sports: ఓటమిపై భావోద్వేగానికి గురైన వైభవ్ సూర్యవంశీ…

Ipl2026:

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి పాలై ఫైనల్ అవకాశాన్ని కోల్పోయిన నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తన మనసులోని బాధను అభిమానులతో పంచుకున్నాడు.

“ఫైనల్‌కు చేరుకోలేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. నిజంగా ట్రోఫీని గెలవాలని ఎంతో ఆశపడ్డాను. రాజస్థాన్ రాయల్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లేందుకు నా వంతు చివరి వరకు పూర్తి స్థాయిలో ప్రయత్నించాను. కానీ అది సాధ్యపడలేదు. మేమంతా కలిసి ఎంతో కష్టపడ్డాం. అయినప్పటికీ ఫలితం అనుకున్నట్లు రాలేదు,” అని వైభవ్ పేర్కొన్నాడు.

జట్టుపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేసిన వైభవ్, “ఈ పరాజయం మాకు పెద్ద గుణపాఠం.వచ్చే సీజన్‌లో ఇంకా మెరుగైన క్రికెట్ ఆడతాం. తప్పకుండా ఛాంపియన్స్‌గా నిలుస్తామని ఆశిస్తున్నాను,” అని ధైర్యంగా చెప్పుకొచ్చాడు.

వైభవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్న వయసులోనే జట్టుపై బాధ్యతతో మాట్లాడిన వైభవ్ తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. ఓటమి తర్వాత కూడా జట్టుపై విశ్వాసం కోల్పోకుండా భవిష్యత్తుపై ఆశాభావం వ్యక్తం చేయడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ తన ఆటతో మంచి గుర్తింపు సంపాదించాడు. కీలక సందర్భాల్లో ఒత్తిడిని అధిగమించి కీలక ఇన్నింగ్స్ ఆడిన చిచ్చర పిడుగు భవిష్యత్తులో భారత క్రికెట్‌కు మంచి ఆస్తిగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Optimized by Optimole