Suchitra: అందుకోసమే పిలిచాడు..గందరగోళంలో గిఫ్ట్ ఇచ్చాడు..!

విశీ:

వైరముత్తు – ఓ షాంపూ బాటిల్ కానుక పైగాయని సుచిత్ర ఇటీవల ఓ తమిళ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు..

గీతరచయిత వైరముత్తు గురించి సింగర్ చిన్మయి ఆరోపణలు చేస్తే అందరూ ఆమెనే తప్పుబట్టారు. ఆమే ఏదో తప్పు చేసిందన్నట్లు ఆమెను దూరం పెట్టారు. ఇప్పటికీ ఇంకా ఆమెనే అంటున్నారు. కానీ వైరముత్తు అందరు లేడీ సింగర్స్‌తో అలాగే ప్రవర్తిస్తారు. అది ఇండస్ట్రీలో ఉండే అందరికీ తెలుసు. కానీ ఎవరూ బయటకు చెప్పరు. వైరముత్తు లేడీ సింగర్స్‌కి ఫోన్ చేసి ‘అమ్మా.. మీ గొంతులో గొప్ప భావం ఉంది. మీ గొంతుతో నేను ప్రేమలో పడ్డాను. నా మనసులో ఏదో కొత్త భావన ఏర్పడింది’ అని మాట్లాడతారు. ఆయన నుంచి అలాంటి ఫోన్ కాల్ రాని లేడీ సింగర్ దాదాపు లేనే లేరని నా నమ్మకం.

నాకూ వైరముత్తు నుంచి అలాంటి కాల్ వచ్చింది. నేను పాడిన ఒక మామూలు పాట విని ఆయన ఫోన్ ‘అద్భుతంగా పాడావ్.. నీ గొంతు విని నాలో ప్రేమ పొంగింది’ అన్నారు. అంత మామూలు పాట విని ఎవరికి ప్రేమ పుడుతుందో నాకు అర్థం కాలేదు. ఏదో తేడా కొట్టింది. ‘నీకు ఒక కానుక ఇవ్వాలని ఉంది. మా ఇంటికి రా’ అని ఆయన చెప్పారు. నేను మా అమ్మమ్మను తీసుకుని వెళ్లాను. నాతోపాటు మా అమ్మమ్మ రావడం చూసి ఆయన షాక్ అయ్యారు.

‘అదేంటీ.. నువ్వు మాత్రమే వస్తావని అనుకున్నానే’ అని ఆయన అడిగారు. ‘నేను ఒంటరిగా ఎక్కడికీ రాను. ఎవరో ఒకరు నాకు తోడుగా ఉంటారు’ అని ఆయనకు చెప్పాను. మా అమ్మమ్మ ఆయనతో చాలాసేపు అవీ ఇవీ మాట్లాడింది. మేం బయలుదేరేముందు..

మా అమ్మాయికి ఏదో కానుక ఇస్తానన్నారంట కదా?’ అని అమ్మమ్మ అడిగింది. నిజానికి ఆయన నాతో తప్పుగా ప్రవర్తించడానికే పిలిచారు. కానుక ఇవ్వడానికి ఆయన రెడీగా లేరు. కానీ మా అమ్మమ్మ అలా అడిగేసరికి ఏం చేయాలో తెలీక లోపలికి వెళ్లి, షాంపూ బాటిల్ తెచ్చి ఇచ్చారు.

ఆ ఇంటి నుంచి బయటికి వచ్చాక ఆ షాంపూ బాటిల్‌ని పారేయాలా అని అనుకున్నాను. ఇక్కడ వద్దు అని మా అమ్మమ్మ దాన్ని ఇంటిదాకా తీసుకొచ్చింది. మా ఇంట్లో షోకేసులో చాలాకాలంపాటు ఆ షాంపూ బాటిల్ ఉంది. ఎవరైనా వచ్చి ‘ఇదేంటిక్కడ?’ అని అడిగితే వైరముత్తుతో నాకు జరిగిన అనుభవం గురించి చెప్పేదాన్ని. వారు పడీ పడీ నవ్వుకునేవారు. ఆ తర్వాత కూడా వైరముత్తు నుంచి కాల్స్ వచ్చాయి. కానీ నేను అటెండ్ చేయలేదు. కొన్నాళ్లకు నాతో వర్కవుట్ కాదని ఆయన వదిలేశారు.

Optimized by Optimole