munuudireview: ‘అరబ్బీ నిఖా’ బలిపశువులు మహిళలే.. మతాధికారులపై కత్తి ఎత్తిన రుఖియా కథ..!

విశీ( సాయి వంశీ) :

” మతం అంచుల అవతల ‘అరబ్బీ నిఖాలు'” 

ఈ విశ్వంలో ప్రకృతి ఉంది. ఈ భూమిపై మతం ఉంది. ప్రకృతికి కొన్ని నియమాలు ఉన్నాయి. మతంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. శారీరక వాంఛలు తీర్చుకోవడానికి ఒక జీవి మరో జీవితో సమాగమించొచ్చు అంటుంది ప్రకృతి. అది దాని నియమం. పెళ్లి కాని ఇద్దరు స్త్రీ, పురుషులు శారీరకంగా కలిస్తే అది వ్యభిచారం అంటుంది మతం. రెండింటికీ భూమి ఆకాశాల నడుమ ఉన్నంత తేడా ఉంది. కానీ ప్రకృతికి సవరణలు లేవు. మనం చెట్టు నీడన నిలవాలంటే విత్తు నాటాలి. మొక్క పెరగాలి. మానుగా మారాలి. ఇంత ప్రక్రియ జరగాలి. కానీ కాలానుగుణంగా మతం తనకు తాను సవరణలు చేసుకుంటూ ఉంది. లేకపోతే దాన్ని ఆచరించే వారి మనుగడ కష్టం.

మతం ప్రకారం శారీరక అవసరాల కోసం వ్యభిచారం చేయడం తప్పు అని భావిస్తే మరి ఏమిటి దారి? వెతగ్గా, వెతగ్గా ‘పెళ్లి’ని తెరపైకి తెచ్చారు కొందరు. అవును! నచ్చినవారిని పెళ్లి చేసుకుని, గడిపినంత కాలం గడిపి, ఆపై విడాకులు తీసుకోవచ్చు. అందులో దోషం లేదనేది వారి మాట. అది మతం అంగీకరిస్తుందా? పురుషుడు ముమ్మారు(వేర్వేరు సమయాల్లో) ‘తలాఖ్’ అని చెప్పే విధానం మతం ఆమోదించిందే కదా? అలాగని ప్రతి ‘తలాఖ్’/’ఖులా’ ఇలా స్వార్థంతో కూడుకున్నది కాదు. వారి మెరుగైన జీవితం కోసం కొందరు పాటించే క్రమమైన పద్ధతి అది. కానీ తమ స్వార్థం కోసం వాటిని ఆపద్ధర్మంగా వాడేవారితోనే వస్తుంది చిక్కు.

సరే! అసలు విషయంలోకి వద్దాం! అరేబియా దేశస్తులు వ్యాపారాల నిమిత్తం మన దేశం వస్తారు. వచ్చేవారు ఒంటరిగా వస్తారు. ఇక్కడ కొన్నాళ్లు గడుపుతారు. వారి శారీరక అవసరాలు ఎలా తీరేది? వ్యభిచారం మతవిరుద్ధం. అలా చేస్తే నరకానికి పోతారు. కాబట్టి పెళ్లినే ఒక దారిగా ఎంచుకున్నారు. దాని పేరు ‘అరబ్బీ నిఖా'(అరబ్బీ పెళ్లి). ఇక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఉన్నంతకాలం గడిపి, ఆపై తిరిగి తమ దేశం వెళ్లేప్పుడు ‘తలాఖ్’ ఇస్తారు. తాము విడిచిపెట్టిన భార్యకు కొద్దో గొప్పో భరణం ముట్టజెపుతారు. మొత్తం శాస్త్రబద్ధంగా జరుగుతుంది. కాబట్టి పరలోకంలో వాళ్ల స్థానం పదిలంగా ఉంటుంది. వాళ్లకు తగ్గ అమ్మాయిలను కుదిర్చేందుకు ప్రత్యేకంగా ఏజెంట్లు ఉంటారు. అంతా పకడ్బందీగా సాగుతుంది. కానీ ఆ అమ్మాయి పరిస్థితి? తన జీవితం? సమాజంలో తన స్థానం?

కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా పుత్తూర్ తాలుకాకు చెందిన బోల్వర్ మహ్మద్ ఖున్హీ మనసులోనూ ఇవే ప్రశ్నలు. ఇవే ఆలోచనలు. ఆయన రచయిత. ఎటువంటి రచయిత? రెండు సార్లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న రచయిత. కన్నడ సాహిత్యంలో తొలిసారి ముస్లిం జీవనం, దాని వైరుధ్యం, అందులోని నీతి నియమాల గురించి చర్చించిన రచయిత. మహమ్మద్ ప్రవక్త జీవితంపై దేశంలో తొలిసారిగా ‘ఒదిరి’ అనే నవల రాసిన రచయిత. కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి కన్నడ సాహిత్యంలో తొలి ‘బాలసాహిత్య పురస్కారం’ అందుకున్న రచయిత. వృత్తి రీత్యా సిండికేట్ బ్యాంక్ చీఫ్ మేనేజర్‌గా పని చేసి రిటైరయ్యారు. ‘అరబ్బీ నిఖా’ కారణంగా కర్ణాటకలోని అరేబియా సముద్ర తీర ప్రాంతంలోని ముస్లిం ఆడపిల్లలు పడుతున్న ఇబ్బందుల గురించి ‘ముత్తచ్చెర’ అనే కథ రాశారు. మతం ఎంత గొప్పదైనా కానీ, అది విమర్శకు అతీతమైనది కాదు. అలా అనుకుంటే మానవ ప్రగతికి మార్గం దొరకదు‌. తాను పాటించే మతంలో జరిగే అవకతవకల గురించి ఆయన ధైర్యంగా కథ రాశారు. రాయటం అంటే ముగింపు కాదు‌. మొదలు.

అదే కర్ణాటక రాష్ట్రంలో తుముకూరు తాలుకాలో జన్మించిన ఓ సినీ దర్శకుడు ఆ కథ చదివారు. ఆయన పేరు పి.శేషాద్రి. అప్పటికి భారతీయ ప్రేక్షకులు, సినీ విమర్శకులంతా కన్నడ సినీ రంగం ప్రస్తావన రాగానే ‘గిరీష్ కర్నాడ్, పి.లంకేశ్, గిరీష్ కాసరవెల్లి, నాగాభరణ’ పేర్లు చెప్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద వారి సినిమాలే ప్రదర్శితమవుతున్నాయి‌. అటువంటి కాలంలో శేషాద్రి దర్శకత్వ రంగంలోకి వచ్చారు. అప్పటికే నాలుగైదు టీవీ సీరియళ్లు తీసి ఉన్నారు. తొలిసారి సినిమా చేయాలని చూస్తున్నారు. ఎలాంటి సినిమా తీయాలి? ప్రేమకథలా? కుటుంబ బంధాలా? కాదు.. ఇదే తాను తీయాల్సిన సినిమా. కథ దొరికింది. ఇందులో బోలెడంత వివాదం ఉంది. అయినా సరే, ఇదే తీయాలని నిర్ణయించుకున్నారు. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించారు. విత్తం తక్కువగా ఉన్న సమయంలో విద్య మేలుగా రాణిస్తుంది. మేధస్సు మెరుపులాగా పనిచేస్తుంది.

శేషాద్రి చేతిలో కథ ఉంది. స్క్రిప్ట్ పూర్తయింది. చిత్రం పేరు ‘మున్నుడి’. అంటే ‘ముందుమాట’ అని అర్థం. కథలో రెండు ప్రధాన పాత్రలు. ఒకటి రుఖియా. అరబ్బీ నిఖా కారణంగా ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చి, తన భర్త ఏదో ఒక రోజు తిరిగివస్తాడని ఎదురు చూసే ఒంటరి మహిళ. మరో పాత్ర హసనబ్బ. అరబ్బీలకు అమ్మాయిలను కుదిర్చే బ్రోకర్. ఈ పాత్రలకు తగ్గ నటీనటులు కావాలి. మేటి కథలకు మేలుమేలైన కళాకారులు ఎదురొస్తారు. అలా వచ్చినవారు తార(నటి, కర్ణాటక రాష్ట్ర మాజీ ఎమ్మెల్సీ), హెచ్.జి.దత్తాత్రేయ. ఇద్దరూ నటన తెలిసినవారు. నిజంగా నటించడం వచ్చినవారు. ఇచ్చిన పాత్రకు న్యాయం చేయగలిగినవారు. ఒకరితో మరొకరు పోటీపడి నటించారు. జాతీయ ఉత్తమ నటిగా తారకు అవార్డు రావాల్సింది, కానీ రాలేదు. జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా హెచ్.జి.దత్తాత్రేయ పురస్కారం అందుకున్నారు. కర్ణాటక రాష్ట్ర ఉత్తమ నటుడి అవార్డూ సొంతం చేసుకున్నారు. కన్నడ సినీ రంగంలో పూర్తిగా ముస్లిం పాత్రలతోనే(నటులు కాదు, పాత్రలు మాత్రమే) తీసిన తొలి సినిమా ఇదే. కథ నేపథ్యం అలాంటిది.

మతం చాలా చిత్రమైనది. అందులోని నియమాలు పైకి బాగున్నట్టే అనిపించినా, లోలోపల జరిగే దారుణాలు జరుగుతూ ఉంటాయి. వాటికి తొలి బలిపశువులు మహిళలే! అంతా శాస్త్రబద్ధంగా జరుగుతుంది అనిపించినా దాదాపు అన్ని మతాలూ స్త్రీని ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. చాలా సార్లు మతాధికారులూ దీనికి అడ్డు చెప్పలేరు. ఈ విషయాన్ని ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. పెళ్లి-తలాఖ్ అనే మతాంగీకారమైన విషయాల నడుమ స్త్రీలు మట్టి బొమ్మలుగా, విలాస వస్తువులుగా మారే వైనాన్ని చూపించారు. వారిని అందులోకి లాగే కుటుంబ పరిస్థితులు, సామాజిక ఒత్తిళ్లు, చాటు మాటు బ్రోకర్లనూ ఇందులో చూడొచ్చు. చివరికి ఆ బ్రోకర్లూ తమ గోతిలో తమ సొంత పిల్లలనే పడేసే స్థితికి చేరుకోవడమూ గమనించొచ్చు.

అరబ్బీ నిఖా పేరిట మరే ఆడపిల్లా తనలా మారకూడదని రుఖియా నిశ్చయించుకొని, మతాధికారులపైన కత్తి ఎత్తడంతో కథ ముగుస్తుంది. మరి ‘అరబ్బీ నిఖాలు’ ఆగాయా? నేటికీ హైదరాబాద్ పాతబస్తీ గల్లీల్లో అక్కడక్కడా జరుగుతూనే ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దారుణాలపై ఇంకా ఎందరు మహిళలు ఎన్ని కత్తులు ఎత్తాలి? ఎప్పటికి ఇవి శాశ్వతంగా రూపుమాసిపోతాయి?

ఈ చిత్రం యుట్యూబ్‌లో English Subtitlesతో అందుబాటులో ఉంది.

Link: https://youtu.be/6EENmDsmQU8

Optimized by Optimole