Nancharaiah merugumala senior journalist:
తమిళబ్రాహ్మణ నటి కస్తూరికి కమ్మ, రెడ్డి, బలిజ, గవర వంటి కులాలవారే ‘టార్గెట్’
మరి తెలుగోళ్లందరినీ అవమానించిందనే పేరుతో అరెస్టు దాకా ఎందుకు పోయింది?
తమిళనాడులో లేదా పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాల్లో మూడొందల ఏళ్ల క్రితం వచ్చి స్థిరపడిన తెలుగు వారి గురించి కించపరిచే తీరులో మాట్లాడిన సినిమా నటి కస్తూరిని (50) శనివారం హైదరాబాద్ నార్సింగిలో అరెస్టు చేశారని తమిళనాడు పోలీసులు చెబితే తెలసింది. కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్ పొందాక ఆమె సొంత రాష్ట్రంలో నమోదైన కేసుల దృష్ట్యా అక్కడికి తీసుకుపోతారని కూడా చెప్పారు. మొదట తమిళ రాణుల అంతపురాల్లో సేవలందించడానికి తెలుగువారు వచ్చారని కస్తూరి ఈ నెల మొదటివారం ఒక సమావేశంలో చెప్పారు. బ్రాహ్మణులను అవమానించడాన్ని, ముఖ్యంగా తమిళ బ్రామ్మల్ని ఎగతాళిచేసే తమిళ ధోరణులను ఖండించడానికి ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె మాట్లాడారు. తెలుగు సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో కస్తూరి వెంటనే వివరణ కూడా ఇచ్చారు. తాను తెలుగువారందరికీ వ్యతిరేకం కాదని, మద్రాసు ప్రెసిడెన్సీలో బ్రాహ్మణ వ్యతిరేక రాజకీయ సంస్థలు జస్టిస్ పార్టీ, ద్రవిడ కజగం, ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీల స్థాపనలో కీలక పాత్ర పోషించిన తెలుగు సామాజికవర్గాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడానని కస్తూరి వివరణ ఇచ్చారు. అంటే ఉమ్మడి మద్రాసు ప్రావిన్సులో అన్ని రంగాల్లో బ్రాహ్మణాధిపత్యాన్ని అదుపు చేయడానికి పుట్టిన తమిళ శూద్రుల పార్టీలకు గట్టి మద్దతు ఇచ్చిన తెలుగు కమ్మ, వెలమ, రెడ్డి, బలిజ, గవర (డీకే నాయకుడు ఈవీ రామసామి నాయకర్ గవర కుటుంబంలో పుట్టార. ఈ విషయం తమిళ సామాజిక, సాహిత్య పరిశోధకుడు, పెరియార్ జీవిత చరిత్ర రాస్తున్న ప్రసిద్ధ విద్యావేత్త ఏఆర్ వెంకటాచలపతి చాలా కాలం క్రితమే ధ్రువీకరించారు) తదితర శూద్ర కులాలవారికే తన వ్యాఖ్యలు వర్తిస్తాయనే అర్ధంలో కస్తూరి వివరణ ఇచ్చారని అందరికీ అర్ధమైంది.
అందుకే కాబోలు, కస్తూరి వ్యాఖ్యలపై మదురై పోలీసు స్టేషన్లో తెలుగువారి (కమ్మవారి?) ‘నాయుడు మహాజన సంఘం’ ఫిర్యాదు చేసింది. ఈ నాయుడు మహాజన సంఘం నేత ఏ.బోస్ నాయుడు ఇచ్చిన ఫిర్యాదుకు భయపడిన బ్రాహ్మణ మహిళ కస్తూరి మద్రాస్ హైకోర్టు మదురై బెంచిలో ముందస్తు బెయిలు కోసం ప్రయత్నించింది. ఒక్క నాయుడు మహాజన సంఘమేగాక తమిళనాడులో స్థిరపడిన రెడ్లు చెప్పుకోదగ్గ సభ్యులుగా ఉన్న ఆలిండియా తెలుగు ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రొ.సీఎంకే రెడ్డి కూడా కస్తూరిపై పోలీసు కంప్లెయింట్ ఇచ్చారని వార్తలొచ్చాయి. చెన్నయి చిరునామాతో ఉన్న ఈ అఖిలభారత తెలుగు సమాఖ్యలో ప్రముఖులు ఎక్కువ మంది (అపోలో ప్రతాప్ సీ రెడ్డి గారితో సహా) రెడ్లే ఉన్నారు. మొత్తం మీద తమిళ నేలపై స్థిరపడిన పలుకుబడి కలిగిన వ్యవసాయ కులాలను కస్తూరి కించపరింది. ఏఏ తెలుగు కులాలైతే బ్రాహ్మణాధిపత్యాన్ని ఎదిరించిన తమిళ సామాజిక వర్గాలతో చేతులు గట్టిగా కలిపాయో ఆ కులాలను ఆమె రెచ్చగొట్టింది. నూరేళ్ల క్రితం స్థాపించిన బ్రాహ్మణ వ్యతిరేక జస్టిస్ పార్టీకి తమిళ శూద్రులతోపాటు అండదండలందిచిన తెలుగు వర్గాలైన వెలమలు, రెడ్లు, కమ్మలు, కాపులు, ఇతర బడుగు వర్గాలు కొన్ని దశాబ్దాలు రాజకీయ పోరాటం చేయబట్టే మద్రాసు కేంద్రంగా సాగిన పాలనలో బ్రాహ్మణుల ఆధిపత్య ధోరణులు తగ్గాయి. మొత్తంమీద తమిళనాడులో బ్రాహ్మణులపై ఉన్న గుడ్డి వ్యతిరేకత గొడవలోకి తెలుగువారిని లాగిన తమిళ బ్రాహ్మణ మహిళ కస్తూరీ శంకర్ మంచి పనిచేశారు. ఒక్కసారి తెలుగువారంతా (వారిలో తెలంగాణ ప్రాంతంలో కొద్ది మందే కావచ్చు) 1910 ప్రాంతంలో మొదలైన బ్రాహ్మణేతర తమిళ రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక ఉద్యమాలను గుర్తుచేసుకునే అవకాశం కల్పించింది
‘అన్నమయ్య’ తెలుగు సినిమా రెండో ‘కథాయిక’ అక్కలమ్మగా నటించింది కస్తూరి. మొదటి ‘కథానాయిక’ రమ్య కృష్ణ కూడా తమిళ బ్రాహ్మణ మూలాలు సగం ఉన్న మహిళకావడం యాదృచ్ఛికమే.