నాగార్జున సాగర్(నల్గొండ) : సాగర్ ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేత జానారెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు రవి నాయక్ పార్టీని వీడుతున్నట్లు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్లో కుటుంబ పాలన నడుస్తోందని.. సోనియా, రాహుల్, ప్రియాంక దారిలో జానారెడ్డి నడుస్తున్నారని ధ్వజమెత్తారు. ఇన్నాళ్లు వెన్నంటి ఉన్న నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పార్టీలో కలకలం రేపుతోంది.
కాగా మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని.. వారు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు వలన ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుందన్నారు. మోడీ నాయకత్వం మీద నమ్మకంతో త్వరలో భాజపాలో చేరబోతున్నట్లు.. సాగర్ నియోజకవర్గ పరిధిలోని గిరిజనుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతానని రవి నాయక్ స్పష్టం చేశారు.