ఎల్బీనగర్ నియోజకవర్గ రాజకీయం రసకందకాయంగా మారింది. అధికార బిఆర్ ఎస్ అంతర్గత పోరుతో సతమతమవుతుంటే.. ప్రతిపక్ష బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు గెలిచేందుకు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికమంది కార్పొరేటర్లు ఇక్కడి నుంచి గెలవడంతో కమలం పార్టీ ముఖ్య నేతలు కన్ను నియోజకవర్గంపై పడింది. అటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఇక్కడి నుంచే పోటిచేయాలని పట్టుదలతో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది.
ఇక ఎల్బీనగర్ నియెజకవర్గంలో అధికార బిఆర్ఎస్ పార్టీ అధిపత్య పోరుతో సతమతమవుతోంది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైందంటున్నారు ఆపార్టీ నేతలు. ఈసారి ఎన్నికల్లో టికెట్ తమ నాయకుడికే వస్తుందంటూ..రెండు వర్గాల నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఇద్దరి నేతల పోరు అధిష్టానానికి తలనొప్పిగా మారిందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొద్ది కాలంగా కాంగ్రెస్ నుంచి తనవెంట వచ్చినవారికే సుధీర్ రెడ్డి పదవులు అప్పజేపుతున్నారన్న ప్రచారం పార్టీలో ఉంది. దీంతో ఎప్పటినుంచో పార్టీలో ఉన్న కార్పొరేటర్లు ,లీడర్లు రామ్మోహన్ గౌడ్ కు మద్దతు తెలుపుతున్నారు. ఈవర్గానికి మంత్రి తలసాని శ్రీనివాస్, ఎమ్మెల్సీ కవిత మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. స్థానికంగా పనామ వద్ద బాబాను కలవడానికి కవిత వచ్చినప్పుడు..రంగారెడ్డి కోర్టులో జరిగిన వేడుకల్లోను రామ్మోహన్ గౌడ్ అనుచరులు మాత్రమే కనిపించారు. అటు సుధీర్ రెడ్డి సైతం కార్యకర్తలు, ప్రజలతో సమావేశాలు, కార్యక్రమాలు అంటూ హల్ చల్ చేస్తున్నారు.
అటు బీజేపీ విషయానికొస్తే ఎల్బీనగర్ నుంచి పోటిచేసేందుకు పలువురు కాషాయం నేతలు ఆసక్తి చూపుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎక్కువ మంది కార్పొరేటర్లు గెలవడంతో ఈసీటుకు డిమాండ్ ఏర్పడింది. వంగా మధుసూదన రెడ్డి, కొప్పుల నర్సింహ్మ రెడ్డి టికెట్ కోసం భారీ ఆశలు పెట్టుకున్నారు. సీనియర్ నేత సామా రంగారెడ్డి కూడా సీటుపై కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మునుగోడు సీటు త్యాగం చేసిన గంగిడి మనోహర్ రెడ్డి ఖచ్చితంగా సీటు ఇవ్వాలని పట్టుపడుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఇక్కడ పోటిచేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు పార్టీ నేతలు.
కాంగ్రెస్ లో సైతం పోటి విపరీతంగా ఉంది. టీపీసీసీ రేవంత్ ఎల్బీనగర్ లేదా ఉప్పల్ నుంచి పోటిచేసే అవకాశం ఉంది. సీనియర్ నేత మల్ రెడ్డిరాంరెడ్డి పార్టీ టికెట్ ఆశిస్తున్నారు.అయితే ఇక్కడి ముఖ్య నేతలు బిఆర్ఎస్ పార్టీలోకి జంప్ కావడంతో పార్టీ బలహీనపడింది. దీనికి తోడు నేతలు ఎవరికి వారే యమునా తీరు తరహాలో వ్యహరించడం వంటి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.
మొత్తంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో అధికార బిఆర్ ఎస్ – బీజేపీ ఢీ అంటే ఢీ అంటుంటే..ఎలాగైనా పట్టునిలుపుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది.