బండి సంజయ్ అరెస్ట్ పై దుమారం!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు తీవ్ర దుమారం రేపుతోంది. ఈనేపథ్యంలో అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు బీజేపీ నేతలు. పోలీసులు ఎంపీ క్యాంపు కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించ‌డ‌మే కాకుండా డోర్లు ప‌గ‌ల గొట్టడం, గ్యాస్ క‌ట్టర్లు, రాడ్లు వినియోగించ‌డంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క‌రోనా నిబంధన‌ల‌కు అనుగుణంగా జాగ‌రణ చేస్తుంటే.. పోలీసుల‌కు, ప్రభుత్వంకు వ‌చ్చిన ఇబ్బంది ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.
కాగా బండి సంజయ్ అరెస్టు, తాజా రాజకీయ పరిణామాలపై అత్యవసర సమావేశం నిర్వహించారు బీజేపీ నేతలు. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ తోపాటు లక్ష్మణ్, డీకే అరుణ సమావేశానికి హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కేసీఆర్‌ ప్రభుత్వ తీరుకు నిర‌స‌నగా 13రోజుల పాటు నిర‌స‌న కార్యక్రమాల‌కు పిలుపు నిచ్చారు. కోర్టు తీర్పును గౌర‌విస్తామ‌ని.. రాష్ట్ర ప్రభుత్వ ద‌మ‌న కాండ‌ను ప్రజ‌ల్లోకి తీసుకు వెళ్ళేందుకు ఈ కార్యక్రమాల‌ను వినియోగించుకుంటామంటున్నారు బీజేపీ నేతలు. . ఈ 13రోజుల పాటు కేంద్ర మంత్రులు కాని జాతీయ నేతల స‌మ‌క్షంలో నిర‌స‌నలు చేపట్టనున్నారు.
ఇక సంజయ్‌ అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యాల‌యాలో న‌ల్ల బ్యాడ్జీలతో నిరసన చేప‌ట్టాల‌ని నిర్ణయించారు. అన్ని మండ‌ల‌, జిల్లా బీజేపీ కార్యాలయాల వ‌ద్ద న‌ల్ల బ్యాడ్జీల‌తో నిర‌స‌న తెలియ‌జేయాల‌ని పిలుపునిచ్చారు. అటు… బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా సైతం హైద‌రాబాద్ వస్తున్నారు. బండి అరెస్ట్‌, పోలీసుల తీరు గురించి ఆయ‌న‌కు కు వివరించనున్నారు బీజేపీ నేతలు. అయితే… జేపీ నడ్డాతో హైద‌రాబాద్‌లోనే నిరసన చేపట్టాలా లేక క‌రీంన‌గ‌ర్ ఎంపీ క్యాంపు కార్యాలయానికి తీసుకు వెళ్లాలా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. కరీంన‌గ‌ర్ కే న‌డ్డాను తీసుకు వెళ్ళాల‌ని భావిస్తే పోలీసులు ఎలా స్పందిస్తారన్న దానిపైనా చర్చించారు. అయితే న‌డ్డా ప‌ర్యట‌న‌పై ఇవాళ మ‌ధ్యాహ్నం కు గాని క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం లేదు…
మరోవైపు బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. తెలంగాణలో బీజేపీ బలపడుతుండటం ఓర్వలేక కేసీఆర్ ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బండిసంజయ్ అరెస్టు విషయాన్ని అంత తేలిగ్గా వదలమని హెచ్చిరించారు.
అటు… బండి సంజయ్‌ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది కరీంనగర్ కోర్టు. సంజయ్ తో పాటు మరో నలుగురికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో బండి సంజయ్ ని కరీంనగర్ జైలుకు తరలించారు. సంజయ్ తమపై దాడి చేశారని, విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గతంలో బండి సంజయ్ పై నమోదైన 10 కేసులను కూడా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. కేసీఆర్ సర్కారు చేస్తున్న ప్రతిదానికి మూల్యం చెల్లించక తప్పదన్నారు బీజేపీ నేత, లాయర్ కటకం మృత్యుంజయం. ఎంపీ ఆఫీసుపై పోలీసులే దాడి చేసి… మళ్లీ వాళ్లే కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.

Optimized by Optimole