8.9 C
London
Wednesday, January 15, 2025
HomeLatestTelangana: పార్టీ ఫిరాయింపులపై ప్లేటు ఫిరాయిస్తున్న కాంగ్రెస్‌..!

Telangana: పార్టీ ఫిరాయింపులపై ప్లేటు ఫిరాయిస్తున్న కాంగ్రెస్‌..!

Date:

Related stories

literature: కులం అనే ఆలోచనకు ప్రేమే పరిష్కారం..!

విశి: కుట్టి రేవతి తమిళ కవయిత్రి & సినీ గీతరచయిత్రి. అసలు పేరు...

sankranti2025: 3 డీ టైప్స్ ముగ్గులు..ప్రత్యేకం..!

సాహితీ, ప్రసిద్ధ, మౌక్తిక: ...

literature: ఎరుకే జ్ఞానం నీవే దైవం..!

Teluguliterature: ఆ.వె : శిలను ప్రతిమ చేసి చీకటింటను బెట్టి మ్రొక్కవలదు వెర్రి మూఢులార! యుల్లమందు బ్రహ్మముండుట...

BJP: బిజెపి మునక మునుగోడుతో మొదలైందా..?

BJP: బీజేపీ మాతృక ‘భారతీయ జనసంఘ్’ కార్యవర్గ సమావేశం, నేటికి యాభైయేడు ఏళ్ల...

vaikuntaekadashi: వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత..!

Vaikunta ekadashi: హిందువుల పండుగలన్నీ చంద్రమానం ప్రకారం లేక సౌరమాన ప్రకారం...
spot_imgspot_img

Telangana politics: ప్రజలు ఒక పార్టీని గద్దె దించారంటే అది చేసిన అనేక తప్పిదాలు కారణాలవుతాయి. వారి స్థానంలో అధికారం చేపట్టిన పార్టీ ఆ పొరపాట్ల నుండి గుణపాఠాలు నేర్చుకొని వాటిని పునరావృతం చేయకుండా పాలిస్తే ప్రజాదరణ పొందుతారు. అలాకాక వారికంటే మేము నాలుగు ఆకులు ఎక్కువే తిన్నామంటూ ప్రత్యర్థులు నడచిన ప్రజావ్యతిరేక అడుగుజాడల్లోనే నడుస్తామంటే వీరిపై కూడా ప్రజాభిప్రాయం మారడం ఖాయం. పదేళ్ల కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజలు రేవంత్‌ సర్కారును అందలమెక్కిస్తే, కాంగ్రెస్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ విడిచిన చెప్పులనే వేసుకుంటూ, వారి బాటలోనే నడుస్తోంది.

తెలంగాణలో కేసీఆర్‌కు ఓటర్లు రెండు సార్లు స్పష్టమైన మోజార్టీతో అధికారం అప్పగించినా విపక్షమే లేకుండా అంతా తానై పాలించాలనే ఆలోచనలతో ఆయన ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయాలని చూశారు. 2014లో 63 సీట్లతో బీఆర్‌ఎస్‌ను గెలిపించిన ప్రజలు 2018లో మరో 25 స్థానాల్లో అదనంగా గెలిపించి 88 సీట్లు కట్టబెట్టినా కేసీఆర్‌ సంతృప్తి చెందకుండా, ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్ధేశంతో వంద స్థానాల మార్కు దాటాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ప్రజాతీర్పుకు భిన్నంగా ప్రతిపక్ష పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునే కుట్రకు కేసీఆర్‌ తెరదీశారు.

ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి తమ పార్టీ తరఫున గెలిపించుకొని ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని నిరూపించుకుంటే ఎలాంటి వివాదాలుండేవి కావు. కేసీఆర్‌ ఇందుకు భిన్నంగా చట్టంలోని లొసుగులను అనుకూలంగా మల్చుకొని 2018 తరువాత గంపగుత్తగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. పాలక పార్టీలో చేరితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చనే నెపంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అధికారాన్ని అనుభవించారు. కొందరికి మంత్రి హోదా కూడా దక్కింది

 

బీఆర్‌ఎస్‌ చేసిన ప్రజావ్యతిరేక కార్యకలాపాలను లెక్కపెట్టుకున్న ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తూ ఆ పార్టీని ఓడిరచారు. ఆ అనుభవాలతో జాగ్రత్త పడాల్సిన రేవంత్‌ సర్కారు అందుకు భిన్నంగా పావులు కదుపుతోంది. అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ కలిగున్న రేవంత్‌ సర్కారు అవసరం లేకపోయినా లోగడ తమను ఇబ్బంది పెట్టిన కేసీఆర్‌పై కక్ష తీసుకోవాలనే ఏకైక లక్ష్యంతో సాగుతోంది.  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను ఇప్పటికే పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్‌ మరింత మంది ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది. బీఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు ఆ పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని న్యాయపరమైన చిక్కులు రాకుండా విలీనాన్ని సంపూర్ణం చేయాలని కాంగ్రెస్‌ అడుగులేస్తోంది.

అధికారంలో ఉండి ఏమి చేసినా చెల్లుబాటయినా, ప్రజా కోర్టులో మాత్రం శిక్ష తప్పదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చరిత్రను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన 14 మంది ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌ తిరిగి టికెట్లిస్తే వారిలో మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్‌లో సుధీర్‌ రెడ్డి మాత్రమే గెలవగా మిగతా 12 మంది ఓడిపోయారు. అధికార దాహంతో ఫిరాయించే ఎమ్మెల్యేలతో పార్టీలో గ్రూపు రాజకీయాలకు నాందిపలికినట్టేనని గతనుభవాలే నిరూపిస్తున్నాయి. లోగడ కాంగ్రెస్‌ నుండి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో సదరు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కేసీఆర్‌ సర్కారు పుట్టిముంచాయి.

ఇటువంటి ఘటనలను కొన్ని పరిశీలిస్తే 2018లో కొల్లాపూర్‌ నుండి గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హర్షవర్థన్‌ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నాక ఆయన చేతిలో ఓడిపోయిన బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత జూపల్లి కృష్ణారావు నిత్యం ఆయనతో ఘర్షణ పడుతూనే 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరి, గెలిచి ఏకంగా మంత్రి అయ్యారు. ఈ విధంగానే నకిరేకల్‌లో వేముల వీరేశం, పినపాకలో పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందులో కోరం కనకయ్య అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ నుండి కాంగ్రెస్‌లో చేరి గెలిచారు. 2016లో పాలేరు ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుండి గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు 2018 ఎన్నికల్లో కాంగ్రెన్‌ అభ్యర్థి ఉపేందర్‌ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో తుమ్మల 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ తరఫున ఖమ్మం నుండి గెలిచి మంత్రి అయ్యారు.

పై ఉదంతాలను గమనిస్తే వలసలొచ్చే ఎమ్మెల్యేలతో సొంత పార్టీలో అసంతృప్తి జ్వాలలతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కావడం కంటే బలహీన పడట్టు కనిపిస్తుంది. ఇటీవల గద్వాల్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి పార్టీ మారనున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థి సరిత తిరుపతయ్య తమ రాజకీయ భవిష్యత్‌పై బెంగతో ఆయన రాకను వ్యతిరేకిస్తూ కంటనీరు పెట్టారు. ఈ పార్టీ ఫిరాయింపులతో బీఆర్‌ఎస్‌ చేతిలో ఓడిన కాంగ్రెస్‌ నేతల్లో ఆందోళన మొదలైతే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్‌ పార్టీలో సదరు నియోజకవర్గాల్లో అంతర్గత యుద్ధం ఖాయం.

వలస రాజకీయాలపై ప్రజలు ఎంత అసంతృప్తిగా ఉంటారో ఇటీవల పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలే తార్కాణం. 2023లో ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్‌ కనీసం ఆ పార్టీకి రాజీనామ కూడా చేయకుండా సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ ఎంపీగా పోటీ చేస్తే ప్రజలు ఓడించారు. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా 43 శాతంతో 67 వేలకు పైగా ఓట్లు పొందిన దానం ఐదు నెలల వ్యవధిలో ఎంపీగా పోటీ చేసి ఈ సెగ్మంట్‌లో 37 శాతంతో 57 వేల ఓట్లు మాత్రమే సాధించి రెండో స్థానంలో నిలిచారు.

లోక్‌సభ ఎన్నికల ముందు దానం నాగేందరే కాకుండా బీఆర్‌ఎస్‌ నుండి కాంగ్రెస్‌లో చేరిన రంజిత్‌రెడ్డిని చేవెళ్లలో, పట్నం సునితా మహేందర్‌రెడ్డిని మల్కాజిగిరిలో, బీఆర్‌ఎస్‌ నుండి బీజేపీలో చేరిన బీబీ.పాటిల్‌ను జహీరాబాద్‌లో, పి.భరత్‌ను నాగర్‌కర్నూల్‌లో, సైదిరెడ్డిని నల్గొండలో, ఆరూరి రమేశ్‌ను వరంగల్‌లో, బీఎస్పీ నుండి బీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ను నాగర్‌కర్నూల్‌లో ఎంపీగా పోటీ చేయిస్తే అరువు వచ్చిన ఈ నేతలను ఓటర్లు ఓడించారు. పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా పీపుల్‌పల్స్‌ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు పార్టీ మారి పోటీ చేసిన నేతలపై ఓటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తెలంగాణలోనే దేశ వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల ఫిరాయింపుల జాడ్యం ఉంది. గతంలో బీజేపీ కర్ణాటకలో ఇవే చర్యలు చేపట్టి చివరికి అధికారాన్నే కోల్పోయింది. మహారాష్ట్ర, హర్యానాలో కూడా బీజేపీ వలసలను ప్రోత్సహిస్తూ ప్రత్యర్థి పార్టీలను చీల్చి ఇటీవల పార్లమెంట్‌ ఎన్నికల్లో భంగపడిన విషయం గమనార్హం. ఫిరాయింపులపై గత అనుభవాలను పరిగణలోకి తీసుకోకుండా అప్పుడు కేసీఆర్‌ చేశారు కదా. ఇప్పుడు మేము కూడా అదే చేస్తామంటూ ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అని చేరికలను ప్రోత్సాహిస్తూ పోతే ఇవి ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం కాదు. చేరికలపై గతంలో కేసీఆర్‌ను ఎండగట్టిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఫిరాయింపులపై గతంలో తాము చేసిన వ్యాఖ్యలపైనే ప్లేటు ఫిరాయించడం ఫక్తు అవకాశవాద రాజకీయం.

                                                                                             

ఐ.వి.మురళీ కృష్ణ శర్మ

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సస్థ

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

Optimized by Optimole