Chandrababu: చంద్రబాబుకు లోక‌స‌త్తా బాబ్జి లేఖ.. రైతుల ఖాతాల్లో 20 వేలు జమ చేయండి..!

APpolitics:  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ‘ఏరువాక’ సందర్భంగా లోకసత్తా పార్టీ, రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జి లేఖాస్త్రం సంధించారు.తెలుగుదేశం – జనసేన పార్టీ ఉమ్మడిగా విడుదల చేసిన ప్రజాగళం మ్యానిఫెస్టోలోని సూపర్సిక్స్ హామీల్లో ప్రస్తావించినట్లుగా .. రాష్ట్రంలో రైతాంగానికి పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి రూ.20 వేల రూపాయలు ఆర్థిక సహాయం జమచేయాలని రైతాంగం పక్షాన కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయం సీజన్ ప్రారంభం అయ్యిందని..గత ఖరీఫ్, రబీ సీజన్లో వర్షాభావంతో ఒకవైపు కరువు, మరోవైపు డిసెంబర్ మాసంలో తుఫాన్ కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఈ విషయంపై అప్పట్లో టిడిపి- జనసేన పార్టీలు ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నట్లు లేఖలో ప్రస్తావించారు.

గత సంవత్సరం ఖరీఫ్, రబీలో రైతాంగం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన కారణంగా ఈ సంవత్సరం ఖరీఫ్లో వ్యవసాయ పెట్టుబడులకు రైతాంగం అనేక ఇబ్బందులు పడుతోందన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని సూపర్సిక్స్లో హామీ ఇచ్చిన ప్రకారం రైతులకు పెట్టుబడి సహాయం కింద రూ.20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి వారిని ఆదుకోవాలని కోరుతూ  లేఖలో బాబ్జీ విజ్ఞప్తి చేశారు.