ప్రతిపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ ఆల్వా నేపథ్యం..!

Nancharaiah Merugumala (సీనియర్ జర్నలిస్ట్):

==============================

కొంకణ క్రైస్తవ రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న
మార్గరెట్‌ ఆల్వా అత్తమామలిద్దరూ కాంగ్రెస్‌ ఎంపీలే
అత్త వయలెట్‌ రాజ్యసభ డెప్యూటీ చైర్మన్‌ (1962–69)
–––––––––––––––––––––––––––––––
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు కాంగ్రెస్, దాన్ని అనుసరించే ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థులు ఇద్దరూ (యశ్వంత్‌ సిన్హా, మార్గరెట్‌ ఆల్వా) 80 ఏళ్లు దాటినోళ్లే. యశ్వంత్‌ 84 అయితే, మార్గరెట్‌ ఎనిమిది పదుల్ని మొన్న ఏప్రిల్‌ లో దాటారు. మార్గరెట్‌ ఆల్వా నెహ్రూ–గాంధీ కుటుంబానికి అత్యంత విధేయత కలిగిన కన్నడ కొంకణి రోమన్‌ కేథలిక్‌ రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు.
క్రైస్తవంలోకి మారక ముందు బ్రాహ్మణులుగా ఉన్న నేపథ్యం వారిది. ఆమె ఐదు సార్లు ఎంపీగా చేశారు. అయితే, గత 8 సంవత్సరాలుగా రాజకీయాల్లో చురుకుగా లేరు. యూపీఏ ప్రభుత్వం పాలన ముగిసిన 2014లోనే ఆమె గవర్నర్‌ గిరీ కూడా గోవాలో ముగిసింది. 1974 నుంచి 1998 వరకూ మార్గరెట్‌ ఆల్వా కాంగ్రెస్‌ తరఫున కర్ణాటక నంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. 1999లో కర్ణాటకలోని ఉత్తర కన్నడ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే, ఆ తర్వాత 2004 పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయాక ఆమె కాంగ్రెస్‌ పార్టీ పదవిలో, గవర్నర్‌ పదవిలో కొనసాగారు.
మార్గరెట్‌ అత్తమామలు వయలెట్, జోయాకిమ్‌ ఇద్దరూ కాంగ్రెస్‌ ఎంపీలుగా ఉన్నారు. భారత పార్లమెంటులో ఇద్దరూ సభ్యులుగా ఉన్న తొలి జంట వయలెట్, జోయాకిమ్‌. వయలెట్‌ ఆల్వా 1960లో రాజ్యసభ డెప్యూటీ చైర్మన్‌గా పనిచేశారు. కర్ణాటక దక్షిణ కోస్తా తీరంలోని తులూ ప్రాంతంలో రోమన్‌ కేథలిక్కులు ఎక్కువ. దివంగత దిగ్గజ నేత జార్జి ఫెర్నాండెజ్‌ మాదిరిగానే మంగళూరు రోమన్‌ కేథలిక్‌ కుటుంబంలో మార్గరెట్‌ పుట్టారు. ఏమాత్రం గెలుపు అవకాశం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పాలక కుటుంబం దయతో ఉపరాష్ట్రపతికి పోటీచేయడం ఆమె రాజకీయ జీవితంలో విస్మరించదగిన చివరి దశగా మిగిలిపోతుంది.
భర్త నిరంజన్‌ థామస్‌ ప్రసిద్ధ లాయర్‌. మార్గరెట్‌ కొడుకులు నిరేత్, నిఖిల్, నివేదిత్‌ ఆల్వా టెలివిజన్‌ ప్రొడక్షన్‌ కంపెనీ మీడిటెక్‌ ను విజయవంతంగా నడుపుతున్నారు. 2008 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్లు అమ్ముకుంటున్నారంటూ మార్గరెట్‌ ప్రకటన చేసి పార్టీ పదవులకు రాజీనామా చేశారు. తర్వాత కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం బుజ్జగించాక ఆమె తిరుగుబాటు జెండాను కిందకు దింపేశారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె వార్తల్లోకి ఎక్కారు. దేశంలో కాంగ్రెస్‌ తరఫున పెద్ద రాజ్యాంగ పదవికి రోమన్‌ కేథలిక్‌ అభ్యర్థిని కాంగ్రెస్‌ నిలపడం ఇదే మొదటిసారి.

ఆరేళ్ల క్రితం 2016 జులైలో ఆమె తన ఆత్మకథ ‘కరేజ్‌ అండ్‌ కమిట్‌మెంట్‌’ ను జైపూర్‌ లో విడుదల చేస్తూ తాను రాజకీయాల్లో పరాజయాలు ఎదుర్కొనడానికి కారణాలు వివరించారు. జర్నలిస్టు నూపుర్‌ బసుతో మాట్లాడుతూ, ‘‘ నా రాజకీయ జీవితంలో చాలా కాలం మతం అనేది అసలు సమస్యే కాలేదు. నా కృషి, అంకితభావం ఆధారంగానే నేను ఎన్నికల్లో గెలిచాను. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచాక కులం, మతం ప్రభావం కనబడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2004 లోక్‌ సభ ఎన్నికల్లో నేను పోటీచేసిన ఉత్తర కన్నడ నియోజకవర్గంలో–‘ఆల్వాకు ఓటు రోమ్‌ కు ఓటు. బీజేపీకి వేస్తే రాముడికి ఓటేసినట్టే’ అంటూ పోస్టు కార్డులు పంపిణీ చేశారు,’ అంటూ ఆమె వాపోయారు. మార్గరెట్‌ రోమన్‌ కేథలిక్‌ క్రైస్తవ కుటుంబంలో పుట్టిన కారణంగా రోమ్‌ అంటే క్రిస్టియన్‌ అనే అర్ధంలో బీజేపీ ప్రచారం చేసిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Optimized by Optimole