అదిరింది కూన కూత..!

అబ్బో మొరాకో అంత తేలిగ్గా వదలలేదు. తుది ఫలితం 2-0 లా కనిపిస్తున్నా…. బోల్డు చమట కక్కితే గాని ఫ్రాన్స్ కి 60 ఏళ్ల చరిత్ర సృష్టించే చాన్స్ దక్కలేదు.  చాంపియన్ కు ఏ మాత్రం తగ్గకుండా బంతిని నియంత్రించడమైనా, పాస్ లైనా, ఒడుపుగా బంతి కాళ్లచిక్కించుకోడమైనా, గోల్ పోస్ట్ పై దాడులైనా….వావ్ ఎంత ముచ్చటేసిందో! మొరాకో కూన గర్జనను ఫ్రెంచ్ గోల్ కీపర్ హ్యూగో లోరిస్ పలుమార్లు అడ్డుకొని, ఆ గొప్ప సేవ్స్ చేసుండకపోతే… చరిత్ర మరోలా నమోదయ్యేదే!

ఏ మాటకామాటే చెప్పుకోవాలి ఫ్రాన్స్ ఒక చాంపియన్ లా ఆడింది. 1962 లో బ్రెజిల్ తర్వాత ఒక డిఫెండింగ్ చాంప్ ఫైనల్ చేరడం ఇదే మొదలు. ఫైనల్లో తాజా చాలెంజర్, గట్టి జట్టు అయిన అర్జెంటీనా ను ఓడిస్తే… ఫీఫా ప్రపంచ కప్ చరిత్ర లో అలా కప్పు నిలబెట్టుకున్న మూడో టీమ్ (ఇటలీ-1938, బ్రెజిల్-1962 తర్వాత ఇదే…) అవుతుంది. చూడాలి ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠ రేపేలా ఉంది. ఫుట్బాల్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూసే…. యురోపియన్ మెరుపు వేగం (లైటెనింగ్ స్పీడ్), లాటిన్ అమెరికన్ దోబూచు(డ్రిబ్లింగ్)ల మధ్య మహాపోరు ఆవిష్కృతం కానుంది. సెమీస్ మ్యాచ్  ఆరంభంలోనే హర్నాండెజ్ దూకుడుగా గోల్ చేసిన తీరు చూస్తే అర్జెంటీనా మెస్సీ బృందం తమ పూర్తి సామర్థ్యం చూపితే తప్ప ఫ్రాన్స్ ని సవాల్ చేయలేదేమో అనిపిస్తుంది. ఏదేమైనా…. వచ్చే ఆదివారం మరో గొప్ప ఫైనల్ క్రీడాభిమానుల్ని అలరించనుంది.

==============

దిలీప్ రెడ్డి(పీపుల్స్ పల్స్ డైరెక్టర్)