మధ్యప్రదేశ్‌లో బీజేపీకి షాక్ ?

దేశంలో ఉత్తరాది ప్రాంతానికి గుండెకాయ లాంటి మధ్యప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయం సాధించి హిందీ బెల్టు రాష్ట్రాలలో తన పట్టు సడలేదని నిరూపించుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉంటే, ఇక్కడ పగ్గాలు చేపట్టి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందనే సంకేతాలివ్వాలని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది.
మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 230 సీట్లు ఉండగా ప్రస్తుతం బీజేపీకి 128 మంది సభ్యులున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 98 మంది ఎమ్మెల్యేలున్నారు. బీఎస్పీ నుండి ఒకరు, మరో ముగ్గురు స్వతంత్రులు రాష్ట్ర అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికల్లో 114 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 109 స్థానాలు కైవసం చేసుకుంది. మెజార్టీకి 116 మంది సభ్యులు అవసరం కాగా బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 15 ఏళ్ల బీజేపీ పాలనకు అడ్డుకట్ట వేసి పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే, 2020 మార్చిలో అప్పటి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాయి. ఆయనతో సహా 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్ల కమల్‌ నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కారు కూలిపోవడంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పిన నేతలంతా బీజేపీలో చేరారు. జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్ర మంత్రి పదవి లభించింది.
ప్రస్తుతం బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బలమైన నాయకుడిగా ఉన్నా 2005 నుంచి నిరాటంకంగా (2018 డిసెంబర్‌ 17 నుంచి 2020 డిసెంబర్‌ 23 వరకు మినహా) సీఎం పదవిలో కొనసాగుతుండటం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోంది. దీనికి తోడు బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలూ ఉన్నాయి. ఈ కారణంగా రాబోయే ఎన్నికల్లో ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకుండా ముందుకు వెళ్లడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే కర్ణాటక ఫలితం నేపథ్యంలో చౌహాన్‌ లాంటి బలమైన నాయకుడిని పక్కనపెట్టడానికి బీజేపీ అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. బలమైన ఓబీసీ నేతను పక్కన పెట్టారన్న అపవాదునూ ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని బీజేపీ సందేహిస్తోంది. మరోవైపు సర్వేలన్నీ కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపుతుండడంతో బీజేపీ అధిష్టానానికి పాలుపోవడం లేదు.


కర్ణాటక ఫలితంతో ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్‌ మధ్యప్రదేశ్‌లో కూడా అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తోంది. కర్ణాటక తరహాలో ఇక్కడ కూడా స్థానిక అంశాల అజెండాగా ముందుకు సాగాలని కాంగ్రెస్‌ ప్రచారం సాగిస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని 2020లో బీజేపీ అప్రజ్వామికంగా, రాజ్యాంగాన్ని ఖూనీ చేసి కూల్చేసిందన్న సానుభూతితో ఈసారి ఎన్నికల్లో పొందాలని ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. రాహుల్‌ గాంధీ నిర్వహించిన భారత్‌ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఉత్సాహాన్నిచ్చింది. కుల గణనను కాంగ్రెస్‌ ప్రత్యేక అజెండాగా రూపొందించుకుంటోంది. గతంలో కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కీలక పాత్ర పోషించిన తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో చాలా మంది తిరిగి సొంత గూటికి చేరడంతో కాంగ్రెస్‌ పార్టీలో ఉత్సాహం రెట్టింపు అయ్యింది.


అవినీతి, కుంభకోణాలు
బీజేపీ పాలనలోని అవినీతిని ఎండగట్టుతున్న కాంగ్రెస్‌ దాన్ని తమ ప్రధాన ఎన్నికల ప్రచార ప్రణాళికగా చేసుకుంటోంది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్‌ తీసుకుందని, మధ్యప్రదేశ్‌లో 50 శాతం తీసుకుంటుందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. 18 ఏళ్ల బీజేపీ పాలనలో 250కి పైగా కుంభకోణాలు వెలుగు చూశాయని కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తోంది.
నేరాలు
రాష్ట్రంలో మహిళలు, దళితులపై పెరిగిన నేరాలు బీజేపీకి వ్యతిరేకంగా మారుతున్నాయి. మరోవైపు ప్రధాని మోడీ మధ్యప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చీతాల ప్రాజెక్టు మసకబారుతోంది. స్వయంగా ప్రధాని మోడీ మధ్యప్రదేశ్‌ వెళ్లి చిరుతలతో ఫోటోలు, వీడియోలు షూట్‌ చేసుకుని టీవీ చానెల్స్‌, న్యూస్‌ పేపర్లు, సోషల్‌ మీడియా వేదికలపై విస్తృత ప్రచారం చేసుకున్నారు. కాని ఈ కునో నేషనల్‌ పార్క్‌ చిరుతలు చనిపోవడం వల్ల ఆ కార్యక్రమంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


ప్రజా సమస్యలు రైతు సమస్యలు
రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలున్నాయి. రైతు, నిరుద్యోగం, విద్య, ఆరోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండడం బీజేపీకి మైనస్‌ పాయింట్‌. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడం, ఎరువుల కొరతతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు ఆత్మహత్యలు, కరువు వంటి పరిస్థితులు బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రంలో అధిక నిరుద్యోగ రేటు ఒక సవాలుగా మారింది. నిరుద్యోగ యువతను ఆకర్షించే ప్రయత్నంలో వివిధ పార్టీలు వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఉద్యోగ కల్పనకు కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఆప్‌ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, వారికి ఆర్థిక సాయం అందించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పాఠశాలలు తెరిచినప్పటికీ అర్హత కలిగిన ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు అనేక ఆసుపత్రులలో తగినంత శిక్షణ పొందిన సిబ్బంది, వైద్యులు లేరు. దీంతో ఈ రెండు అంశాలు రాబోయే ఎన్నికల్లో ప్రధాన సవాళ్లుగా మారనున్నాయి.

బుందేల్‌ఖండ్‌ చేతుల్లోనే నిర్ణయాధికారం..
పేదరికం, కరువుకు పుట్టినిల్లుగా గుర్తింపు పొందిన బుందేల్‌ఖండ్‌లో ఆధిక్యం సాధించిన పార్టీకే మధ్యప్రదేశ్‌లో అధికారం దక్కుతుందని గత ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయి. 2003 నుంచి దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతంపై బీజేపీ పట్టు కొనసాగుతోంది. మొత్తం 26 శాసనసభ స్థానాలు ఉండగా.. 2003 ఎన్నికల్లో కమలం పార్టీ 20 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 2008లో 14, 2013లో 20, 2018లో 18 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఈసారి కూడా బుందేల్‌ఖండ్‌లో కమలం వికసిస్తుందా.. లేక మారిన పరిస్థితులతో కాంగ్రెస్‌ లాభపడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ప్రాంతంలో డైమండ్‌ గనులున్నా కరవు, ఆర్థిక అసమానతలు, పేదరికం, కులఘర్షణలు వంటి ప్రధాన సమస్యలున్నాయి. ఉపాధి అవకాశాలు లేక అక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లటం దశాబ్దాల నుంచి పరిపాటిగా మారింది.


2003లో ఈ ప్రాంతానికే చెందిన ఉమాభారతి బీజేపీ ముఖ్యమంత్రిగా పనిచేసినా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. ఆమె ఏడాది కూడా అధికారంలో లేకపోవడంతో ఏమీ చేయలేకపోయారనే వాదన ఉంది. ఇక్కడ 6 ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానాలు ఉన్నాయి. బుందేల్‌ఖండ్‌లో 2018 ఎన్నికల్లో బీజేపీ 16 స్థానాల్లో, కాంగ్రెస్‌ 8 నియోజకవర్గాల్లో గెలుపొందింది. 2008లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన రాహుల్‌ గాంధీ ఇక్కడ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో ఈ ప్రాంత వెనుకబాటుతనం జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. యూపీఏ ప్రభుత్వం బుందేల్‌ఖండ్‌కు రూ. 7 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. అయినా ఇక్కడి భౌగోళిక, సామాజిక పరిస్థితుల కారణంగా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని నిపుణులు చెబుతున్నారు. బీసీలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌ ప్రచారం చేస్తున్న కులగణన అంశం మేలు చేస్తుందనే భావనతో ఆ పార్టీ ఉంది. ఆరు జిల్లాల మేర విస్తరించి ఉన్న బుందేల్‌ఖండ్‌లో సరిహద్దు రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల ప్రభావం ఉంటుంది. యూపీకి చెందిన సమాజ్‌ వాదీ పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీ ఈ ప్రాంతంలో విస్తరించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.


ముస్లీంల ప్రభావం..
230 అసెంబ్లీ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్‌లో 47 స్థానాల్లో ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో 5 నుండి 15 వేల వరకు ముస్లిం ఓట్లున్నాయి. భోపాల్‌ నగరంలో ముస్లిం ఓట్లే కీలకం. 2018లో ముస్లింల మద్దతుతో కాంగ్రెస్‌ 10`12 సీట్లు అధికంగా గెలవగలిగిందనే అభిప్రాయం ఉంది. రాష్ట్రంలో 9`10 శాతం ఉన్న మైనార్టీలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటింగ్‌ చేస్తే ఆ పార్టీ సులభంగా మెజార్టీ సాధించే అవకాశాలున్నాయి. ముస్లిం ఓటర్ల ప్రభావిత నియోజకవర్గాల్లో గతంలో బీజేపీ మైనర్టీ అభ్యర్థులను బరిలోకి దింపినా భంగపాటుకు గురయ్యింది. ముస్లిం ఓట్లతో పాటు బుందేల్‌ ఖండ్‌ ఓట్లపైన భారీ ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ ఏ మేరకు సఫలీకృతం అవుతుందో డిసెంబర్‌ 3న వెలువడే ఫలితాలే తేలుస్తాయి.

=======================


జె.జగదీశ్వరరావు,

పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ