‘యువగళం ‘ పాదయాత్ర కి మంగళమేనా?

Naralokesh:టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ‘యువగళం ‘ పాదయాత్ర కి మంగళం పాడినట్లేనా? పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఆగిపోయిన పాదయాత్ర కొనసాగే దాఖలాలు కనిపించడం లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాబు అరెస్ట్ తో గల్లీ వదిలేసి ఢిల్లీలో తిష్ట వేసిన లోకేష్ లో ..ఎంతసేపూ కేంద్ర పెద్దల మెప్పు పొంది కేసుల నుంచి  ఎలా బయట పడలనే తాపత్రయమే కనిపిస్తోందని పార్టీలో బయట గుసగుసలు వినిపించాయి. కష్ట కాలంలో పార్టీ నేతలకు, కార్యకర్తలకు అండగా ఉండి దిశా నిర్దేశం చేయాల్సిన సమయంలో.. లోకేష్  వ్యవహరించిన తీరుపై  బహిరంగంగానే విమర్శలు వినిపించాయి. కొంతమంది ముఖ్య నాయకులు అయితే లోకేష్ నాయకత్వ పటిమను ప్రశ్నించే పరిస్థితి కనిపించింది. లోకేష్ లో ఆరంభ శూరత్వమే తప్ప పోరాట పటిమ లేదని పార్టీ నేతల్లో చర్చ సైతం జరిగింది.

కాగా టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చారు. మరి లోకేష్ ఇప్పటికైనా పాదయాత్ర మొదలుపెడతారా అంటే ఆ దాఖలాలు అసలు కనిపించడం లేదు. ‘ యువగళం ‘ పాదయాత్ర ఆరంభంలో తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే పట్టుదల లోకేష్ లో కనిపించేది. నాయకత్వ లక్షణాలు పరంగా.. ఆయన నడవడిక, మాటలో  తేడా స్పష్టంగా కనిపించేది.కానీ ఎప్పుడైతే బాబు అరెస్ట్ అయ్యారో లోకేష్ లోని నాయకత్వ లోపం మరోసారి బయటపడింది. 

ఇక బాబు అరెస్ట్ తో జనాల్లోకి వచ్చారు నారా భువనేశ్వరి. వివిధ బహిరంగ సభల్లో పాల్గొని కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.అంతేకాక ‘ నిజం గెలవాలి ‘ అంటూ యాత్రతో జనాల ముందుకు వచ్చారు. ఆమెకు అండగా కోడలు నారా బ్రాహ్మణి తనవంతు పాత్ర పోషించింది. అయితే బాబు ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఆమె  యాత్రకి సైతం పుల్ స్టాప్ పడింది.