎలా చేయాలో కేసీఆర్ దగ్గర మార్క్సిస్ట్ సీఎం విజయన్ నేర్చుకున్నారని చెప్పడం తెలంగాణ యువ సీఎం అమాయకత్వం కాదా? “
గురువారం హైదరాబాద్ నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం పోయి అక్కడ కాంగ్రెస్ సమరాగ్ని ప్రజాందోళన బహిరంగ సభలో ప్రసంగించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. కేరళలో 2016 నుంచి అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తోందని ఆరోపిస్తూ రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేరళ పీసీసీ ఏర్పాటు చేసిన సమరాగ్ని సభలో రేవంత్ పాల్గొనడం నిజంగా వార్తే. ఈ సభకు దక్షిణాదిలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రం కర్ణాటక సీఎం ఎస్.సిద్ధరామయ్య హాజరు కాలేదు. అయినా, సమరాగ్ని ముగింపు కార్యక్రమంలో రేవంత్ గెస్టప్పియరెన్స్ ఇవ్వడమేగాక తెలంగాణ ఎన్నికల్లో ఒక అసెంబ్లీ సీటిస్తానని ఆఫరిస్తే నిరాకరించిన సీపీఎంపై నిప్పులు చెరిగారు. కేరళ వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్డీఎఫ్) సర్కారుకు సారథ్యం వహించే పెద్ద కమ్యూనిస్టు పార్టీ సీపీఎం అనే విషయం తెలిసిందే. అయితే, ఈ సభలో రేవంత్ ఆవేశంతో ప్రసంగిస్తూ తెలంగాణలో మొదటి పాలకపక్షం బీఆరెస్ ను సీపీఎంతో పోల్చిచెప్పారు.
కేసీఆర్ తో పినరయి విజయన్ గారిని పోల్చి తిట్టడం దారుణం!
అంతేగాక, కేరళలోని వయనాడ్ నుంచే రెండోసారి కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపొచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేస్తారని సూచనప్రాయంగా చెప్పారనే విషయం ఇంగ్లిష్ దినపత్రిక ‘ ద హిందూ’ వార్తలో కనిపించింది. మొత్తంమీద తెలంగాణకు చెందిన ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రీ (ఉమ్మడి ఏపీలోని పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య) చేయని సాహసానికి పాల్పడ్డారు రేవంత్. ఆయన కేరళ పోయి అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించే క్రమంలో కేరళ మార్క్సిస్టు సీఎం పినరయి విజయన్, తెలంగాణ మాజీ సీఎం కే చంద్రశేఖరరావును ఒకే గాటన కట్టి వారిద్దరినీ అవినీతిపరులు, ప్రతిపక్షాలను వేధించే నాయకులని వర్ణించడం కాస్త వింతగా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ తొలి ముఖ్యమంత్రిగా తాను ప్రమాణం చేయడానికి తన వంతు తోడ్పాటు అందించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ సొంత రాష్ట్రంలో ఆయన కులానికే (కల్లుగీత కులం ఈళవ) చెందిన మార్క్సిస్టు ముఖ్యమంత్రి విజయన్ పై విరుచుకుపడడం కాంగ్రెస్ అధిష్ఠానం దగ్గర రేవంత్ రెడ్డి గారి ప్రతిష్ఠ పెంచే విషయమే మరి. అయితే, రెండు నెలల్లో 79 సంవత్సరాలు నిండుతున్న కాకలు తీరిన కమ్యూనిస్టు పినరయి విజయన్–‘‘అవినీతితో డబ్బు ఎలా సంపాదించాలి? ఇతర పార్టీల నాయకులను ఎలా వేధించాలో నేర్చుకునేందుకే హైదరాబాద్ వచ్చి అప్పటి సీఎం కేసీఆర్ (70) ను కలిశారు,’’ అని రేవంత్ తిరువనంతపురం సమరాగ్ని మీటింగులో చేసిన ఆరోపణ ఏ మాత్రం నమ్మదగ్గదిగా లేదు. అందులో ఏ మాత్రం విశ్వసనీయత కనిపించడం లేదు. అధికారంలో ఉండగా డబ్బు విలువ ఏమిటో, వర్గ శత్రువుల తిక్క ఎలా కుదర్చాలో శానా చానా బాగా తెలిసిన కేరళ కామ్రేడ్లను 54 ఏళ్ల రేవంత్ ఇలా అవమానించడం అస్సలు బాగోలేదు. తెలంగాణ అసెంబ్లీలో ఏకైక కమ్యూనిస్టు సభ్యుడు కూనంనేని సాంబశివరావుగారు, గురువారమే పదవీ బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కామ్రేడ్ కె.శ్రీనివాస్ రెడ్డి గారితో సహా స్థానిక సీపీఐ, సీపీఎం సభ్యులు, సానుభూతిపరులు రేవంత్ కేరళ ప్రసంగంలోని ఈ అంశాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ముందు తెలంగాణ రెండో ముఖ్యమంత్రి గారు కేరళలో పర్యటిస్తే బీజేపీ మొదటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జీ మాదిరిగా బ్యాక్ వాటర్స్ మధ్య కుటుంబసభ్యులతో గడపాలే గాని మార్క్సిస్టుల జోలికి అనవరంగా పోకపోతేనే మంచిది.