రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మోదీ

రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. సోమవారం పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ దశాబ్దపు అనేక లక్ష్యాలను నిర్దేశించిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సూక్తులను ఉటంకిస్తూ.. రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు స్వేచ్ఛాయుత మార్కెట్ కావాలని మన్మోహన్ జీ అంటుండేవారు.. అవకాశాన్ని మేము కల్పించినందుకు మీరు (కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి) గర్వపడాలి అని ప్రధాని మోదీ అన్నారు. కాగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు తేవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మోడీ అన్నారు. గతంలో సంస్కరణలను ప్రోత్సహించిన ప్రతిపక్షాలు నేడు యూటర్న్ తీసుకున్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఇక చిన్న సన్నకారు రైతుల శ్రేయస్సుకోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని మోదీ అన్నారు. గ్రామ సడక్ యోజన ద్వారా గ్రామీణ ప్రాంతం రూపురేఖలు మారతాయని, పంట బీమా యోజనను మరింత విస్తరిస్తామని మోడీ వెల్లడించారు. ఇక నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల అభ్యంతరాలు, ఆందోళన ఎందుకన్నది ఇది అర్థం కావడం లేదన్నారు. వారి అభ్యంతరాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు. రైతుల ఆందోళనకి మద్దతుగా సోషల్ మీడియా వార్ గురించి ప్రస్తావిస్తూ.. విదేశీ భావజాలం గల వ్యక్తులు, దేశ ప్రతిష్టను దిగజార్చెందుకి కుట్ర పన్నుతున్నాయని జాగ్రత్తగా ఉండాలని అని దేశ ప్రజలకు మోదీ సూచించారు.